Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 31, 2013

సమస్య: కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

చెలులు సంసారి, సన్యాసి తొలి వయసునఁ;
బెండ్లి యాయెను సంసారి, పిదప యేఁటఁ
గొడుకు పుట్టె! సన్యాసికి గురువు కృపను
జేరె మదిని బ్రహ్మజ్ఞాన సారమెల్ల!!

శుక్రవారం, ఆగస్టు 30, 2013

పద్య రచన: లోభి

తాను దినక, పరులకైనను బెట్టక,
కూడఁబెట్టి; నిదురఁ గూడఁ బోక,
రే వగళ్ళుఁ గాచి, ప్రియమారఁ గాంచెడు
లోభి ధనము, మూఁడు లాభములకె?!

(మూఁడు లాభములు=దొంగలపాలు, రాజులపాలు, భూమిపాలు)

సమస్య: సతి సతిఁ గవయంగ సంతు గలిగె

"కళాపూర్ణోదయము"నందలి కథ ననుసరించి  నా పూరణము...

పేర్మిఁ గథల రాజు "పింగళి" కావ్యాన
భార్య భర్త గాను, భర్త భార్య
గాఁగఁ, కాంక్ష హెచ్చఁ, గాంతుఁడై వఱలెడు
సతి, సతిఁ గవయంగ సంతు గలిగె!

గురువారం, ఆగస్టు 29, 2013

సమస్య: భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు

భిన్న సంస్కృతి ప్రాశస్త్య విలసనమ్ము;
నురుదు తెలుఁగు భాషల బాణి నొప్పు వాణి;
నిత్య నూతన మగు వెల్గు! నిజముఁ గన, న
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు!!

బుధవారం, ఆగస్టు 28, 2013

సమస్య: ఒడ్డాణ మలంకరించె నువిద శిరమునన్

కవిపండిత మిత్రులకు, వీక్షకులకు
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!!

అడ్డాల నాఁటి కానుక
నొడ్డాణము యౌవనమున నొప్పి ధరించన్
దొడ్డయిన కారణమ్మున
నొడ్డాణ మలంకరించె నువిద శిరమునన్!

మంగళవారం, ఆగస్టు 27, 2013

పద్య రచన: పకోడీ


పద్యరచనమున సమస్యా(పూరణము)...హాస్యమునకు...

వేఁడిగఁ దినఁగా భార్యను
వేడఁగఁ దా వల్లె యనియుఁ బిండి మసాలల్
గాఢముగ వేసి చేసెఁ; బ
కోడిని దిన బాపనయ్య కోరిక తీరెన్!

సమస్య: ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు

"తామ సాహారముం గొనఁ దగదు; వెల్లి
యుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు
గాను మారుదు" రంచుఁ బల్కంగ వింటి
నాదు బాల్యమ్మునందు మా నాయనమ్మ! (1)

అధిక ధరలచే నుల్లి విహాయసమున
విహరణము సేయుచుండంగఁ బేద లిపుడు
"నుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు!
వలదు తినఁగా" నటంచును బల్కు చుండ్రి! (2)

ఉల్లి చేసిన మేలును దల్లియైనఁ
జేయ దందురు పెద్దలు! శ్రేష్ఠత నిడు
నుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు
కారు కారయ్య శంకరా! కంది వంశ్య!! (3)

సోమవారం, ఆగస్టు 26, 2013

సమస్య: వేశ్య కౌఁగిలింతను (గోరె వృద్ధ యోగి/గోరి వెడలె యోగి)

పృథ్విపైనున్న దినములు వేద పఠన,
పాఠన, తపో విశేష, సద్బ్రహ్మచర్య
దీక్షఁ గడచె! దివికినేగి, స్థిరత దేవ

వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!! (1)

తిరుపతి వేంకట కవుల పూరణ....

[అమలాపురం శతావధానంలో ఇచ్చిన సంస్కృత సమస్య...
అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ

విపిన మధివసంతం మౌనిరాడృశ్యశృంగం
స్వనగర ముపనేతుం తద్గతా వారయోషాః |
వర మతియతిబుద్ధ్యా సస్త్రియా అజ్ఞతాయా
అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ || ]

తిరుపతి వేంకటకవుల సంస్కృత పూరణమున కనుసరణము.

(రోమపాదుఁడు ఋష్యశృంగుని దన నగరమునకు రప్పించిన సందర్భము...)

ఋషి వనస్థిత మౌనీంద్రు ఋష్యశృంగు
స్వీయ నగర ప్రవిష్టుని జేయ నెంచి,
తనదు వారాంగనలఁ బంపఁ దాఁ దెలియక
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి! (2)


"వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!!" యను పాదమును బూజ్యులు నేమానివారి స్ఫూర్తితో మార్చితిని.

