తేది: సెప్టెంబర్ 23, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన ఈశానుని చిత్రమునకు నేను రాసిన పద్యములు...
(బ్రహ్మ వైవర్త పురాణాంతర్గతము)
తే.గీ.
శ్లోకియౌ కృష్ణుఁ డుండ గోలోకమందు;
వామ నేత్రమ్ము నందుండి వ్యాఘ్ర చర్మ
ధారి, ముక్కంటి, భయదుఁడుఁ దగ జనించి,
యపుడు "నీశాన" నామమ్ము నధివహించె! (1)
వ.
అట్లుద్భవించిన దేవదేవుండైన యీశానుని లోకు లెట్లు స్తుతించుచుండి రనగా...(2)
తే.గీ.
ఈశ! శంకర! శివ! పరమేశ! సాంబ!
శీతనగవేశ్మ! శశిధర! క్ష్వేళకంఠ!
వ్యాఘ్రచర్మధర! వికల్ప! వామదేవ!
శూలి! శైలధన్వ! పినాకి! సూక్ష్మ! భర్గ!
చిత్తజహర! త్రిపురభేది! శేషకటక!
లింగమూర్తి! సిద్ధిద! భృగు! లేలిహాస!
త్ర్యంబక! శితికంఠ! కపాలి! ప్రమథనాథ!
వృషభవాహన! విషమాక్ష! విశ్వనాథ!
భస్మదేహ! భార్గవ!మృడ! భవవినాశ!
శర్వ! దక్షాధ్వరధ్వంసి! శాశ్వత!హర!
చంద్రశేఖర! చండ! విశాఖ! భూరి!
సాంఖ్య! పింగాక్ష! పింగళ! శంభు! బుధ్న!
హాటకేశ! కపర్ది! సహాయ! హింస్ర!
స్వస్తిద! వృషధ్వజ! హిరణ్యబాహు! శబర!
వ్యోమకేశ! వృషాకపి! భూతనాథ!
పాహి! కామారి! గౌరీశ! పాహి! పాహి!(3)
-:సర్వేభ్యః సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు:-
-:శుభం భూయాత్:-