Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, నవంబర్ 29, 2015

సమస్య: వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!

తేది: నవంబర్ 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము 


(దేవకీదేవి కన్న యెనమండ్రు సంతానమందు నార్వురనుం గంసుఁడు చంప, సప్తమ గర్భము పతనమై యాదిశేషుని యంశయగు సంకర్షణునిగ [బలరాముఁడు] రోహిణీగర్భగతుఁడాయె, నష్టమ గర్భము శ్రీకృష్ణుఁడని తెలియునది)తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
గోరి,  దేవకి కన్నట్టి కూర్మి సుతుల
నార్వుర వసుదేవుఁడిడఁగ, నందియుఁ, బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె! (1)


************************************************************


మరణ భయమునఁ గ్రుద్ధుఁడై  వరుసఁగఁ బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
యోగమాయయుఁ దర్జించె "నొక్క బాలుఁ
డంతమొందింప వ్రేపల్లియనుఁ గలఁ" డని! (2)

శుక్రవారం, నవంబర్ 27, 2015

సమస్య: భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్

తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
కుక్షింభరి గోవొక వని
నక్షయ ఘాసమునుఁ దినఁగ, నవ్వేళనె హ
ర్యక్ష మొకం డట క్షుథఁ జని,
భక్షించెను గోవుఁ జంపి! పాప మెటు లగున్?


(గోవు తన యాహారమైన ఘాసము నెటుల భక్షించెనో, యటులనే శార్దూలమును తన యాహారమైన గోవునుం జంపి భక్షించుట పాపము కాదుకదా! యని యనుట)సోమవారం, నవంబర్ 16, 2015

సమస్య: కొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!

తేది: సెప్టెంబర్ 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(తన మాట వినక సీతనుఁ జెఱపట్టిన రావణునితో విభీషణుఁడు పలికిన పలుకులు)"అన్న! వినుమన్న! యిఁకనైన నతివ సీత
నాదరముతోడ నిచ్చి స్నేహమ్మడుగుము!
వానరయుత శ్రీరాముతోఁ బగల కన్నఁ
గొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!!"ఆదివారం, నవంబర్ 15, 2015

దత్త పద్యారంభము: కురునృప! పాండునందను లకుంఠిత...

తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన "కురునృప పాండునందను లకుంఠిత..." అను పోతన భాగవతం లోని (3-98) పద్య ప్రారంభమును కొనసాగిస్తూ నచ్చిన అంశముతో పద్యమును వ్రాయుమనగా నేను వ్రాసిన రెండు పద్యములు(1)
కురునృప! పాండునందను లకుంఠిత శౌర్య సుధీ బలాఢ్యులై
నిరుపమ యుద్ధనైపుణిని నీదు సుత ప్రకరమ్ములన్ వడిన్
గరము దురంత దుఃఖ మిడు కయ్యము నందునఁ గూల్చుచుండఁగన్
ద్వరితగతిన్ యమున్ దమకు దాఁపునఁ గాంతు రధర్మవర్తనుల్ !!


(2)
కురునృప! పాండునందను లకుంఠిత సత్యపరాక్ర మోన్నతుల్
దురమునఁ గృష్ణు సాయమున దుర్జనులౌ భవదీయ సూనులన్
వరుసగఁ జంపఁ బూని యమ బాధలఁ ద్రోయుచుఁ గాలు పాలికిన్
దరుమగ, నీకుఁ దోడెవఁ? డధర్మ నిఘృష్వము వీడు మిమ్మెయిన్ !.

సోమవారం, నవంబర్ 09, 2015

దత్త పద్యారంభము: "ఎందుల కిన్ని బాధల సహింతువు..."

తేది: సెప్టెంబర్ 11, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన పద్య ప్రారంభము "ఎందుల కిన్ని బాధల సహింతువు..." అను వాక్యమునకు కొనసాగింపుగా నేను పూరించిన పద్యము...


(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)
"ఎందుల కిన్ని బాధల సహింతువుమద్రసుతా! యముండ నే!
నిందునిభాస్య! నీ మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వసమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక యిఁకఁ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె స్వశ్వశురు పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక వరుసన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ బోవ, హరి గొబ్బున నింకొక కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర సచ్ఛతునినింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు ద్రొక్కుచున్ "ముదిత! శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల? యిఁకఁ బోఁగదె!" యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు కోర్కెలిడి ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి నీయుమన, సూర్యజుఁ డప్పుడు "సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె! నిదె డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక మఱి వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ భర్తఁ గాంచియు, యమున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ గొంటి! మది కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ గూర్చుమయ్య!" యన, వెంటనె దండి "తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు సంతతిని వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ గన్గొనియు దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ వాక్ప్రతతిఁ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుతవై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా విధులనుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు పొందుగ నిచ్చి యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గమించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి వినసొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర మందిరి భోగము పూర్వ రీతిగన్!!


-:శుభం భూయాత్:-


బుధవారం, నవంబర్ 04, 2015

సమస్య: రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు!

తేది: సెప్టెంబర్ 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ప్రణయి రాధకుం గృష్ణుని  వశ్యతఁ గన,
భక్తి నమలిన శృంగార  సక్తత మదిఁ
దనరుచుండెడు సద్భక్తజన మనోఽభి
రామునకె చెందు నెల్లప్డు  రాధ వలపు!!
మంగళవారం, నవంబర్ 03, 2015

సమస్య: కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!

తేది: సెప్టెంబర్ 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(భవబంధనము లిఁక వలదని యొక మోక్షకాముకుఁ డనంతుని యందు మనస్సును లగ్నము చేసినవాఁడై ముక్తికాంతనుఁ ద్వరగ రమ్మని పిలుచు సందర్భము)సుంతయుఁ దాళక భక్తి న
నంతుని పద పద్మ సక్త నత మానస స
చ్చింతను "నో నిశ్శ్రేయస
కాంతా! ర" మ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!!

సోమవారం, నవంబర్ 02, 2015

సమస్య: దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె!

తేది: సెప్టెంబర్ 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(నాస్తికునిగ జీవించి స్వర్గస్థుఁడైన తన పతినిం గూర్చి చింతించుచు నతని ఛాయాచిత్రమునకు నమస్కరించుచుఁ బల్కిన భార్య పలుకులు)
"జనుల సృష్టించి పోషించి సమయఁజేయు
విశ్వవిభు విశ్వసింపక, వెక్కిరించి,
’దేవుఁడే లేఁ’ డనెడువాఁడు, దేవుఁ డయ్యెఁ,
జిత్రపటమునకెక్కి పూజింపఁబడియె!"