ఆదివారం, ఆగస్టు 25, 2013

సమస్య: బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా

సుకరముగఁ గీటకముల శ
లక మొక్కటి పట్టఁగను వల నునుప; నా జా
లిక తెరఁ జిక్కు మశక శా

బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా!

శనివారం, ఆగస్టు 24, 2013

సమస్య: మురళీ గానమ్ము మరణమును గలిగించున్

ధరనుండి ముక్తిఁ గొనియెడి
తరుణ మ్మాసన్నమైన దానవ తతికిన్
నరుఁడైన బాలకృష్ణుని
మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

శుక్రవారం, ఆగస్టు 23, 2013

సమస్య: తీర్థయాత్రల వలన వర్ధిల్లు నఘము

పుణ్యములు వృద్ధిపొందును బూరుషునకు
నిత్య సత్కర్మ, సద్భక్తి, సత్యవాక్కు,
తీర్థ యాత్రల వలన! వర్ధిల్లు నఘము
దౌష్ట్యములు సేయఁగా నిరతమ్ము! నిజము.

పద్యరచన: తిరుగలిసరవిఁ దప్పక సంసార చక్రమందుఁ
దిరుగలికి వలె దంపతుల్ దీక్షనుంద్రు!
తిరుగుచున్ భర్త జీవికఁ దెచ్చుచుండు;
తిరముగా భార్య యింటిని దీర్చి దిద్దు!!

గురువారం, ఆగస్టు 22, 2013

సమస్య: రామ భక్తులలో మేటి రావణుండు

విష్ణువుం జేరఁ ద్వరపడె! ప్రేమ వీడి,
వైరమును బూనె! పలుమఱు వైష్ణవులను
బాధపెట్టె! సీతను దెచ్చె! వైరులైన
రామభక్తులలో మేటి రావణుండు!! (1)తల్లి పనుపున శివునికై తపము సేసి,
యాత్మలింగమ్ము కొఱకు దేహమును మిగులఁ
జిదుపలుగఁ జేసి, గెలిచిన శివమతాభి
రామ భక్తులలో మేటి రావణుండు! (2)తల్లి యాత్మలింగముఁ గోరఁ దపము సేసి,
తనువు ఖండించుకొని, రజతాద్రి నెత్తి,
శంకరుని గెల్చుకొనె, గిరిజా మనోభి
రామ భక్తులలో మేటి, రావణుండు! (3)
బుధవారం, ఆగస్టు 21, 2013

సమస్య: సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్


జ్ఞాన ప్రదాత్రి! మాతా!
గానము సాహిత్యము నిడి, కాచెడి తల్లీ!
యో నుడువుల చదువుల దొర
సానీ! నీ సాటి కలరె సాధ్వుల లోనన్?

పద్యరచన: రక్షాబంధనము

కవి పండిత మిత్రులందఱికి
రక్షాబంధన దినోత్సవ శుభాకాంక్షలు!

సాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షా బంధన దిన మనురాగ దినమ్మే!

మంగళవారం, ఆగస్టు 20, 2013

సమస్య: యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము
ఉత్సాహవృత్తము:

మోదమంది యాదిశక్తి పోరునందు రాక్షసుల్
రోదనమెయి పాఱిపోవ ద్రుత విధమున గదలతో
మోదె! మహిషు నెదను శూలము - యమ మహిష ఘంటికా
నాద మతిహితమ్ము కాఁగ - నాటె రౌద్రమూర్తియై! (1)
తేటగీతి:
మరణ కాల మాసన్నమౌ నరుల కపుడు
కర్ణపేయ మ్మగును గాదె కాంచఁ గాల
యమ మహిష ఘంటికానాద! మతి హితమ్ము!
శుభము! భవ సాగర తరణ సూచితమ్ము! (2)
సోమవారం, ఆగస్టు 19, 2013

సమస్య: వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

కోరికలు గణియింప నపారములయ;
వనరులో మఱి గణియింపఁ బరిమితమయ!
కోరికయె తీఱ, మఱియొక్క కోర్కి యెపుడు
వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!! (1)

కోరికలు గణియింప నపారములయ;
వనరులో మఱి గణియింపఁ బరిమితమయ!
కోరికయె తీఱ, మఱియొక్క కోర్కి బాము

వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!! (2)

కాల మహిమచేఁ బనిఁ గొని కష్టము లవి
వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!
చంద్రమతి, సీత, ద్రౌపది సరసఁ జేరి,
కష్టములు కాల మహిమచేఁ గాల్ప లేదె? (3)

ఆదివారం, ఆగస్టు 18, 2013

సమస్య: భీమసేనుండు దేవకీ ప్రియ సుతుండు

అని సమాప్తినిఁ బాండవు లాంబికేయుఁ
జేర, నాలింగనముఁ గోరెఁ; జేరఁ బోయె
భీమసేనుండు; దేవకీ ప్రియ సుతుండు
లోహ మూర్తిఁ గౌఁగిలిఁ జేర్చి, ప్రోచె నపుడు! (1)


హ్రదము దాఁగిన రారాజు ననికిఁ బిలిచి
భీమసేనుండు, దేవకీ ప్రియ సుతుండు
నూరువునుఁ జూప,  విఱిచి, మనోగతార్థ
ముం గనం, బొందె సంతోషముం ద్రుపదజ! (2)

శనివారం, ఆగస్టు 17, 2013

సమస్య: మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట

బాణు రచన "కాదంబరి" బాగుగాను
బండిత కవులందఱికిని బఠన యోగ్య!
మట్టి కావ్య రసమ్మను మధురమైన
మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!!

