ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఏఁబదితొమ్మిదవ పద్యము:
చంపకమాల:
సక! కనఁ, బాలనుం జవితి చంద్రునిఁ గాంచియు, శైలధారి! ఱొ
చ్చొకటొదవన్, హరీ! యచలమూని శ్యమంతక మప్డు తేవ నీ
విఁకఁ జనుఁదేఱి యా యటవిఁ బెన్గొని, భల్లను నంది, కొంటె కొం
డొక సతినిన్, వెసన్ మణిని నుద్వహ మందిడ మాన్య! కేశవా! 59
గర్భిత కందము:
కనఁ, బాలనుం జవితి చం
ద్రునిఁ గాంచియు, శైలధారి! ఱొ చ్చొకటొదవన్,
జనుఁదేఱి యా యటవిఁ బె
న్గొని, భల్లను నంది, కొంటె కొండొక సతినిన్! 59
గర్భిత తేటగీతి:
చవితి చంద్రునిఁ గాంచియు, శైలధారి!
యచలమూని శ్యమంతక మప్డు తేవ
నటవిఁ బెన్గొని, భల్లను నంది, కొంటె
మణిని నుద్వహ మందిడ మాన్య! కేశ! 59
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి