శనివారం, మే 31, 2014
శుక్రవారం, మే 30, 2014
సమస్య: దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్
తేది: అక్టోబర్ 21, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
నెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్!
అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
నెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్!
లేబుళ్లు:
సమస్యాపూరణం
గురువారం, మే 29, 2014
సమస్య: కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి
తేది: అక్టోబర్ 22, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఈ పూరణను క్రమాలంకారపద్ధతిన సరిచూచుకొనునది)
సాధ్వి సైరంధ్రి మోహించి చచ్చెనెవఁడు? (=కీచకుఁడు)
రామ దమయంతినిన్ నలుం డేమి సేసె? (=పెండ్లియాడె)
రావణుఁడు దేని మెచ్చి చేరంగఁ జనియె? (=లంకిణిని మెచ్చి)
కీచకుఁడు, పెండ్లియాడె, లంకిణిని మెచ్చి!
లేబుళ్లు:
సమస్యాపూరణం
మంగళవారం, మే 27, 2014
సోమవారం, మే 26, 2014
ఆదివారం, మే 25, 2014
శనివారం, మే 24, 2014
పద్య రచన: తిక్కన భారతావిష్కరణం!
తేది: అక్టోబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యము.
సీ.
కాకతీయుల యోరుఁగల్లున గణపతి
దేవుని సన్నిధిఁ దిక్కయజ్వ
తన రచనను భారతమ్మును బఠియించి,
మెప్పులు వడసియు, మేలి వరము
నందియుఁ దన స్వామి నల మన్మసిద్ధిని,
ఘనుఁ, బునా రాజ్యార్హుఁ గానుఁ జేసి,
స్వామి కార్యమ్మును, స్వక కావ్య వికసన
మ్ములను మంత్రాంగానఁ బొంది, మఱియుఁ
గీ.
దెలుఁగు వారల నాల్కలఁ దిరముగాను
నిలిచి వెలిఁగియుఁ జిర యశమ్ములును బొందె;
ఘనత నందె కవిబ్రహ్మగాను! మఱియు
నుభయ కవిమిత్రుఁడయ్యుఁ దా నుర్వి వఱలె!
లేబుళ్లు:
పద్య రచన
శుక్రవారం, మే 23, 2014
సమస్య: వక్త్రంబుల్ పది గలిగినవానికి జే జే
కవి పండిత మిత్రులకు, వీక్షకులకు,
శ్రీమద్ హనుమజ్జయంతి పర్వదిన
శుభాకాంక్షలు!
వక్త్రాననములు గలసియు
దిక్త్రారాతి శిర సమము! తిరమ, హనుమకున్!
వాక్త్రాసం బెది లేదిట!
వక్త్రంబుల్ పది గలిగిన 'వానికి' జేజే!
లేబుళ్లు:
సమస్యాపూరణం
గురువారం, మే 22, 2014
పద్య రచన: శ్రీకృష్ణ స్తుతి!
తేది: అక్టోబర్ 06, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
యదు కులాంభోధి చంద్ర! ఘనాభ దేహ!
రాసకేళీ విలోల! సువ్రజ కిశోర!
కృష్ణ! గిరిధర! నరసఖ! కేశవ! హరి!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
పార్థసారథి! మురహంత! వాసుదేవ!
శ్యామ సుందర! శకటారి! చక్రి! వృష్ణి!
వేణుధర! శౌరి! బకవైరి! విశ్వరూప!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
నరక హంతక! వృషనాశ! నంద తనయ!
ద్రౌపదీ మాన రక్షక! తాత తాత!
మానినీ వస్త్ర చోర! పద్మాక్ష! దేవ!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!
లేబుళ్లు:
పద్య రచన
మంగళవారం, మే 20, 2014
విశేష వృత్తములు: విష్ణుస్తుతి!
తేది: అక్టోబర్ 03, 2012 నాటి శంకరాభరణంలోని విశేష వృత్తములు శీర్షికన ఇచ్చిన ఛందస్సులో నేను రాసిన శిఖరిణీ వృత్తము.
శిఖరిణీ వృత్తము:
పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీవత్సా! పరమపురుష! ప్రాణద నమ:!
లేబుళ్లు:
విశేష వృత్తములు
సోమవారం, మే 19, 2014
సమస్య: హింస కలుగఁ జేయు హితము భువికి
తేది: అక్టోబర్ 02, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు.
(మహాత్ముని యహింసా పద్ధతిలో సహాయ నిరాకరణముఁ జేసిన, భరత భూమికి హితము కలుగఁ గలదని యాశయము)
(1)
తెల్ల దొరలకన్న, నల్ల దొరలు దేశ
భక్షకులయి రిల్లు వల్లకాడె!
త్యాగ శాంతి సత్య ధర్మాలకన్న న
హింస కలుగఁ జేయు హితము భువికి!
(2)
హింస కలుగఁ జేయు హితము, భువికి నేమి
యున్నదయ్య? దానఁ గలుగు నష్ట
మింత యనియుఁ జెప్ప నేరికి సాధ్య? మ
హింసయే గెలుచును! హితముఁ గనును!!
లేబుళ్లు:
సమస్యాపూరణం
ఆదివారం, మే 18, 2014
అమరమూర్తి జాతిపిత మహాత్మా గాంధీ!
తేది: అక్టోబర్ 02, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నా పద్యము.
సీ.
తెల్లవారల మత్తు దించంగ సమకట్టి
సత్యాగ్రహముఁ జేయు సాధుమూర్తి!
వర్ణభేదము లింక వలదంచు దళితుల
హరిజనులని పిల్చు హవనమూర్తి!
పేదలకే వస్త్ర మేది? నా కేలంచు
నంగీల విడిచిన త్యాగమూర్తి!
దేశమంతయుఁ గోరు దేశనాయకుఁ డయ్యుఁ
బదవిఁ గోరనియట్టి భవ్యమూర్తి!
గీ.
జాతిపితయై చెలంగిన సత్యమూర్తి!
బాలలకు గాంధితాతయౌ భద్రమూర్తి!
స్వార్థ మించుకయును లేని యనఘమూర్తి!
యంజలింతు మహాత్ముఁడా! యమరమూర్తి!
స్వస్తి
లేబుళ్లు:
పద్య రచన
శనివారం, మే 17, 2014
గురువారం, మే 15, 2014
బుధవారం, మే 14, 2014
పద్య రచన: కంసుని దౌష్ట్యము
తేది: సెప్టెంబర్ 26, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
(దేవకీగర్భగతాష్టమశిశువు చేఁత మరణమున్నదని కంసున కాకాశవాణి తెలుపుట)
కూర్మి వసుదేవకుం డంత కోరి రమణి
దేవకిని బెండ్లియాడి యేతెంచు సమయ
మునను "రథము నే నడుపుదు" ననుచుఁ గంసుఁ
డుత్సుకతతోడ నడుపంగ నొక్కసారి;(1)
కం.
ఫెళఫెళమను ఘోషముతోఁ
బలికెను నాకాశవాణి "భళి, యో కంసా!
చెలియలి గర్భస్థాష్టముఁ
డొలియించును నీదు ప్రాణ మోయీ వినుమా!"(2)
ఆ.వె.
అనఁగ కుపితుఁ డయ్యె నా కంసుఁ డంతటఁ
గత్తి దూసి చంపఁగాను బోవ,
"బావ! యాగు" మనుచు వసుదేవుఁ డాపియు
నష్ట బాలకులను నతని కిడుదు;(3)
తే.గీ.
అనఁగఁ గంసుండు శాంతించి, "యట్టులె" యని
మాట పుచ్చియు విడిచెను మఱది, చెల్లి!
