Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 29, 2015

సమస్య: నిటలాక్షుఁడు శివునిఁ జూచి నివ్వెఱఁ బోయెన్!

తేది: మే 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

జటిలుండై దశకంఠుఁడు
కుటిలతఁ బార్వతినిఁ గొనఁగఁ గోరి తపమ్మున్
నిటలేక్షణునకు నిడఁ, ద
న్నిటలాక్షుఁడు శివునిఁ జూచి నివ్వెఱఁ బోయెన్!


(తాననుకొన్న సమయమునకు ముందుగనే నిటలాక్షుఁడైన శివుఁడు ప్రత్యక్షముగా కాఁగా రావణుండు నివ్వెఱఁబోయెనని యెఱుంగునది)
ఆదివారం, జూన్ 28, 2015

సమస్య: కొరవినిఁ గౌఁగిటనుఁ జేర్చుకొనుము లతాంగీ!

తేది: మే 30, 2015 నాటి శంకరాభారణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(ఒక ప్రియుఁడు తన ప్రియురాలితో ముచ్చటించు సందర్భము)

"విరచించితి వన మిచ్చటఁ
దరుణీ! నీ కొఱకు నేను; దరహాసముతో
సురపొన్నలు నగ, వేగమె
కొరవినిఁ గౌఁగిటనుఁ జేర్చుకొనుము లతాంగీ!"

(కొరవి = ఎఱ్ఱగోరంట యని నంది తిమ్మనగారి ప్రయోగము)

శనివారం, జూన్ 27, 2015

సమస్య: బండపైన జొన్నపైరు పండె

తేది: మే 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు(ఒక పిచ్చివాని మాటలు)

"నభము నెక్కి వేగ నావ ప్రయాణించె;
నీటిలోన రైలు నిగిడి సాగె;
నేలపైన చేప లీలగాఁ బరువెత్తె;
బండపైన జొన్నపైరు పండె!" (1)


"పిచ్చి కుదిరెఁ దలకు వేగమే రోఁకలిం
జుట్టుఁ డయ్య మీరు చోద్యముగను!
బండపైన జొన్నపైరు పండెను; కోసి
వంట వండిపెట్టనుంటి మీకు!!" (2)


శుక్రవారం, జూన్ 26, 2015

సమస్య: జగద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁ డుండన్

తేది: మే 28, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన (ఛందోగోపనం, దుష్కరప్రాసతోఁ గూడిన) సమస్యకు నా పూరణములు


నా మొదటి పూరణము:


(యుద్ధవిరమణ సమయమైనదని సైంధవుని నమ్మించుటకు శ్రీకృష్ణుఁడు తన చక్రమును సూర్యున కడ్డుగ నుంచిన సందర్భము ననుసంధానించుకొనునది)


సద్వ్యసనులు పాండవుల న
సద్వ్యసనపరుండు దుష్ట సైంధవుఁ డడ్డన్
దద్వ్యక్తిఁ జంపఁ దివుర
గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁ డుండన్!

***        ***        ***        ***


నా రెండవ పూరణము:

(పతివ్రతా మతల్లి సతీసుమతి ప్రస్తావనము నిట ననుసంధానించుకొనునది)

సద్వ్యసన విముఖు నపటు వి
యద్వ్యాపిత పదము తాఁక, యతి శాప మిడన్,
త ద్వ్యపగతి నిడె సుమతి! 
గద్వ్యాప్తములయ్యె నిరులు, ఖరకరుఁ డుండన్!!

***        ***        ***        ***నా మూఁడవ పూరణము:


(వర్షఋతువున మేఘములు క్రమ్ముకొనఁగా దట్టముగఁ జీఁకటులు క్రమ్మిన సందర్భము)


ఘనకాలమందుఁ జినుకఁగ
ఘనబృందము క్రమ్ముకొనె; జగద్వ్యాప్తముల
య్యె నిరులు ఖరకరుఁ డుండన్
;
జినుకులు దట్టమ్ములయ్యె జేజే వీథిన్!గురువారం, జూన్ 25, 2015

సమస్య: పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు

తేది: మే 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఒక పండితుఁడు బ్రహ్మదేవునిం గోరిన సందర్భము)


"హే విధీ! నా నుదుట కీళు లెన్నియేని
వ్రాసినను నోర్తు నో యయ్య! వలచి వలచి
’పామర కవిత్వమును మెచ్చెఁ బండితుఁ’డను
వ్రాఁత మాత్రము వద్దయ్య బ్రహ్మదేవ!!"బుధవారం, జూన్ 24, 2015

సమస్య: రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

తేది: మే 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు


image of rainfall in a well కోసం చిత్ర ఫలితం


(1)
చెమ్మయును లేని బావుల
కిమ్మగు సలిలమ్ము లుబ్బఁ, గేరింతలతో
రమ్మనెడి జలజలల నీ

రమ్ము, జనాళికిఁ గడు మధురమ్మగును గదా!
(2)
చెమ్మయును లేక యెండిన
కొమ్మలఁ గాయలును నెండి కుమిలిన తఱి, వ
ర్షమ్ముపడ, భూజ ఫలసా
రమ్ము, జనాళికిఁ గడు మధురమ్మగును గదా!
మంగళవారం, జూన్ 23, 2015

న్యస్తాక్షరి: గ్రీష్మతాపము...ఆటవెలఁదిలో...ప్రతిపాదాంతాక్షరము వరుసగా...వ-డ-గా-లి...

తేది: మే 25, 2015 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- గ్రీష్మతాపము
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా 
‘వ - డ - గా - లి’ ఉండవలెననగా
నేను వ్రాసిన పద్యము


ఎండకాయుచుండె నింత వేఁడిమిని
హించి సూర్యుఁ డిట్లు హింసల నిడఁ
బగటిపూట జనులు బయటకురారుగా
యింటనుండునట్టి యిచ్చఁ దేలి!!ఆదివారం, జూన్ 21, 2015

పద్య రచన: కొబ్బరి బొండాం...

తేది: మే 25, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన తేటగీతి పద్యము"ఎండదెబ్బకు దాహ మ్మదెక్కువ యయెఁ!
ద్రాగుటకుఁ జుక్క నీరైన దక్కదాయె!
బుడుత! నాకిమ్ము కొబ్బరిబొండ మిపుడు!
త్రాగి నా దాహ మది తీర నేఁగెదనయ!!"

శుక్రవారం, జూన్ 19, 2015

సమస్య: కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!

తేది: మే 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(బడికి నెగఁగొట్టనెంచి కడుపునొప్పి బాధనభినయించిన బాలుని యుదంతము)


ఇంటిపనినిఁ జేయ నొంటికిఁ బడక, తా
బడికి నేఁగ ననక, బాలుఁ డపుడు
"కడుపునొప్పి"యనఁగ, బడిమాన్ప, ముదమయ్యెఁ!
గడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!!గురువారం, జూన్ 18, 2015

సమస్య: మారుతి యేతెంచె సీత మాయం బయ్యెన్!

తేది: మే 22, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(జనాపవాద భీతిచే శ్రీరాముఁడు సీత నరణ్యమునకుఁ బంపఁగా నచటఁ బ్రాణత్యాగ మొనర్పఁబోవు సీతను వాల్మీకి తన యాశ్రమమునకుం గొంపోయిన తదుపరి యేర్పడిన పరిస్థితులను వివరించు సందర్భము)


చేరంబిల్చియు, దుఃఖవి
దూరుఁడు వాల్మీకిముని బ్రతుకు నిడె! నచటన్
ధీరు లొదవి, యశ్వముఁ గొన,
మారుతి యేతెంచె! సీత మాయం బయ్యెన్!!పద్య రచన: పొగత్రాగుట యనర్థదాయకము!

తేది: మే 22, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నా పూరణము

"పొగత్రాగినఁ జెడిపోదు" వ
నఁగ నింకయుఁ ద్రాగి త్రాగి నరకమునఁ బడన్
నెగడుచు నటులే మఱిమఱి
పొగత్రాగెడువాఁడు దున్నపోతై పుట్టున్!!
బుధవారం, జూన్ 17, 2015

సమస్య: కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనియె!

తేది: మే 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు

ఎన్ని నాళుల నుండియో యింత తపము
చేసి, పూజించి, వేడినం జిత్తమలరఁ
దనదు కోరిక తీఱక, తనరఁ, బరుని
కోర్కె తీఱిన, భక్తుఁడు గొల్లుమనియె! (1)


***        ***        ***        ***ఇర్వుఱును నోర్వలేనట్టి యీసు తోడ
వరములం గోరిరయ్య! దైవమును నొకఁడు
వేడె "నొక కన్నుఁ గొను"మని! "ద్విగుణ" మడిగి,
కోర్కె తీఱిన భక్తుఁడు, గొల్లుమనియె!! (2)
(పై పూరణమునకు మార్గదర్శకులు మిత్రులగు శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారికి ధన్యవాదములతో)


***        ***        ***        ***

ఒక్కఁ డత్యాశచే వేల్పు నొక్క కోర్కి
కోరె "నేను పట్టిన దెల్లఁ గుందన మగు
త" యని! తాను ముట్టఁగఁ దనయ వసువయెఁ!
గోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనియె!! (3)
(పై పూరణమునకు మార్గదర్శకులగు మిత్రులు శ్రీ బొడ్డు శంకరయ్యగారికి ధన్యవాదములతో)
మంగళవారం, జూన్ 16, 2015

పద్య రచన: శ్రీకృష్ణుఁడు పోఁగొట్టిన కుబ్జ త్రివక్రత...

తేది: మే 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన తేటగీతి పద్యము
కంసునకుఁ గలపముఁ ద్రివక్రయను కుబ్జ
తెచ్చుచుండంగ, మధురలోఁ ద్రిమ్మరుచునుఁ
గృష్ణుఁ డా లేపమున నలంకృత తనుఁడయి,
కుబ్జ దేహ త్రివక్రతన్ గూలఁద్రోచె!!సోమవారం, జూన్ 15, 2015

సమస్య: మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!

తేది: మే 19, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు

నా మొదటి పూరణము:


ద్విజుఁడు గరుడుండుఁ దేరయ్యె విష్ణువునకు!
ద్విజుఁడు శేషుండుఁ బరుపయ్యె విష్ణువునకు!
బండియుం బాన్పులై విష్ణు భక్తులయ్యు
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!


(ద్విజుఁడు = రెండు పుట్టుకలు కలవాఁడు > [గ్రుడ్డుగా మొదటిజన్మ, గ్రుడ్డులోనుండి రెండవ జన్మగల] గరుడుఁడు, ఆదిశేషుఁడు...ఇద్దఱును మాంసాహారులే యయినను విష్ణుసేవయొనర్చి మాన్యులైనారు కదా!)


***        ***        ***        ***

నా రెండవ పూరణము:

యజ్ఞపశువును బలియిచ్చి, యట్టి మాంస
మునుఁ దినన్ దామసులకిడి, భుక్తులుగ నొ
నర్పఁ, దద్యజ్ఞఫలదపుం దామస కృత
మాంస భక్షణచే, ద్విజుల్ మాన్యులైరి!


***        ***        ***        ***ఆదివారం, జూన్ 14, 2015

సమస్య: కన్నులన్ మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను!

తేది: మే 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

గోపికలు తాము శ్రీకృష్ణుఁ గూడి యాడి
రాసలీలల మురిసిన రమ్య దృశ్య
ములను మనమిటఁ గాంచంగ వలెనన, మన
కన్నులన్ మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను!శనివారం, జూన్ 13, 2015

సమస్య: జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్!

తేది: మే 17, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పితృ అమావాస్యనాఁ డొక బ్రాహ్మణుఁ డొనర్చిన శ్రాద్ధకర్మ మిటులుండెను)అందఱు పితృదేవతలకు
విందగు తర్పణము నిడెడి విధిఁ...దాలిచియున్
ముందుగఁ గ్రొత్తది...చివికిన
జందెమ్మును విడిచి! యజ్వ జన్నముఁ జేసెన్!!


