Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 08, 2015

సమస్య: దొంగకు నమస్కరించిన దొరకు సిరులు!

తేది: మే 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు

నా మొదటి పూరణము:



ఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు!!

(సమస్య పాదమును "దొంగకును దండమిడినచో దొరకు సిరులు!" అనినచో నంతయు నచ్చతెనుఁగున
నిటుల నుండఁ గలదు)

ఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకును దండమిడినచో దొరకు సిరులు!

***        ***        ***        ***

నా రెండవ పూరణము:




రాజసూయమ్ము తుదిని ధర్మజుఁడు కోరి
యగ్రతాంబూల మిడెనయ్య హరికి! వెన్న
దొంగకు నమస్కరించిన "దొర"కు, సిరులు
హరియు సమకూర్చె తోడునీ డయ్యుఁ దానె!!

***        ***        ***        ***

నా మూఁడవ పూరణము:





పరుల సొమ్మును దొంగిలింపంగఁ గోరు
"దొంగ"కు నమస్కరించిన "దొర"కు సిరులు
తొలఁగిపోవును, తొలఁగు సంతోషములవి!
యెపుడు దొంగలఁ దరిఁ జేరనీయవలదు!!

***        ***        ***        ***



1 కామెంట్‌:

  1. facebook లోని "కవితాంకురం"లోని ఈ టపాకు సంబంధించిన వ్యాఖ్య...

    కొంపెల్ల రామకృష్ణమూర్తి మరియు Suresh Ganti దీన్ని ఇష్టపడుతున్నారు.

    కొంపెల్ల రామకృష్ణమూర్తి: చక్కగా ఉన్నాయి మీ పూరణలు మధుసూదన్ గారూ.


    గుండు మధుసూదన్: ధన్యవాదాలండీ! _/|\_

    Suresh Ganti: Padyaalu chakkaga unnayi sir dhanyavaadamu.


    Suresh Ganti: Krushnuni prastavana rakunda halahala bhakshana sanniveshaanni (shiva) poorinchandi, please. ..


    గుండు మధుసూదన్: ధన్యవాదాలు Suresh Ganti గారూ! మీరు కోరినట్లే ప్రయత్నిస్తున్నాను. బాగోగులు మీరు పరిశీలించి తెలుపఁగలరు! చదవండి:

    దేవదానవుల్ శ్రమియించి తివుర మొదట
    హాలహలముద్భవించి జగాలఁ గాల్ప
    శివుఁడు బాలుండు వెన్న భుజించినట్లు
    గాను త్రాగియు జగతినిఁ గాఁచెనయ్య!

    Suresh Ganti: Bagundi sir! kani, indulo dongaku namaskarinchina doruku sirulu ani cover ayye vidhamga dayachesi prayatninchandi

    గుండు మధుసూదన్: ధన్యవాదాలు Suresh Ganti గారూ! మీరు కోరినట్లే రెండవసారి ప్రయత్నిస్తున్నాను. బాగోగులు మీరు పరిశీలించి తెలుపఁగలరు! చదవండి:

    దేవదానవుల్ శ్రమియించి తివుర మొదట
    హాలహల ముద్భవించి జగాలఁ గాల్ప,
    దానిఁ ద్రావి, జనుల వ్యథఁ ద్వరఁగ దోచు
    దొంగకు, నమస్కరించిన, దొరకు సిరులు!

    Suresh Ganti: Adbhutam pandita varya andukondi naa abhinandana sumala mala..!

    గుండు మధుసూదన్: ధన్యవాదాలు Suresh Ganti గారూ!

    రిప్లయితొలగించండి