ప్రాణ సమమైన చెల్లెలు, బావ యనియుఁ
జూడ రయ్యయో దుష్టులు సుంతయైన!(4)
లేబుళ్లు:
పద్య రచన
మంగళవారం, మే 13, 2014
సమస్య: కోపి నకులుఁడు భ్రాతను రూపుమాపె
తేది: సెప్టెంబర్ 25, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.
ఇనుమడిగఁ గోపమున్నచో నేమనెదరు?
మాద్రి కన్నట్టి జ్యేష్ఠ కుమారుఁ డెవఁడు?
ఇలను సుగ్రీవుఁ డెవనిని, నేమి సేసె?
కోపి; నకులుఁడు; భ్రాతను, రూపుమాపె!
వివరణ: దీనికి క్రమాలంకారముతోడి సమాధానములు సరిచూచుకొనవలసినది...
1. ఇనుమడిగఁ గోపమున్నచో నేమనెదరు? (కోపి)
2. మాద్రి కన్నట్టి జ్యేష్ఠ కుమారుఁ డెవఁడు? ( నకులుఁడు)
3. ఇలను సుగ్రీవుఁ డెవనిని (భ్రాతను), ఏమి సేసె? (రూపుమాపె)
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, మే 12, 2014
పద్య రచన: నైమిశారణ్యాఖ్యోత్పత్తికథ (వరాహపురాణాంతర్గతము)
తేది: సెప్టెంబర్ 25, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
కం.
గౌరముఖాశ్రమ పరిసర
ఘోరాటవిఁ జొచ్చి వేఁటకున్ దుర్జయుఁడన్
రారాజు డస్సి, తన పరి
వార సహితుఁడయ్యు, మునికిఁ బ్రాగార్ణకుఁడై; (1)
తే.గీ.
పోవఁగను గౌరముఖుఁడు సంపూర్ణ మతిని
సంతసమ్మంది, యాతిథ్య సత్క్రియలను
జేయ, విష్ణుని వేడఁగ, శ్రీహరి యొక
మణిని నిచ్చె, నా మణి మహిమాతిశయత; (2)
తే.గీ.
ఒక్క నగరము నిర్మించి, మిక్కుటముగ
షోడశోపచారమ్ములు శుద్ధమతినిఁ
జేయఁ, దుష్టుఁడై యా రాజు చిత్తమందు
మణిని సంగ్రహింపఁగ నెంచి, మునినిఁ గోరె! (3)
ఆ.వె.
ముని నిరాకరింప; మునితోడ యుద్ధమ్ముఁ
జేసియైన, మణియ చిక్కు కొఱకు
మదినిఁ గోర్కి గాఢమై యంపె సైన్యమున్
మునినిఁజంపి, పిదప మణినిఁ గొనఁగ! (4)
కం.
వర సైన్యమ్మునుఁ బంపిన
తఱి నా ముని గంగఁ జేరి, తరణికి నర్ఘ్యో
త్కరమిడుచునుండె; భటు లిటఁ
దరవారులఁ జేఁతఁ బూని, దందడి సేయన్; (5)
కం.
మణినుండి శూరతతియుం
జనియించియు సైన్యతతినిఁ జండించుచు వే
రణమునుఁ జేయుచు నుండఁగ
ముని యటకును నేఁగుదెంచి, మురరిపుఁ బిలిచెన్! (6)
ఆ.వె.
విష్ణుమూర్తి యపుడు వేగమ్ముగా వచ్చి,
మునికి భయముఁ దీర్పఁ బూని యపుడు,
నిమిషమందు సేన నిర్మూలనము సేసి,
మాయమాయెఁ దాను మఱు నిముసమె! (7)
తే.గీ.
ఎచట నిమిషమునందున నెదిరిఁ జంపె;
నట్టి యారణ్యమునకును నైమిశాఖ్య
కల్గి, "నైమిశారణ్యము" ఘనతనుఁ గని,
సకల మునులకునది నివాసార్హమాయె! (8)
(సమాప్తము)
లేబుళ్లు:
పద్య రచన
శనివారం, మే 10, 2014
పద్య రచన: దుష్యంతునకు శకుంతల లేఖ...
