తేది: జూలై 14, 2012 నాడు శంకరాభరణంలోని పద్యరచన శీర్షికక్రింద నేను రాసిన పద్యములు....
ఇలఁ దిరువనంత పురమున
తుళు వంశ బ్రాహ్మణుండు తులలేని తప
మ్మెలమిని జేయఁగ రెండేఁ
డుల బాలుండయ్యువిష్ణుఁ డుల్ల మెలర్పన్;
కం.
కనఁ బడఁగ, దివాకరముని
మనమెంతయుఁ బ్రేమ నిండ మన్నన తోడన్
దన యింట నుండు మనఁగా,
"విను! ప్రేమను ననుఁ గను; కన వేనిన్ బోదున్"
ఆ.వె.
అనిన సమ్మతించి యా బాలు నెంతయుఁ
బ్రేమతోడఁ దానుఁ బెంచు చుండ;
నొక దినమున మునియు నకలంకుఁడై పూజ
సలుపు చుండె మిగులఁ దలను వంచి;
తే.గీ.
బాలుఁ డంత సాలగ్రామ మేలొకొ కొని
చనుచు నుండఁగ ముని చూచి, సాగ్రహుఁ డయె;
వెంటనే బాలుఁ డప్పుడు "విను మునీంద్ర!
మున్ను నా యాంక్షఁ దప్పితి; నిన్ను విడుతు!"
ఆ.వె.
అనుచు మాయ మయ్యె; మునియును గుములుచు
'హరియె బాలకునిగ నవతరించి,
ననుఁ గృతార్థుఁ జేయ నా గృహమ్మున నుండ;
గుర్తు పట్ట నైతి; గ్రుడ్డి నైతి!'
తే.గీ.
అనియు వగచుచు ముని యంత నడవి కేగ;
నెదుర నొక పెద్ద వృక్షమ్ము నేల వంగి,
క్రోశ విస్తార విలసిత గోచరమయి,
శేష శయనుని రూపెత్తె చిత్రముగను!
ఆ.వె.
కన నశక్యమైన ఘను, శేష శయనుని
సన్నుతించఁగాఁ బ్రసన్నుఁ డయ్యి,
వచ్చి, యా యనంత పద్మనాభ స్వామి
పద్మ తీర్థ మందుఁ బరిఢవిల్లె!
ఉత్సాహవృత్తము:
ముని యనంత పద్మనాభు మ్రోలఁ బొంగి పోవుచున్
వినుతరీతి దేవళమ్ము విగ్రహ ప్రతిష్ఠచేఁ
గనుల విందు సేయఁ గాను గామితమ్ముఁ దీర్చు దే
వునిగఁ బూజఁ గొనఁగ నిట్లు పూర్ణ రూపమెత్తెగా!
(శ్రీ అనంతపద్మనాభస్వామి మహత్త్వ చరితము సమాప్తము)
***శుభం భూయాత్***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి