తేది: మే 12, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన పద్యములు
(మారీచవధ, సీతాపహరణ వృత్తాంతము)
సీత నపహరింప సిద్ధుఁడై దశకంఠుఁ
డపుడు తాటకేయు నంపె వనికి!
వాఁడు మాయలేడి వలె వేషముం దాల్చి
జానకి కడ కేఁగి సంచరించె!!
కం.
సురుచిరమగు జొంపమ్ముల
నురు గతితోఁ దినుచు మఱల నుఱుకుచుఁ దమితోఁ
దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్;
తే.గీ.
సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త,
"నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
బెంచుకొన మనసాయెను బ్రియము తోడఁ
దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!"
ఆ.వె.
అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
"వద్దు వదిన! యీ సువర్ణ హరిణ;
మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
నిది ప్రమాదకరము! హితము గాదు!!"
తే.గీ.
అన్న లక్ష్మణు మాటల నాలకించి,
రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను రమణి సీత
కోరు తొలి కోర్కి తప్పక తీర వలయుఁ;
బోయి వైళమ దెచ్చెద మాయ లేడి!
కం.
మాయ యయినఁ దుత్తునియలు
సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్;
వేయును మాట లిఁకేలా?
పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయె త్వర గతిన్;
ఆ.వె.
సీత సంతసించె శ్రీ రాముఁ డా జింకఁ
బట్టి తెచ్చు నంచుఁ బరవశించి;
లక్ష్మణుండు కన్నులందున సంశయ
మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!
కం.
రాముండటు జింకనపుడు
సేమముగనుఁ బట్టఁగాను స్థిరనిశ్చయుఁడై
నేమమున వెంబడింపఁగ
నా మారీచుండు మిగుల నడలుచుఁ బాఱెన్!
ఆ.వె.
అటులఁ బరుగులెత్తు నా జింకఁ బట్టంగఁ
జిక్కదాయెఁ బరుగు లెక్కువయయె!
రాముఁడపుడు నదియ రాక్షసమాయ య
టంచు శరముచేతఁ ద్రుంచె దాని!!
తే.గీ.
అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యట
రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకును"
కం.
అని సీత వల్క లక్ష్మణుఁ
డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!"
ఆ.వె.
మఱది మాట వినిన మానిని సీత తా
నెంతొ వగచి యతని నింద సేయ;
హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
"గీత దాటకు" మని, గీసి వెడలె!
తే.గీ.
రావణుఁడు యోగి వేషాన రమణి సీత
కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
దాట రాకున్కి, సీతయె దాటి రాఁగ,
నపహరించెను హతవిధీ, యా రమణిని!
(మారీచవధ మఱియు సీతాపహరణ ఘట్టములు సమాప్తము...స్వస్తి)
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన ఖండికను అందించారు. అభినందనలు.
‘మాయ+అయిన’ అన్నప్పుడు సంధి లేదనుకుంటాను. యడాగమం రావాలి కదా!
ధన్యవాదాలు శంకరయ్యగారూ! మీరన్నది నిజమే. అక్కడ యడాగమం రావాలి.
రిప్లయితొలగించండిదీనిని....
"మాయ యయినఁ దుత్తునియలు" అని సవరించితిని. పరిశీలించండి.
దోషమును దెలిపినందుకు గృతజ్ఞతలు.
స్వస్తి.