[అన్వయక్రమము: అందఱు-పితృదేవతలకు-విందగు తర్పణమును-ఇడెడి విధిన్-ముందుగన్-క్రొత్తది-తాలిచియున్-(తదుపరి) చివికిన-జందెమ్మును-విడిచి-యజ్వ-జన్నమున్-చేసెన్]

గురువారం, జూన్ 11, 2015

సమస్య: మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!

తేది: మే 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

జఠరభరనిర్వహణక
ర్మఠజీవనయౌవనభరమదనార్తనుఁ దా
హఠకామోత్కంఠతచే
మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!బుధవారం, జూన్ 10, 2015

సమస్య: గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్!

తేది: మే 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


నా మొదటి పూరణము:


[వోఢ(నందీశ్వరుఁడు) వ్యాధిగ్రస్తుఁడై మార్గమధ్య మందశక్తుఁడై వేడుకొనఁగా, హరుఁ డక్కడనే యున్న గాడిదపై నెక్కి కాశికిఁ నేఁగిన సందర్భము]

వేడుక తోడుత వృషభా
రూఢుండై చనుచునుండ, రుజ బాధితుఁడై
వోఢయె వేడఁగ, నచ్చటి
గాడిదపై నెక్కి, హరుఁడు కాశికి నేఁగెన్!


[శంకరుఁడు భక్త వశంకరుఁడు కావున నందీశ్వరుని బాధించలేకయే దాఁపుననున్న గాడిదపై నెక్కి కాశికిఁ జనెనని చమత్కారము!]


***        ***        ***        ***

నా రెండవ పూరణము:నాఁ డట వేషములన్ గొని,
తోడుగఁ దన పరిజనమ్ముతో, నా వింతన్
వేడుకఁ గనఁ బ్రజ, మోటరు
"గాడి"దపై నెక్కి, హరుఁడు కాశికి నేఁగెన్!

***        ***        ***       ***మంగళవారం, జూన్ 09, 2015

సమస్య: మాటఁ దప్పువారె మానధనులు

తేది: మే 13, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ఇలయు వ్రయ్యలైన, హిమశైలమదరిన,
సూర్యచంద్రులు రహి సోలి చనిన,
గాలి పెచ్చరిలిన, కడలియే యింకిన
మాటఁ దప్పువారె మానధనులు?

***      ***     ***

భావం: భూమి ముక్కలైనా, హిమాలయం కంపించినా, సూర్యచంద్రులు కాంతిని పోగొట్టుకున్నా, సుడిగాలులు ఉవ్వెత్తున విజృంభించినా, సముద్రాలు ఇంకినా (ఇవి అన్నీ జరుగనే జరుగవు...ఒకవేళ జరిగినా) కానీ మానధనులు మాత్రం ఇచ్చిన మాటను తప్పుతారా? తప్పరు గాక తప్పరు...అని భావం! అంటే జరుగనివన్నీ జరుగుతాయేమో గానీ, మానధనులు మాత్రం ఇచ్చిన మాటతప్పరు...అని భావం.
సోమవారం, జూన్ 08, 2015

సమస్య: దొంగకు నమస్కరించిన దొరకు సిరులు!

తేది: మే 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు

నా మొదటి పూరణము:ఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు!!

(సమస్య పాదమును "దొంగకును దండమిడినచో దొరకు సిరులు!" అనినచో నంతయు నచ్చతెనుఁగున
నిటుల నుండఁ గలదు)

ఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకును దండమిడినచో దొరకు సిరులు!

***        ***        ***        ***

నా రెండవ పూరణము:
రాజసూయమ్ము తుదిని ధర్మజుఁడు కోరి
యగ్రతాంబూల మిడెనయ్య హరికి! వెన్న
దొంగకు నమస్కరించిన "దొర"కు, సిరులు
హరియు సమకూర్చె తోడునీ డయ్యుఁ దానె!!

***        ***        ***        ***

నా మూఁడవ పూరణము:

పరుల సొమ్మును దొంగిలింపంగఁ గోరు
"దొంగ"కు నమస్కరించిన "దొర"కు సిరులు
తొలఁగిపోవును, తొలఁగు సంతోషములవి!
యెపుడు దొంగలఁ దరిఁ జేరనీయవలదు!!

***        ***        ***        ***ఆదివారం, జూన్ 07, 2015

పద్య రచన: మారీచవధ, సీతాపహరణ ఘట్టములు

తేది: మే 12, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన పద్యములు


(మారీచవధ, సీతాపహరణ వృత్తాంతము)

ఆ.వె.
సీత నపహరింప సిద్ధుఁడై దశకంఠుఁ
డపుడు తాటకేయు నంపె వనికి!
వాఁడు మాయలేడి వలె వేషముం దాల్చి
జానకి కడ కేఁగి  సంచరించె!!

కం.

సురుచిరమగు జొంపమ్ముల
నురు గతితోఁ దినుచు మఱల నుఱుకుచుఁ దమితోఁ
దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్;

తే.గీ.

సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త,
"నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
బెంచుకొన మనసాయెను బ్రియము తోడఁ
దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!"

ఆ.వె.

అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
"వద్దు వదిన! యీ సువర్ణ హరిణ;
మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
నిది ప్రమాదకరము! హితము గాదు!!"

తే.గీ.

అన్న లక్ష్మణు మాటల నాలకించి,
రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను రమణి సీత
కోరు తొలి కోర్కి తప్పక తీర వలయుఁ;
బోయి వైళమ దెచ్చెద మాయ లేడి!

కం.

మాయ యయినఁ దుత్తునియలు
సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్;
వేయును మాట లిఁకేలా?
పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయె త్వర గతిన్;

ఆ.వె.

సీత సంతసించె శ్రీ రాముఁ డా జింకఁ
బట్టి తెచ్చు నంచుఁ బరవశించి;
లక్ష్మణుండు కన్నులందున సంశయ
మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!

కం.

రాముండటు జింకనపుడు
సేమముగనుఁ బట్టఁగాను స్థిరనిశ్చయుఁడై
నేమమున వెంబడింపఁగ
నా మారీచుండు మిగుల నడలుచుఁ బాఱెన్!

ఆ.వె.

అటులఁ బరుగులెత్తు నా జింకఁ బట్టంగఁ
జిక్కదాయెఁ బరుగు లెక్కువయయె!
రాముఁడపుడు నదియ రాక్షసమాయ య
టంచు శరముచేతఁ ద్రుంచె దాని!!

తే.గీ.

అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యట
రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకును"

కం.

అని సీత వల్క లక్ష్మణుఁ
డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!"

ఆ.వె.

మఱది మాట వినిన మానిని సీత తా
నెంతొ వగచి యతని నింద సేయ;
హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
"గీత దాటకు" మని, గీసి వెడలె!

తే.గీ.

రావణుఁడు యోగి వేషాన రమణి సీత
కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
దాట రాకున్కి, సీతయె దాటి రాఁగ,
నపహరించెను హతవిధీ, యా రమణిని!
(మారీచవధ మఱియు సీతాపహరణ ఘట్టములు సమాప్తము...స్వస్తి)
శనివారం, జూన్ 06, 2015

