Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జనవరి 27, 2019

సమస్య: గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్


11-01-2019 నాఁడు శంకరాభరణంలో శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్యకు నా పూరణము...


సమస్య: గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్


సంబంధిత చిత్రం


నా పూరణము:

ఉద్వేగోర్జితరోషబోధితవిగర్వోక్తిన్నిశాటేశుఁడే
"మద్వైరిప్రతిహస్తకుం డితనినిన్ మ్రందింప వాలాగ్రసం
విద్వస్త్రమ్ములఁ గాల్చుఁడో" యనఁ బరిప్రేష్యుల్ దదుక్తింజనన్,
దద్వాతాత్మజుఁడల్గి, యెక్కొలుప, సందహ్యార్పితోచ్ఛక్తరం
గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్!


స్వస్తి


శనివారం, జనవరి 26, 2019

అమర వీరుఁడు-అకుంఠిత దేశభక్తుఁడు-భగత్ సింగ్

కవి పండిత మిత్ర పాఠక వీక్షకులందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
శా.
వంశమ్మేది, మతమ్మునేది, ఘనసంపద్యోగ్యవిద్యాది మా
నాంశమ్మును విడనాడి, వీరయువకుం, డంతర్విచారుండు, ద్వా
వింశత్యబ్దసుశోభితుండు నెటులీ శ్వేతాభిపాలుండ్రఁ బూ
ర్ణాంశార్తిం బడఁజేసి, తాను వెసఁ బాఱంద్రోలఁగాఁ బూనెనో?

ఆ.వె.
పూవు పుట్టఁగానె పొందును పరిమళం
బనెడి మాట నిజము! భగత సింహుఁ
డింటఁ జిన్ననాఁట నెంతలేసి పనులు
చేసినాఁడొ ప్రజల స్వేచ్ఛ కొఱకు!

తే.గీ.
తాత గధరు విప్లవసంస్థకై తమిఁ గొన,
మేనమామయుఁ జేరంగఁ, దానుఁ జేరి,
తెల్లదొరలును వణకుచుఁ దల్లడిల్ల,
నుల్లసిల్లెను నుల్లమ్ము పల్లవింప!

కం.
కంపితులై శ్వేతముఖులు
తెంపరియౌ మాతులు నురి దీయంగను, రో
దింపక, నుగ్రుండయి కనుఁ
గెంపులు నిప్పుకలు రాల్పఁ గెరలె యముండై!

సీ.
అగ్గింప నెగసిన యగ్నికీలను బోలి
      శుక్లాననులఁ జేసె విక్లబులుగ;
సితవక్త్రులు వణంక సింహనాదముఁ జేసె
      భూనభోంతరములు బొబ్బరిలఁగ;
ధరియించి శస్త్రముల్ ధవళాస్యులకు గర్వ
      భంగమ్ముఁ జేసె విభ్రాంతి సెలఁగ;
పాండురవదనులఁ బాఱిపోవఁగఁ జేసె
      వీరత్వమును జూపి భీతిలంగ;
గీ.
రకరకమ్ముల విలసిల్లి రంగు మీఱి
భగతసింహుని శౌర్యమ్ము వఱలుచుండఁ,
గినుకఁ బూని యాంగ్లేయులు గనలుచుండి
రగ్గిపై వేయ నెగసెడి గుగ్గిల మయి!

ఆ.వె.
భారతీయులపయి ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి పాలకు లటు;
లంత భగత సింగుఁ డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ బట్టుబడెను!

కం.
ఉరిశిక్ష వేసినంతనె,
స్థిరమగు నానంద మెలమి ధీరత నిడఁగన్,
వరయుతుఁ డగు నా వీరుఁడు
"భరతాంబకు జే" యటంచుఁ బాసె నసువులన్!

తే.గీ.
అమరుఁడైనట్టి యా వీరు నాత్మలోన
నేఁటి దినమున స్మరియించి, నిశ్చలమగు
దేశభక్తియె మనమున దీప్తు లెసఁగ,
నతనిఁ గొనియాఁడుఁడీ భారతాంబ మ్రోల!

జై హింద్!


మంగళవారం, జనవరి 01, 2019

నిషిద్ధాక్షరి: నవ్యాంగ్ల వత్సర శుభాకాంక్షలు! (శ. ష, స - లు లేకుండా)


మిత్రులందఱకు
నవ్యాంగ్లవత్సర శుభాకాంక్షలు!ఇమ్ముగ భోగభాగ్యములవెన్నియొ యిచ్చుచు జీవనమ్మునన్
నెమ్మినిఁ బెంచుచున్మిగుల నేత్రపుఁ బర్వము లేర్పఱింపఁ దా
నిమ్మెయి వచ్చు నూత్నమగు నేఁడిదె చూడుఁడు రెండువేల పం
దొమ్మిది క్రొత్తకోర్కెలను తొల్తొలిఁ దీర్చఁగ నందకత్తెయై!

స్వస్తి