(మద్యమునకు కాదంబరియను నర్థమును గలదు)

సమస్యలు: 1.పుస్తకమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము 2.స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే

1.
ఉత్సాహవృత్తము:
మోహియు న్నిరక్షరాస్య మూఢుఁ డైనవాని, దు
స్సాహసిని, "గరుడ పురాణ సార మెఱుఁగు"మనఁగ; ను
త్సాహ ముడిగి, నటనతోడఁ జదువునట్టి, యా విరా
డ్వాహుఁ బుస్తకమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్మిలన్!

2.
నీతి గల నాయకులకే
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు! స్వార్థపరుల కే
రీతిని దక్కును? "వందే
మాతర"మన, భరతమాత మన్నించు మనన్!!

గురువారం, ఆగస్టు 15, 2013

పద్యరచనలు: 1. పిడికిట సూర్యుడు 2. స్వాతంత్ర్యపు జండా

పద్యరచన:(16-08-2013)

కం.
పరుచూరి వంశిగారిని
సరసుం డొకఁ డనె, "పిడికిట సవితృని బంధిం
తురె?" ; దానికి వంశియుఁ జి
త్తరు వీ రీతిగను జూపెఁ దత్సరసునకున్!

కవి పండితులకు, వీక్షకులకు అందరికీ
 స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు!!


ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)

శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీన్ మన జయంతిశ్రేష్ఠమే రోదసిన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిం దగ న్నిండఁగన్,
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు తద్భ్రాజత్పతాకమ్మునే!(2)

మత్త.
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులును న్నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!(3)

మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములు న్నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!(4)

*శుభం భూయాత్*

మంగళవారం, ఆగస్టు 13, 2013

సమస్య: కవిత్వ మధములకుఁ గదా (ఛందోగోపనము)

కం.
మదిలో జ్ఞానముఁ బెంచియు
ముద మొనఁగూర్చు సుకవిత్వము సుజనులకుఁ; దా
నదియే జ్ఞానముఁ ద్రుంచియు
మద మొనఁగూర్చుఁ గుకవిత్వ మధములకుఁ గదా!

ఆదివారం, ఆగస్టు 11, 2013

సమస్య: ప్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్

1.
సత్య వచనుఁ డన్న పనుప,
గత్యంతర మేమిలేక గయుఁ గావ, క్షణం
బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్!

2.
(పాశుపతమునకై యర్జునుఁడు చేయు తపముం బరీక్షింపఁ గిరాతుఁడై బలప్రదర్శనము చేసిన శివు నెదుర్కొను శక్తిఁ గోల్పోయిన యర్జునుని దుఃస్థితి వర్ణనము)

అత్యంత బలుఁ, గిరాతునిఁ,
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్;
బ్రత్యక్షమాయె శివుఁడున్;
నిత్య విజయ పాశుపతము నిచ్చె నరునకున్!

శుక్రవారం, ఆగస్టు 09, 2013

చాటువు -1

సరి బేసై రిపు డేల భాస్కరులు భాషానాథ పుత్రా వసుం
ధర నందొక్కఁడు మంత్రి యయ్యె వినుకొండ న్రామయామాత్య భా
స్కరుఁడో యౌ నయితే సహస్రకరశాఖ ల్లేవదే యున్న వే
తిరమై దానము సేయుచో రిపుల హేతి న్వ్రేయుచో వ్రాయుచో..

సమస్యలు: 1.రామజోగిమందు ప్రాణహరము 2.లలితకళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్

1. సమస్య: రామజోగి మందు ప్రాణహరము 

రామజోగి మందు బ్రహ్మేంద్రదివిజుల
కర్ణపేయకార కామృతమ్ము!
రావణాది దుష్ట రాక్షసాధములకు
రామజోగి మందు ప్రాణహరము!!


2. సమస్య: లలితకళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్

సలలిత మోద దాయకము, సద్రస బంధుర సత్ఫలమ్ము స
ల్లలితకళాభిమానము! హలాహల సన్నిభ, మెల్లవారికిన్
జ్వలిత హృదంతర హ్రదము, సంచలితాత్మ నికృంతనమ్ము, దు
ష్ఫలితద, మా కళారహిత సత్త్వ మదెంతయు దుఃఖ దాయియౌ!!