సమస్య: కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్

తేది: మే 11, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(మయసభయందు సుయోధనుండు భంగపడి, పరితపించిన సందర్భము)ఉత్పలమాలిక:
“ఏలిక కిద్ది వింతె, భళి! యిట్టి సరోజము చిత్రమే సుమా!
చాల కుతూహలమ్ము మన సంతయుఁ గ్రమ్మె” నటంచు శీఘ్రమే
కాలిని నేలపై నిడియుఁ, గ్రక్కునఁ గూపమునందుఁ గూలఁగన్,
దాలిమి లేని చేటి, కని, దబ్బున నవ్వె! సుయోధనుండు “నే
నేలొకొ యా సభన్ గనఁగ నేగితి? నేగితిఁ బో, సరోజ మే
నేలఁ బరీక్ష సేయవలె? నేలొకొ కూపమునందుఁ గూలితిన్?
గూలితిఁ బొమ్ము, ద్రోవదియె గొబ్బున నవ్వె! సహింపఁజాల! నే
నేల సహింపఁగావలెను? నిశ్చయ మిద్దియె, చచ్చె దే నిఁకన్!
జాలు! మనంగ నున్నఁ, దగు చర్యను దానిఁ బరాభవింతు! నా 
కాలికి ముల్లు గ్రుచ్చినది! కావలె గొడ్డలి, దానిఁ దీయఁగన్!!
శుక్రవారం, జూన్ 05, 2015

సమస్య: గంగానది యుప్పునీరు గలదై పాఱెన్

తేది: మే 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణమునింగినిఁ జీల్చి నిదాఘము
పొంగుచు నేలకునుఁ దాకఁ బొగిలి జనులుఁ బో
రంగ దొరువుఁ ద్రవ్వఁగఁ బరఁ
గంగా నది యుప్పునీరు గలదై పాఱెన్!(పరఁగంగాన్+అది...అని విఱచి పఠించునది)

(నిదాఘము=వేసవి వేఁడిమి; దొరువు=సెలయేరు)


గురువారం, జూన్ 04, 2015

దత్తపది: పూరి-వడ-దోస-గారె....భారతార్థంలో...నచ్చిన ఛందంలో...

తేది: మే 09, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
పూరి - వడ - దోస - గారె.
పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము(ఉత్తరగోగ్రహణ సమయమున నంతఃపురకాంతల ముందఱ, బృహన్నల ముందఱ నుత్తరుని ప్రగల్భములు)

"పూరిఁ గఱపించెదను నేను కౌరవులకు!
వడవడ వణకఁ జేసెద బవరమందు!
దోసమును సైఁచుమన్నచోఁ దొఱఁగి చనెద!
పిఱికివారలుగారె యా విమతులంత!"


బుధవారం, జూన్ 03, 2015

సమస్య: సీతను రాముండు దాచి, చిరయశ మందెన్!

తేది: మే 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(హనుమంతుని కోరిక మేరకు శ్రీరాముఁడు సీతతోఁ బాటుగ నతని హృదయమందు వసించెనను సందర్భము)
"తాతా! భక్త జన మనో
నేతా! వసియింపు మెదను నిత్య" మనంగన్,
వాతాత్మజు నెదఁ దననున్
సీతను రాముండు దాచి, చిరయశ మందెన్!

మంగళవారం, జూన్ 02, 2015

పద్య రచన: నీటికోసం జనుల కటకట...(చిత్రం)

తేది: మే 08, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన ఉత్పలమాలికా వృత్తము


త్రాగుదమన్న నీరమెది? దాహము తీరదు! నీటికోసమై
ప్రోగుపడంగ సర్వులకుఁ బోవునె దుఃఖము? నీరు తోడఁగా
వేగిర మంద నీరమును బిందెయు నింపదు! మంటిలోపలన్
బాగుగ నీర మెద్ది? ఘనవర్షము లొక్కట రాక ముందఱన్
వాగులు వంకలన్ మిగుల బాగొనరించియు వేగ పూడికల్
త్యాగయుతాత్ములై త్వరగఁ ద్రవ్వియుఁ దీసియు సాగుచేయఁగా,
వేగమె నీర మెంతొ యిడుఁ బ్రీతిగ వాపి తటాకముల్ సదా!


సోమవారం, జూన్ 01, 2015

సమస్య: వాణికి హరి ప్రాణవల్లభుండు

తేది: మే 07, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ఫాలలోచనుండు ప్రాణవల్లభుఁడు శ
ర్వాణికి! హరి ప్రాణవల్లభుండు
లక్ష్మికి! కమలజుఁడు ప్రాణవల్లభుఁడగు
వాణికి! సతతమ్ము వారిఁ గొలుతు!!