Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జనవరి 29, 2014

సమస్య: సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

తేది: జూలై 05, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా రెండు పూరణములు

(1)


ఓ నీలకంఠ! ధూర్జటి!
ఓ నిటలాక్ష! పరమేశ! ఓ త్రిపురారీ!
ఓ నగజావర! నగ వా
సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

(2)


శ్రీ నిలయ! చక్రధర! ల
క్ష్మీ నాథా! పద్మనాభ! శేష శయన! శ్రే
ష్ఠా! ఽనంత! సప్తగిరి వా
సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

మంగళవారం, జనవరి 28, 2014

పద్య రచన: లక్ష్మీగణపతుల పూజ

తేది: జూలై 05, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


కం.
సూక్ష్మమున మోక్ష మిచ్చెడు
లక్ష్మీ గణపతుల పూజ లక్షణముగ నా
నా క్ష్మాదేవులు సేతురు
పక్ష్మలితము లేక దృష్టిఁ బఱపుచు భక్తిన్!
(పక్ష్మలితము = ఱెప్పపాటు)

తే.గీ.
ధూప దీప నైవేద్య హారోపచార
భూష ణాభిషే కారాధ్య పూర్ణ కుంభ
పూజ నాదులు మఱియు దేవోత్సవములు
రథ విహారమ్ము లర్చక ప్రవరు లిడుచు!

ఆ.వె.
నిత్య జీవితమును నిర్మ లామోదులై
గడపు చుందు రెలమిఁ గ్రమము గాను!
దైవ భక్తి తోడ తరతరమ్ములు గోరి
యర్చ సేయు చుందు రర్చకు లటు!!


సోమవారం, జనవరి 27, 2014

సమస్య: పితరుని వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు

తేది: జూలై 04, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


వేఁట నెపమున వని కేఁగి, వెంట సుతుని
నిడుకొనియు, నొక్క కిటిఁ జూచి, “కొడుక! దానిఁ
జంపి మాంసమ్ముఁ దిను” మన; సమ్మతించి
పితరుని, వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు!

ఆదివారం, జనవరి 26, 2014

పద్య రచన: అమర వీరుఁడు...భగత్ సింగ్!

కవి పండిత మిత్ర పాఠక వీక్షకులందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


తేది: జూలై 04,2012 నాటి శంకరాభరణంలో్ని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు



శా.
వంశమ్మేది, మతమ్మునేది, ఘనసంపద్యోగ్యవిద్యాది మా
నాంశమ్మును విడనాడి, వీరయువకుం, డంతర్విచారుండు, ద్వా
వింశత్యబ్దసుశోభితుండు నెటులీ శ్వేతాభిపాలుండ్రఁ బూ
ర్ణాంశార్తిం బడఁజేసి, తాను వెసఁ బాఱంద్రోలఁగాఁ బూనెనో?

ఆ.వె.
పూవు పుట్టఁగానె పొందును పరిమళం
బనెడి మాట నిజము! భగత సింహుఁ
డింటఁ జిన్ననాఁట నెంతలేసి పనులు
చేసినాఁడొ ప్రజల స్వేచ్ఛ కొఱకు!

తే.గీ.
తాత గధరు విప్లవసంస్థకై తమిఁ గొన,
మేనమామయుఁ జేరంగఁ, దానుఁ జేరి,
తెల్లదొరలును వణకుచుఁ దల్లడిల్ల,
నుల్లసిల్లెను నుల్లమ్ము పల్లవింప!

కం.
కంపితులై శ్వేతముఖులు
తెంపరియౌ మాతులు నురి దీయంగను, రో
దింపక, నుగ్రుండయి కనుఁ
గెంపులు నిప్పుకలు రాల్పఁ గెరలె యముండై!

సీ.
అగ్గింప నెగసిన యగ్నికీలను బోలి
      శుక్లాననులఁ జేసె విక్లబులుగ;
సితవక్త్రులు వణంక సింహనాదముఁ జేసె
      భూనభోంతరములు బొబ్బరిలఁగ;
ధరియించి శస్త్రముల్ ధవళాస్యులకు గర్వ
      భంగమ్ముఁ జేసె విభ్రాంతి సెలఁగ;
పాండురవదనులఁ బాఱిపోవఁగఁ జేసె
      వీరత్వమును జూపి భీతిలంగ;
గీ.
రకరకమ్ముల విలసిల్లి రంగు మీఱి
భగతసింహుని శౌర్యమ్ము వఱలుచుండఁ,
గినుకఁ బూని యాంగ్లేయులు గనలుచుండి
రగ్గిపై వేయ నెగసెడి గుగ్గిల మయి!

ఆ.వె.
భారతీయులపయి ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి పాలకు లటు;
లంత భగత సింగుఁ డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ బట్టుబడెను!

కం.
ఉరిశిక్ష వేసినంతనె,
స్థిరమగు నానంద మెలమి ధీరత నిడఁగన్,
వరయుతుఁ డగు నా వీరుఁడు
"భరతాంబకు జే" యటంచుఁ బాసె నసువులన్!