తేది: సెప్టెంబర్ 24, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
మ.
“అనివార్యమ్మయి యా శకుంతలను దుష్యంతుండు కళ్యాణమైచనఁగన్ బోవుచు ముద్రికం దొడిగి, యా సత్యాత్మకుం డెంతకున్
దన దారం బిలువంగ రాఁ డిటకు! లేదా యేమి రాగమ్ము నా
తనికిన్? బూనెనొ కిన్క యెట్టి కతనో? ధర్మమ్ము కాదిద్దియున్!” (1)
తే.గీ.(పంచపాది)
వనిని యనసూయయుం బ్రియంవదయు నిట్లు
పలుకుచుండఁగ వినియు నా వన్య రమణి
యగు శకుంతల కినుకతో ననియె "నేమె!
నా విభుఁడు మాట తప్పక నన్ను వేగ
పురికి రప్పించు నిజముగాఁ! బొండు పొండు! (2)
వనిని యనసూయయుం బ్రియంవదయు నిట్లు
పలుకుచుండఁగ వినియు నా వన్య రమణి
యగు శకుంతల కినుకతో ననియె "నేమె!
నా విభుఁడు మాట తప్పక నన్ను వేగ
పురికి రప్పించు నిజముగాఁ! బొండు పొండు! (2)
కం.
అని తరిమి యా శకుంతల
తన నాథునిఁ దలఁచి, సుంత తాప మధికమై;
మనమునఁ గల దు:ఖమ్మును
గనిపింపఁగ నీయకుండఁ గణ్వుని కుటిలోన్. (3)
అని తరిమి యా శకుంతల
తన నాథునిఁ దలఁచి, సుంత తాప మధికమై;
మనమునఁ గల దు:ఖమ్మును
గనిపింపఁగ నీయకుండఁ గణ్వుని కుటిలోన్. (3)
ఆ.వె.
చని యట మఱి యుండఁ జాలక బయటకు
వచ్చి యేడ్చుచుండఁ బరుగు తోడఁ
జెలియు వచ్చి, యడుగఁ జింతను దిగమ్రింగి,
"లేఖ వ్రాతు నిపుడు, ఱిచ్చ యేల? (4)
చని యట మఱి యుండఁ జాలక బయటకు
వచ్చి యేడ్చుచుండఁ బరుగు తోడఁ
జెలియు వచ్చి, యడుగఁ జింతను దిగమ్రింగి,
"లేఖ వ్రాతు నిపుడు, ఱిచ్చ యేల? (4)
కం.
కమ్మను దె"మ్మని యమ్ముది
తమ్మెయి నమ్మంగఁ బలుకఁ, దాఁ దెచ్చి యిడన్;
గమ్మ పయి వ్రాసె నెద్దియొ
యమ్ముని పట్టి యటఁ దన్మయాంచిత హృదియై! (5)
కమ్మను దె"మ్మని యమ్ముది
తమ్మెయి నమ్మంగఁ బలుకఁ, దాఁ దెచ్చి యిడన్;
గమ్మ పయి వ్రాసె నెద్దియొ
యమ్ముని పట్టి యటఁ దన్మయాంచిత హృదియై! (5)
లేబుళ్లు:
పద్య రచన
శుక్రవారం, మే 09, 2014
సమస్య: అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే
తేది: సెప్టెంబర్ 22, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
తి వితర ణాలోభ సహన దివ్యతపము ల
ష్టవిధమ్ములు! నీతికిఁ దో
డవి!! నీతికి సాటి ధర్మ మవనిన్ గలదే?
(1.సవనము=యజ్ఞము, 2.శ్రుతిపఠనము=వేదాధ్యయనము, 3.ఋతము=సత్యము, 4.ధృతి=ధీరత్వము, 5.వితరణము=దాతృత్వము, 6.అలోభము=లోభరహితత్వము, 7.సహనము=క్షమాగుణము, 8.దివ్యతపము=గొప్ప తపస్సు అని ధర్మము ఎనిమిది విధములు. అవి (ఆ ఎనిమిది ధర్మములు) నీతికి తోడుగా నిలుస్తాయి. కావున అట్టి నీతికి సాటియైన ధర్మము ఈ భూలోకమున కలదా? లేదు అని భావం.)
ఇజ్యాధ్యయనదానాని, తపస్సత్యంధృతిక్షమా|
అలోభ ఇతి మార్గోఽయం, ధర్మశ్చాఽష్టవిధః స్మృతః||
-భారతము
(యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, ధైర్యము, క్షమ, లోభరాహిత్యము - అని ధర్మము ఎనిమిది విధములు)
లేబుళ్లు:
సమస్యాపూరణం
గురువారం, మే 08, 2014
బుధవారం, మే 07, 2014
పద్య రచన: విఘ్నేశ్వర స్తుతి!
తేది: సెప్టెంబర్ 19, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
శా.
హే విఘ్నేశ! గజాస్య! లంబ జఠరా! హేరంబ! భాండోదరా!
హే విశ్వగ్దృశ! మంగళస్వర! సఖా! హే బ్రహ్మచారీ! కృతీ!
హే విష్ణు! ప్రభు! విశ్వనేత్ర! వరదా! హే జిష్ణు! సర్వాత్మకా!
హే విద్యా ధన శక్తి యుక్తి మహితా! హే సుప్రదీపా నమ:!! (1)
తే.గీ.
ఏకవింశతి పత్రాల నెలమి నునిచి,
స్వాదు ఫలములు, పుష్పాల సరము లిచ్చి,
పంచభక్ష్య, పాయసముల భక్తి నిడియు,
నర్చ సేతుము విఘ్నేశ, యాదుకొనుము! (2)
ఆ.వె.
ప్రతిదినమ్ము మేము ప్రార్థింతు మో యయ్య!
విఘ్నములనుఁ ద్రోల వినతి సేతు;
రుగ్మతలనుఁ బాపి, ప్రోవు మో విఘ్నేశ!
భక్తితోడ నీకుఁ బ్రణతు లిడుదు! (3)
కం.
నీ పాద ధ్యానముచే
మా పాపమ్ములను డుల్చు మహితాత్ముఁడవే!
హే పార్వ తీశ నందన!
యీ పర్వ దినమ్ము నందు నీకిడుదు నతుల్! (4)
చక్రవాకము:
వరగజాస్య! విఘ్నహంత్రి! భానుతేజ! సౌఖ్యదా!
ధరనిభోదరా! విచిత్ర! దంతివక్త్ర! శాంకరీ!
సురనరాది సేవితాంఘ్రి! శూర్పకర్ణ! హేరుకా!
కరిపలాద గర్వహారి! కావుమయ్య మమ్మిఁకన్!! (5)
-:శుభం భూయాత్:-
లేబుళ్లు:
అవిఘ్నమస్తు,
పద్య రచన
మంగళవారం, మే 06, 2014
సోమవారం, మే 05, 2014
సమస్య: నారినిఁ బెండ్లి యాడి గహనంబుల కేఁగెను సీత ప్రేమతోన్
తేది: సెప్టెంబర్ 17, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా రెండు పూరణములు
(1)
శ్రీ రమణీయ గాత్రుఁడు; వశీకృత మానసుఁ డా రఘూత్తముం
డారయఁ గౌశి కాజ్ఞఁ దలఁ దాలిచి, చాపముఁ ద్రుంచి, జానకీ
నారినిఁ బెండ్లి యాడి, గహనంబుల కేఁగెను! సీత ప్రేమతోన్
గారవమొప్ప రామునకుఁ గాంక్షను సేవలు సేయ నేగెఁ దా!!
(2)
పంచపాది:
శ్రీ రఘువంశ సోముని, విశిష్ట ఘనాభ వినీల దేహునిన్,
భూరి గుణాభిశోభితునిఁ, బూర్ణ శశాంక నిభాస్యునిన్, ధరా
భార నివారణోద్యత సుబాణునిఁ, బాద జలేజ పృక్త్యహ
ల్యా రమణీ పరిగ్రహ పరంపదు, నాశర, దైత్య, దేవ భి
న్నారినిఁ బెండ్లియాడి, గహనంబుల కేఁగెను సీత ప్రేమతోన్!
(ఆశరులు, దైత్యులు, దేవభిన్నులు = రాక్షసులు;
దేవభిన్నారి = దేవభిన్న + అరి = రాక్షసాంతకుఁడు = శ్రీరాముఁడు)
లేబుళ్లు:
సమస్యాపూరణం
ఆదివారం, మే 04, 2014
పద్య రచన: ముదితల విశేష వస్త్రధారణము
తేది: సెప్టెంబర్ 14, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము
చలిత విశాల నేత్ర యుత శర్వరు లొక్కెడ వస్త్ర కోటులన్
సులలిత రీతిఁ దాల్చి, మన సోదర రాష్ట్ర విశేష భంగిమల్
పలువుఱ మెప్పు లందఁగను, భారత సంస్కృతి గొప్పఁ జాటుచున్;
వలపులఁ జూపుచుండిరిట, భారతమాత మనమ్ము గెల్వఁగన్!
లేబుళ్లు:
పద్య రచన
శనివారం, మే 03, 2014
సమస్య: బావల భుజియించుటే శుభావహ మందున్
తేది: సెప్టెంబర్ 13, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములు
(1)
(విష్ణ్వాది దేవతాపూజా వ్రతాదుల ననుష్ఠించు దినములం దుపవసించి, తదుపరి దినమున భోజనాదుల స్వీకరించుట సంప్రదాయ మనుట)
భావించి యుమావిభుఁ, దదుపరి వాగ్విభు నే
సేవించినట్టి సుదినం
బావల భుజియించుటే శుభావహ మందున్!
(2)
(లేక... ఆ పూజా వ్రతాదులు సంపూర్ణముగ నిర్వర్తించి, యుపవాస దీక్ష విడిచిన తదుపరి భుజించుట సంప్రదాయమనుట)
నేవిధి యుపవాసముందు రే వారలు? వా
రావిధి తదుపరి సమయం
బావల భుజియించుటే శుభావహ మందున్!
(3)
(పొలము పనులు సేయు కూలీలు మధ్యాహ్న సమయాన భుజించుటకై మా పొలము గట్టునకు రాఁబోఁగా, నా దారిన ముండ్లున్నవని నే నీ విధముగ నందును!)
"రా వలదీ వైపున; కీ
త్రోవను ముండ్లున్న వెన్నొ! తొలఁగఁ గదయ్యా!
పోవయ్య! యీ కుమార్గం
బావల భుజియించుటే శుభావహ" మందున్!
లేబుళ్లు:
సమస్యాపూరణం
శుక్రవారం, మే 02, 2014
గురువారం, మే 01, 2014
పద్య రచన: నవ గ్రహములు
తేది: సెప్టెంబర్ 11,2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
భాముఁడు, సోముఁడు, భౌముఁడు,
సోమజుఁడున్, దేవ గురుఁడు, శుక్రుఁడు, శనియున్,
సోమ గ్రాహియుఁ, గేతువు
గాములు తొమ్మిది; జనులకు గరిమను జూపున్!
(ఇదే అర్థముతో మఱొక కంద మందున)
కం.
రవి, రాట్, కుజ, బుధ, గురు, కవి,
రవిజ, తమ, శ్శిఖి నవ ఖ చరమ్ములు నెపుడున్
భువి చుట్టుఁ దిరుగు చున్, మఱి,
భువి జనులను బాధ పఱుపఁ బొదలింపఁ గనున్!
లేబుళ్లు:
పద్య రచన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)