తేది: సెప్టెంబర్ 26, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
(దేవకీగర్భగతాష్టమశిశువు చేఁత మరణమున్నదని కంసున కాకాశవాణి తెలుపుట)
కూర్మి వసుదేవకుం డంత కోరి రమణి
దేవకిని బెండ్లియాడి యేతెంచు సమయ
మునను "రథము నే నడుపుదు" ననుచుఁ గంసుఁ
డుత్సుకతతోడ నడుపంగ నొక్కసారి;(1)
కం.
ఫెళఫెళమను ఘోషముతోఁ
బలికెను నాకాశవాణి "భళి, యో కంసా!
చెలియలి గర్భస్థాష్టముఁ
డొలియించును నీదు ప్రాణ మోయీ వినుమా!"(2)
ఆ.వె.
అనఁగ కుపితుఁ డయ్యె నా కంసుఁ డంతటఁ
గత్తి దూసి చంపఁగాను బోవ,
"బావ! యాగు" మనుచు వసుదేవుఁ డాపియు
నష్ట బాలకులను నతని కిడుదు;(3)
తే.గీ.
అనఁగఁ గంసుండు శాంతించి, "యట్టులె" యని
మాట పుచ్చియు విడిచెను మఱది, చెల్లి!
ప్రాణ సమమైన చెల్లెలు, బావ యనియుఁ
జూడ రయ్యయో దుష్టులు సుంతయైన!(4)
Pandita Nemani చెప్పారు...
రిప్లయితొలగించండిశ్రీ గుండు మధుసూదన్ గారు ప్రతి నిత్యము నొక ఖండికను వెలువరించు చున్నారు. వారి కృషి గురించి:
కనుపట్టంగనె కావ్య వస్తువని వేగంబొప్ప పద్యమ్ములన్
మనమారన్ విరచించు చుండుగద సమ్మాన్యుండు నిత్యంబు నా
తని శ్రీమాన్ మధుసూదనున్ కవివరున్ తజ్ఞున్ బ్రశంసించుచున్
మనుమా శాంతి సుఖాలతో ననుచు బ్రేమన్ గూర్తు నాశీస్సులన్
గౌ.పండిత నేమాని వారికి ధన్యవాదములు! తమవంటి పెద్దల యాశీస్సు లెల్ల వేళలయం
తొలగించండిదుండవలయునని యాశించు...
భవదీయ విధేయుఁడు,
గుండుమధుసూదన్