తే.గీ.
అమరుఁడైనట్టి యా వీరు నాత్మలోన
నేఁటి దినమున స్మరియించి, నిశ్చలమగు
దేశభక్తియె మనమున దీప్తు లెసఁగ,
నతనిఁ గొనియాఁడుఁడీ భారతాంబ మ్రోల!

జై హింద్!

శుక్రవారం, జనవరి 24, 2014

సమస్య: గురుపత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్

తేది: జూలై 03, 2012 నాటి శంకరాభరణంలోని

సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


 


గురువు దివి కేఁగె, శిష్యుం
డురు గతి హరిఁ గోరి తపము నుగ్రతఁ జేయన్,
వరమిడ, దివికిని బొమ్మని
గురుపత్నినిఁ గోరువాఁడె గుణవంతుఁ డగున్!



గురువారం, జనవరి 23, 2014

పద్య రచన: వేదవ్యాసుఁడు

తేది: జూలై 03, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన సీసపద్యము


సీ.
విభజించె నెవ్వాఁడు వేదమ్ములను శ్రుత
      రూప మిళితమౌ విరూప మెఱిఁగి;
విరచించె నెవ్వాఁడు ధర భారతమ్మును
      జన మనమ్ముల నీతి సరణిఁ దెలిసి;
లిఖియించె నెవ్వాఁడు లీలఁ బురాణాల
      గురుజన సుగతిఁ జేకూర్పనెంచి;
సూత్రించె నెవ్వాఁడు శ్రుత్యంత దర్శనం
      బపునరావృత్తి నేర్పఱుపఁ గోరి;
గీ.
యతఁడె వ్యాసమునీంద్రుండు, నతఁడె కృష్ణుఁ,
డతఁడె సాత్యవతేయుండు, నతఁడె గురుఁడు,
నతఁడె బాదరాయణముని, యతఁడె యోగి,
యతని పాదాబ్జములకు నే నంజలింతు!!

సోమవారం, జనవరి 20, 2014

సమస్య: దూతను వధించు టెంతయు నీతి యగును

తేది: జూలై 02, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన రెండు పూరణములు


(కురుసభలో సుయోధన దుశ్శాసనాదులు శ్రీకృష్ణుని బంధింప యత్నించు సందర్భము)

తే.గీ.
"దూతను వధించు టెంతయు నీతి యగును
నిపుడు శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివె" న
నుచు సుయోధన దుశ్శాసనాదు లకట
పట్టఁజన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!

***            ***           ***          ***          ***           ***          ***


(ప్రహస్తుడు రావణునితో హనుమంతునిగూర్చి పలికిన మాటలు)

కం.
సీత చెర మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని నసురులఁ గూల్చెన్!
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! నిజ మిది వినుమా!!

శనివారం, జనవరి 18, 2014

పద్య రచన: బాల కార్మికులు

తేది: జూలై 02, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన సీసపద్యము


సీ.
బాలికల్ చదివిన భవితకే వెలుఁగన
....ధనహీన బాలిక తట్ట మోసె! 
తల్లిదండ్రుల చాటు పిల్ల యనంగను 
....తలిదండ్రులకె యండ తాన యయ్యె! 
చిదిమిన పాల్గాఱు చిఱుత వయస్సున 
....బాలకార్మిక వృత్తిఁ బడయ వలసె! 
బడిబాట పట్టెడి బాల్యమ్ము నందునఁ 
....బరువిడి పనిబాట పట్ట నెంచె! 
గీ.
సంపదలు గల్గు వారికే చదువు లాయె!
కటిక నిరుపేద కలలన్ని కల్ల లాయె! 
బాలహక్కుల చట్టాలు వట్టి పోయె! 
పసిఁడి బాలల బ్రతుకులు బండలాయె!! 

శుక్రవారం, జనవరి 17, 2014

సమస్య: శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియులకు

తేది: జూలై 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము



సకల ప్రాంతమ్ములందు సస్యములు సిరుల
ఫలము లీయంగఁ, బ్రజలంత పరమశాంతి
సౌఖ్యము లనుభవించుచు సఖ్యతఁ గన,
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు!


గురువారం, జనవరి 16, 2014

పద్య రచన: విశ్వకవి - రవీంద్రనాథ ఠాగూర్

తేది: జూలై 01, 2012 నాటి శంకరాభరణంలోని
పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన సీసపద్యము


"జన గణ మన" యంచు జాతీయగీతమ్ము
....ప్రజల కిచ్చియు, మెప్పు బడసె నెవఁడు?
గీతాలతో భక్తి గీతాంజలి రచించి, 
....నోబెలు బహుమతి నొందె నెవఁడు? 
విశ్వకవీశుఁడన్ బిరుదుతో లోకాన 
....ఖ్యాతి వహించిన ఘనుఁ డెవండు? 
శాంతినికేతన స్థాపనంబును జేసి, 
....లలితకళలఁ బెంచి, వెలిఁగె నెవఁడు? 

తానె, ఠాగూరువంశ సత్కవివరుండు;
విశ్వభారతీ హృదయ సంవేద్యయోగి;
భరతమాతాఖ్య సత్పుత్రవర విశిష్టుఁ,
డల రవీంద్రనాథుండు, విమలగుణుండు!

మంగళవారం, జనవరి 14, 2014

పద్య రచన: అంపశయ్య

కవి పండిత సాహితీ మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

తేది: జూన్ 26, 2012 నాటి శంకరాభరణంలోని
పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన ఉత్పలమాలా వృత్తము

భారతయుద్ధమందుఁ గురువర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
ర్వారనిషంగుఁ డర్జునుఁడు వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
గోరఁగ, నేర్పరించి, తన కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ, గం
సారియు, ధర్మజుండు, ననిలాత్మజుఁడున్, గవలెల్ల మెచ్చఁగన్!

సోమవారం, జనవరి 13, 2014

పద్య రచన: ఆడపిల్ల

కవి పండిత మిత్ర వీక్షకులకు
భోగి పర్వదిన శుభాకాంక్షలు!

తేది: జూన్ 30, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన పద్యములు


సిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !


“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్లె,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !


కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్ప ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !

శనివారం, జనవరి 11, 2014

సమస్య: రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్

తేది: జూన్ 27, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా రెండు పూరణములు
(1)
ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
డ్గుణముల డుల్చి, సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!

(పై పద్యములోని మొదటి పాదము చివరన షడ్గుణములకు బదులుగా, దుర్గుణముల అని చదువుకొనగలరు) 


(2)
గణపతి, విఘ్నహారియు, నగాత్మజకుం దొలి పుత్రకుండు, స
ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
ప్రణతుల స్వీకరింపఁగను బ్రార్థన సేసిన నన్ను దేర్చు కా 
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్! 

శుక్రవారం, జనవరి 10, 2014

పద్య రచన: వనమయూరము (ముద్రాలంకారం)

తేది: జూన్ 27, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన వనమయూర వృత్తము


ఓ కవియఁగన్, వనమయూరము కలాపిన్,
గోక పురివిప్పి, జతఁగోరి, మనువాడన్,
గేకిసలు గొట్టుచును కేకి నిఁటఁ గూడన్,
లోకమున వర్షములు లోలతను జూపెన్!

(ఓ = మేఘము)

గురువారం, జనవరి 09, 2014

సమస్య: భోగరక్తుఁడగు ముముక్షు వెపుడు

తేది: జూన్ 12, 2012 నాటి శంకరాభరణంలోని

సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


ఇహముకన్న పరము నేజీవునకునైనఁ
గోరఁదగిన దనుచుఁ, జేరఁ బిలిచి,
గురుఁడు బోధ సేయఁ, గోరును, బరలోక
భోగరక్తుఁడగు ముముక్షు వెపుడు!


మంగళవారం, జనవరి 07, 2014

సమస్య: ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్

తేది: జూన్ 22,2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము



మేలగు బహువిధ క్రతువుల
లీలం దగఁ జేయుచుఁ, దులలేని విధముగా

నేలుచు, సత మరిషడ్వ
ర్గాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్!

సోమవారం, జనవరి 06, 2014

సమస్య: దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్

తేది: జూన్ 21,2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము

అశుభములఁ దొలఁగఁ జేసెడి
కుశలుఁడు దాశరథి, కౌశికునితోఁ బోవన్
దిశ నట నిర్దేశింపఁగ
దశరథుఁడే,
వనులకేగెఁ దపసులు మెచ్చన్!

ఆదివారం, జనవరి 05, 2014

సమస్య: బిడ్డఁడా వాఁడు రణరంగ భీకరుండు

తేది: జూన్ 19, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


చూడఁగను నా సుభద్రాత్మజుండు పోర
గెలువఁగాను పద్మవ్యూహ మెలమిఁ జొచ్చి,
కురుమహావీరులనుఁ జీల్చి, కూలెఁ దుదకు!
బిడ్డఁడా వాఁడు? రణరంగభీకరుండు!

శుక్రవారం, జనవరి 03, 2014

దత్తపది: ’అక్క-అన్న-వదిన-మామ’...రావణునకు మండోదరి చేసిన హితబోధ...నచ్చిన ఛందస్సులో

తేది: జూన్ 25, 2012 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన ఇచ్చిన
’అక్క-అన్న-వదిన-మామ’ పదములను ఉపయోగించి,
రావణునకు మండోదరి చేసిన హితబోధను గూర్చి
నచ్చిన ఛందస్సులో రాయమనగా
నేను రాసిన రెండు తేటగీతులు



(1)
నాథ! య క్కపివరు మాట నాలకించి,
య న్నరుని భార్య సీతను మన్నన లిడి,
నీవ దినమణి కుల ఘను నికటమునకుఁ
జేరఁగాఁ బంపుమా మనసార నిపుడ!

(2)

స్వామి! య క్కపివరుఁడన్న పగిది, నీ
దినమణి కుల తిలకుని సతి, జనక సుత,
సీత నాదరమున రాముఁ జెంతఁ జేర్చి,
మామక సుతతతి హతమ్ము మాన్పుమయ్య!