ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఏఁబదియేడవ పద్యము:
చంపకమాల:
తొలిఁ, దపియించుచుం జిదవధూత పణం బిడ, శ్రీనివాస! దా
పులఁ బిలువన్, వెసన్ వెడలి, భూషణ మొక్కటి వీడి, తప్డు గా
సిలి నృపుఁ డాతనిం జెఱనుఁ జేరుప, దంతిగఁ జేరి, తింటె, లో
పలి చెఱకున్! హరీ! తబిసి వాంఛనుఁ దీర్చితె! తార్క్ష్య! కేశవా! 57
గర్భిత కందము:
తపియించుచుం జిదవధూ
త పణం బిడ, శ్రీనివాస! దాపులఁ బిలువన్,
నృపుఁ డాతనిం జెఱనుఁ జే
రుప, దంతిగఁ జేరి, తింటె, లోపలి చెఱకున్! 57
గర్భిత తేటగీతి:
చిదవధూత పణం బిడ, శ్రీనివాస!
వెడలి, భూషణ మొక్కటి వీడి, తప్డు
చెఱనుఁ జేరుప, దంతిగఁ జేరి, తింటె!
తబిసి వాంఛనుఁ దీర్చితె! తార్క్ష్య! కేశ! 57
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి