Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

సమస్య: అప్పు లేనివాఁడె యధముఁడు గద

తేది:27-09-2013 నాటి శంకరాభరణంలో నా పూరణ...

వానఁ గుఱిపించిన పిదప నుఱుకులు పరుగులతోఁ జనుచున్న మేఘుని మాటలు...

జలములన్ని కుఱిసి, యిలఁ దడిపియు నేను
సలిలములను నింప సాగరమున
కేఁగుచుంటి నిపుడు నెంతయుఁ దపనతో!
నప్పు లేనివాఁడె యధముఁడు గద!!

పద్య రచన: దొంగల ముఠా

తేదీ.27.09.2013 నాటి శంకరాభరణం: పద్య రచనలో నేను రాసిన పద్యం.

నమ్మినట్టి జనుల నట్టేట ముంచియుఁ
గోట్లు కోట్లు ధనముఁ గొల్లఁగొట్టి,
దోచుకొనెడివారె దొరలయ్య! యీనాఁడు
నాయకులయిరి యిల నయరహితులు!!

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

సమస్య: రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్శిరోవేదనచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సందర్భము...

"లోకము నందలి మందులు
చేకొని పెక్కులుగ వేయఁ జిత్రము, పోదే
నాకీ తలనొప్పి! యిఁకన్
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్!!"

పద్య రచన: పోస్టుకార్డు

"నేను నిచ్చట క్షేమమ్ము! నీవు బాగె?
యుభయ కుశలోపరి; యిఁక వ్రాయునది యేమ
నఁగ" యటంచును వ్రాసి, పద్నాలు గేండ్లు
నాయె నో మిత్ర, పోస్టు కార్డ్ వేయఁగాను!! 

బుధవారం, సెప్టెంబర్ 25, 2013

సమస్య: గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్


మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
హిత, సమ్య ఙ్మార్గము లిడి, మిక్కిలి కరుణన్
హిత మొనఁగూర్చిన శరణా
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్!

(సుగతుఁడు=బుద్ధుఁడు)

పద్య రచన: కారాగారము1. కంచెర్ల గోపన్నను సంబోధించుచు....

కారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక దివ్య కృతీశా! (1)


 2. నెహ్రూను సంస్మరించుచు...
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కులుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల వర్ధిత గృహమే!! (2)

మంగళవారం, సెప్టెంబర్ 24, 2013

సాహితీ మధువనం: "ససేమిరా" కథ

విశ్వాస ఘాతుకుఁడు!

విజయ పాలుఁడు యువరాజు వేఁటకుఁ జని,
యటవిలో దారి తప్పంగ నపుడు సింహ
మొకటి తఱిమెదాపున నున్న యొక్క వృక్ష
మెక్కఁగాఁ దరుశాఖపై నొక్క యెలుఁ 
భయము నిచ్చి కాపాడెను వానినపుడు! (1)

సింహ మచ్చటనే యుండె స్థిరముగాను!
రాత్రి యయ్యెను, నిద్రించె ప్రాణి తతియు!
నెలుఁగు నాతనినిం గోరె నిదుర వోవ
తనదు తొడపైని నప్పుడు దయను బూని! (2)

ఎలుఁగు కోరిక తలఁదాల్చిహితుఁ డటంచుఁ
బల్కినిదురించసింహమ్ము పడఁగఁ ద్రోయు
మంచు భల్లూకమును గోరెమానవుని పయి
ద్రోహ చింత లేని యెలుఁగు త్రోయ ననియె! (3)

అర్ధ రాత్రము దాఁటిన యపుడు రాకు
మారుఁడును లేచియెలుఁగు నీ మాఱు నిద్ర
వోవఁ గోరఁగాఁ దొడపైని బోయె నిదుర;
సింహ మప్పుడు పడఁ ద్రోయు చింతన నిడె! (4)

విశ్వాసము నిడి యెలుఁ గట
నాశ్వాసముఁ గొని శయింపనప్పుడు శంకన్,
విశ్వాస ఘాతుకుండై
నశ్వర మిత్రతనుఁ ద్రోయనది శపియించెన్! (5)

నీదు కృతము నేఁడు నీచమైద్రోహమై,
మచ్చఁ దెచ్చెనోయి మానవతకు!
కాననెపుడు నీవు పూని యున్మాది యా
త్ర సలుపుము “ససేమిరా” యనుచును!” (6)

అని శపించియుఁ దన దారిఁ జనియె నెలుఁగు;
రాకుమారుండును “ససేమిరా” యటంచుఁ
బిచ్చివాని పగిదిఁ బ్రలపించుచుఁ దన
యిల్లుఁ జేరంగఁ జనె పౌరుఁ డెవఁడొ చేర్చ! (7)

తన కుమారుని దుఃస్థితిఁ దలఁచి తండ్రి
కుమిలిపోవుచు దుఃఖించి, గుణ యుతుఁడగు
మంత్రిఁ గోరంగ నాతండు మానితముగ,
దివ్య దృష్టినిఁ జూచి, చింతించి, పలికె! (8)

కల సద్భావ వర్ధిత సాధువులను
వంచనము సేయఁగను నేరుపగునె నీకు?
నమ్మి తొడపైని నిద్రించునట్టివానిఁ
జంపఁ బౌరుషమ్మగునె, నీచమ్ముఁ గాక?”
యనఁగ ’సేమిరా’ యంచును ననఁగ సాఁగె! (9)

సేతుయుత వారిధిని, జాహ్నవీ తురీయ
సంగమముఁ జూడఁగా బ్రహ్మ సంహృతిస్థ
పాతకము సమయును! మిత్ర ఘాతుక మెటు
సమసి పోవును, దద్దర్శనమున నిచట?”
ననఁగను ’మిరా’ యటంచును ననఁగ సాఁగె! (10)

మిత్రఘాతి, కృతఘ్నుండు, మేదినిఁ గల
యట్టి విశ్వాస ఘాతుకుం డను త్రయమ్ము,
తరణి శీతకరాదు లెందాఁక స్థిరులొ,
యంత దాఁక నరకమున నడలుచుం” డ్ర
నంగ ’రా’ యంచు మఱి మఱి యనఁగ సాఁగె! (11)

రాజ! నీసుతుఁ బాప విరహితుఁ జేయఁ
గోర్కి కలదేని శీఘ్రమే కూర్మి మీఱ
దేవ భూదేవులును గురుదేవులకును
దానధర్మాదులనుఁ జేయఁగావలె నయ!”
యనఁగ విజయ పాలుఁడు మాఱె మునుపటి వలె! (12)


-: ఇది “ససేమిరా” కథ :-
శుభం భూయాత్

పద్య రచన: కరివేఁపాకుసకల శాకములందునఁ జాల రుచినిఁ
గలుగఁ జేయును కరివేఁప ఘనముగాను!
కాని, కూర నుండియు నేఱి, దాని మనము
పాఱవేతుము, దుష్టుల నేఱినట్లు!!

సమస్య: సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు


ద్వారకలో నిద్దఱు గోపాలకులు సంభాషించుకొనుచున్న సందర్భము...

"వెడలి రయ్య సత్యాకృష్ణు లెడఁదఁ బూని,
దుష్ట నరకాసురుని, లోక దురిత కరుని
నడఁచఁగను, లోక కళ్యాణ మిడఁగ! నపుడు
సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు!!"

సోమవారం, సెప్టెంబర్ 23, 2013

పద్య రచన: దోమ


దోమయ చిన్నది యైనను
గోముఖ శార్దూలము వలె కొంపలు ముంచున్!
దోమతెఱలున్న రోగము
లేమియుఁ దరిఁ జేరలేవు లీలగ నైనన్!

సమస్య: ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్


కుట్లిడి రమణీయమ్మౌ
చెట్లు పువులు పిట్టలు విలసిల్లెడు చీరల్
పుట్లుగ నమ్మి, పిదప, పని
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!

ఆదివారం, సెప్టెంబర్ 22, 2013

సమస్య: జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్


దుర్గాదేవి నబల యను తృణీకార భావనచే నని సేయ నుంకించిన మహిషుని నా మాత పాఱఁద్రోలిన ఘట్టము...

జంకువిడి, దుర్గ, మహిషుని
సంకటమునఁ ద్రోయ; వాఁడు శక్తి నశింపన్,
గొంకుఁ గొని పాఱెఁ! జిత్రము!
జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్!!

శనివారం, సెప్టెంబర్ 21, 2013

పద్య రచన: జూదము


ధర్మజుఁడు జూదమాడియుఁ దనదు రాజ్య
సంపదలఁ గోలుపోయి, విచార పడక,
యపుడు నారణ్యవాస గతాత్ముఁ  డయ్యు,
ద్రౌపదినిఁ, దమ్ములనుఁ గూడి, తరలె నయ్య!

సమస్య: దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్నారదుఁడు ధర్మజునితోఁ బలికిన సందర్భము...

విను, ధర్మరాజ! కన, భవ
దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు, సుమతుల్,
ఘనతర ధీగుణ యుతులున్,
వనజాక్ష విశిష్ట చరణ వందన నిరతుల్!

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2013

పద్య రచన: ఋణానుబంధం

ఏ ఋణము కారణముగానొ యిట్టి బంధ
ములిలఁ గలుగును; పసులు, సుతులును, బత్ని,
గృహ మటంచు! ఋణమ్ము తీఱిన తఱి వెసఁ
దొలఁగి పోవును! గావున దుఃఖ మేల?

(ఋణానుబంధ రూపేణ, పశుపత్నీసుతాలయాః|
ఋణక్షయే క్షయం యాంతి, కా తత్ర పరిదేవనా||)

సమస్య: శిష్టజనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్


దుష్టు దురాత్ము రావణుని దూషిత కర్ముని, ధర్మమార్గులౌ
శిష్టజనాళి మెచ్చెదరె, శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
హృష్ట హృదబ్జమందు ఘనరీతిని నిల్పి భజించి కొల్చి సం
తుష్టునిఁ జేయు వస్తుతతిఁ దోరముగా నిడి మెచ్చునట్లుగన్?

గురువారం, సెప్టెంబర్ 19, 2013

పద్య రచన: శబ్ద కాలుష్యము


పట్టణముల ధ్వనికలుషిత
ఘట్టములే యెట్టి చోటఁ గాంచిన మిగులన్
గట్టలుగను వ్యాపించియు
మట్టియె మిగులంగఁ జేయు మార్గమె యెసఁగెన్!

సమస్య: పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్

నా మొదటి పూరణము:
శాస్తోల్లేఖిత సుకృతి ప్ర
శస్త శుభ విశిష్ట నీతి శాస్త్ర విముఖుఁడై;
యస్తుతిపాత్ర, దురితకర
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (1)

నా రెండవ పూరణము:
శస్తగుణోపేత ప్రభా
వాస్తోతు స్తూయమాన భవనుతి విముఖ
న్యస్త విదూషిత కవికృత
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (2)

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

మాయాచిత్రం

కన్నులను మాయచేసే చిత్రం

పద్య రచన: గణేశ నిమజ్జనం


శ్రీగణనాథునిఁ గొలిచితి
మేగఁగ వలె స్వీయనిలయ మిప్పుడటంచున్
వేగమె నిమజ్జనమ్మును
సాగరమునఁ జేయఁ గోరి సాఁగ నిడి రటన్!

సమస్య: మూఢమతు లాదరింత్రు ముముక్షువులను


"మూఢులై మేము చెడితిమి; మోక్ష మందఁ
జేయు బోధల ననుసరించెద"మటంచు,
మూఢమతు లాదరింత్రు ముముక్షువులను;
జ్ఞానులై తరియించఁగ నాస్థ తోడ!

మంగళవారం, సెప్టెంబర్ 17, 2013

పద్య రచన: జోలపాట


జోజో సాధుజనావన!
జోజో ఖగరాజ గమన! జోజో కపిలా!
జోజో దనుజ బలాంతక!
జోజో కంజాతనేత్ర! జోజో కృష్ణా! (1)

జోజో పంకజనాభా!
జోజో బ్రహ్మేంద్ర వినుత! జోజో కేశా!
జోజో ముకుంద! మాధవ!
జోజో కరుణాంతరంగ! జోజో కృష్ణా! (2)

జోజో జగదీశ! హరీ!
జోజో పూర్ణేందుముఖ! విశుద్ధ హృదబ్జా! 
జోజో పన్నగశయనా!
జోజో గిరిధారి! జిష్ణు! జోజో కృష్ణా! (3)

జోజో దివ్యకృపాకర!
జోజో సర్వాత్మక! జలజోదర! చక్రీ!
జోజో వైకుంఠేశా!
జోజో కమలేశ! విమల! జోజో కృష్ణా! (4)

జోజో కైటభ వైరీ!
జోజో మధుసూదన! కపి! జోజో శార్ఞ్గీ!
జోజో నారాయణ! విధి!
జోజో విరజా! విలాసి! జోజో కృష్ణా! (5)

సమస్య: తాతను వివాహమాడెను తరుణి మెచ్చి


బ్రహ్మ మానస పుత్రిక వాణి నపుడు
పెండ్లి యాడంగ నలువ తపింపఁ గాను;
బ్రహ్మ కోర్కిని దలఁదాల్చి వఱలఁ, దాను
తాతను వివాహమాడెను తరుణి మెచ్చి!

(తాత=తండ్రి, బ్రహ్మ, ముసలివాఁడు, తండ్రి తండ్రి, తల్లి తండ్రి...మొదలగు నర్థములు గలవు)

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

పద్య రచన: తన్మయత్వము


నిత్య హరినామ స్మరణముచేఁ బ్రహ్లాదుఁడు తన్మయత్వమునఁ దేలియాడు ఘట్టము...

సీ.
"కంజాక్షునకు నిడు కాయమే కాయమ్ము;
.....పవన గుంఫిత చర్మ భస్త్రి గాదు!
వైకుంఠుఁ బొగడెడు వక్త్రమే వక్త్రమ్ము;
.....డమడమ ధ్వని తోడి ఢక్క గాదు!
హరి పూజనము సేయు హస్తమే హస్తమ్ము;
.....తరుశాఖ నిర్మిత దర్వి గాదు!
కమలేశుఁ జూచెడి కన్నులే కన్నులు;
.....తనుకుడ్య జాల రంధ్రములు గావు?

ఆ.వె.

చక్రి చింతయున్న జన్మమే జన్మమ్ము;
తరళ సలిల బుద్బుదమ్ము గాదు!
విష్ణు భక్తియున్న విబుధుఁడే విబుధుండు;
పాద యుగము తోడి పశువు గాదు!"

తే.గీ.
అనుచు మనమున హరినిల్పి యనిశము, హరి
కథల భజియించి, యర్చించి, కమలనాభు
సంస్మరణము సేసియు, విష్ణుఁ జరణ కమల
ములను స్తుతియించి, ప్రహ్లాదుఁ డిలను మిగులఁ
దన్మయత్వానఁ బాడుచుఁ దనను మఱచు!

సమస్య: బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్


తులలేని వర విరాజితు
బలగర్వితుఁ బంక్తికంఠుఁ బరిమార్చంగన్
దలఁచిన వానరయుత ధీ
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (1)

ఖలు, విధి వరబల గర్వితు,
నిలా తనయఁ జెఱను నిడిన నీచు, దశాస్యున్,
బొలియింపఁగ, వానర యుత
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (2)

ఆదివారం, సెప్టెంబర్ 15, 2013

పద్య రచన: గుడి గంట - బడి గంట

గుడి గంటలు, బడి గంటలు
నెడఁదను వికసింపఁ జేసి, హిత మందించున్!
గుడి గంట దైవ మననము;
బడిగంటయ జ్ఞాన యజ్ఞ భాస్వ ద్వరమే!

సమస్య: అమృతము సేవించి సురలు హతులైరి గదా

దేవతలు రాక్షస భయ కారణమునఁ గొంత కాలము కాకాకృతులై యుండిరి. భయము మరణ సదృశము కదా! అమృతము సేవించియు మృతతుల్యు రైరని నా పూరణము.

తమిఁ గాకాకృతి భయజ,
మ్మమృతము సేవించి సురలు హతులైరి గదా!
యమిత దనుజభయ కారణ
మమరఁగ మృతియే తలఁపఁగ నమరులకు నటన్!

శనివారం, సెప్టెంబర్ 14, 2013

పద్య రచన: గుణ త్రయమునరుల యందున నుండు గుణత్రయమ్ము;
తామ సమ్మున్న నధమ వర్తనముఁ గలుగు;
రాజ సమ్మున్న మధ్య వర్తనముఁ గలుగు;
సాధువర్తనమే గల్గు సాత్త్వికమున!


సమస్య: భాష కేల నయ్య వ్యాకరణము

శంకరాభరణంలో నేఁడిచ్చిన సమస్యకు నా పూరణ...

ఎట్టి భాషకైన నే భావమునకైన
వలయు వ్యాకరణము, భాష కనుక!
భాష కేల నయ్య వ్యాకరణ మ్మనఁ
దగునె శంకరార్య? ధర్మ మగునె?

శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013

సమస్య: పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్


శంకరాభరణంలో నేఁడిచ్చిన సమస్యకు నా పూరణము...

కంజాత పత్ర నేత్ర, స
మంజస విధిఁ జనక, జాఱి, మఱఁదలి పైనన్
శింజినులు మ్రోయఁ, బడఁగను,
బంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్!

గురువారం, సెప్టెంబర్ 12, 2013

సమస్య: బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ

బానిస బ్రతుకు కన్న మరణమే మేలని నిరాశతోఁ జావఁ గోరు నొక భారతీయునకు ధైర్యముఁ గూర్చుచు గాంధీ పలికిన సందర్భము


నేనుంటి, స్వేచ్ఛఁ గొను, మో
 బానిస! బ్రతుకే నయమని పలికెను గాంధీ
తేనియ లూరెడి స్వేచ్ఛా
గానము వినిపించి, ప్రజకు జ్ఞానముఁ బెంచన్!

బుధవారం, సెప్టెంబర్ 11, 2013

పద్య రచన: వేఁట పాలెము


సుప్రసిద్ధ గ్రంథమ్ముల శోభ వెలయు
వేఁటపాలెము తెలుఁగుల పేర్మి ధనము!
నిత్య పరిశోధకాంచితౌన్నత్య గృహము!
తఱచు దర్శించవోయి గ్రంథాలయమ్ము!
రమ్ము సారస్వత నికేతనమ్మునకును!!

సమస్య: పాయసమ్మునఁ గారమ్ము వేయవలెను

పెండ్లివారింటికి వేంచేసిన వియ్యాలవా రాఁడు పెండ్లివారితో మేలమాడు సందర్భము...

"పాయసమ్మునఁ గారమ్ము వేయవలెను;
కూరలోఁ జక్కెరను వేయఁగా రుచియగు;
మజ్జిగా యిది? పా"లని మఱి మఱి నగి,
మేల మాడిరి యచట వియ్యాలవారు!

మంగళవారం, సెప్టెంబర్ 10, 2013

సమస్య: కలఁడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్

వసంతసేనతో నసందర్భ ప్రలాపి శకారుఁడు పలికిన సందర్భము.

“తులువన్, మూర్ఖుఁడఁ,గాముకు;
నిలలో లేఁడెవఁడు! నన్ను నింతింతని నే
దెలుపఁగ లేనే, కుజనుఁడఁ!
గలఁడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్?”

సోమవారం, సెప్టెంబర్ 09, 2013

పద్య రచన: గణేశ స్తుతి

కవి పండిత మిత్రులకు, వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః     

స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో హమ్! (1)

ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద!
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో உస్తు తే உనిశమ్! ( 2)

ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే హమ్! (3)

శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)

వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయవినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)

స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)

ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)

భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (9)


-:<  శుభం భూయాత్  >:-

సమస్య: గరళ కంఠుని శత్రువు గజముఖుండు

కవిపండిత మిత్రులకు, వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!!
తలఁచి, సతినగ్ని కెఱఁ జేసి, దక్షుఁ డాయె
గరళ కంఠుని శత్రువు! గజముఖుండు
గరళ కంఠుని పుత్రుండు; కరుణఁ బ్రోచి,
విఘ్నపతి తొలఁగించుత విఘ్నములను! (1)

ఆదివారం, సెప్టెంబర్ 08, 2013

పద్య రచన: ప్రపత్తి


తల్లిని గొల్చి, తండ్రికిని దండ మొనర్చి, గురున్ నుతించియున్,
జల్లఁగ నాతిథేయమిడి సాంగతికున్ బ్రణిపత్తి సేసి, రం
జిల్లుచు దైవమందు విలసిల్లెడు భక్తి ప్రపత్తితోడ నే
నుల్లము పుల్కరింప మహితోక్తుల వందన మాచరించెదన్!

సమస్య: వాసవునకు మయూరమ్ము వాహనమ్ము

పఱఁగ నైరావతమ్మగు వాహనమ్ము
వాసవునకు! మయూరమ్ము వాహనమ్ము
కార్తికేయున! కాఖువు గణపతికిని
వాహనము! నంది శివునకు వాహనమ్ము!

శనివారం, సెప్టెంబర్ 07, 2013

పద్య రచన: రోదనము
  

తాను రోదించుచుం బుట్టు మానవుఁ డిల;
వృద్ధి నొందుచు నెన్నియో వెతలఁ బొంది,
మరణ మందెడు దాఁక వనరుచుఁ దాను
మరణ మందియు నేడ్పించు వరుసఁ గనుఁడు!

సమస్య: నాథ! "ఓం నమో నారాయణాయ" యనకు

హరినామ స్మరణము చేయుచున్న ఘోరనాథుఁడను దన కుమారుని నొక రాక్షస స్త్రీ వారించుచున్న సందర్భము...

భక్త ప్రహ్లాదుఁ డొసఁగిన పావనమగు
హరి జపమ్మును జేయంగ నిరతము విని,
యొక్క దనుజ బాలుని దల్లియు ననె, "ఘోర
నాథ! ’ఓం నమో నారాయణాయ’ యనకు;
మదియ విన్నచో మన రాజు మదిని గోప
మావహించును; విధియించు మరణ శిక్ష!
మఱువు మోయయ్య, హరినామ మంత్ర జపము!" (1)
              *                *                *

"స్థిర! మురాంతక! లక్ష్మీశ! దేవ దేవ!
విశ్వరూపా నమోస్తుతే! విమల! దీన
నాథ!", "ఓం నమో నారాయణాయ"యన, కు
జనుల, సుజనులఁ జేతువు స్వామి నీవు! (2)

శుక్రవారం, సెప్టెంబర్ 06, 2013

సమస్య: సర్వదా చింతయే గాదె సంతు వలన

తండ్రి పేరును నిలఁబెట్టు తనయుఁ డగున
టంచుఁ దలఁచెడు తండ్రికి, హతవిధి! యిలఁ
దండ్రి గుణములఁ జెఱచెడు తనయుఁ డైన,
సర్వదా చింతయే గాదె సంతు వలన?!

చిత్ర విచిత్రం

చిత్రంలోని విచిత్రాన్ని గమనించండి

పద్య రచన: పిల్లి


వెళ్ళఁ బనుల మీఁద, పిల్లి యెదురు రాఁగ,
ససిగ సాఁగ దనుచు, నసుగుకొనుచు,
మఱలుచుంద్రు జనులు; మార్జాలమా! యిది
నిజమొ, కాదొ చెపుమ, నిక్కముగను!!

గురువారం, సెప్టెంబర్ 05, 2013

పద్య రచన: సర్వేపల్లి రాధాకృష్ణన్

కవి పండిత మిత్రులకు, వీక్షకులందఱికి
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
చం.
ఇది యొకనాఁటి రాష్ట్రపతి కిష్ట మొసంగిన యట్టి దివ్యమౌ
సుదినము! తత్త్వశాస్త్ర ఘన శోభిత కీర్తి మహత్త్వపూర్ణ స
ద్వదనుఁడు పుట్టినట్టి గురు పర్వదినమ్ము! గురూత్తమాళికిన్
సదమల దివ్య సత్కృతుల సన్నుతు లిచ్చెడి వేళయే కదా!!

సమస్య: పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్

కాపాడిన భక్షింతురు
పాపాత్ములె! పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
గోపము తాపము పాపము
లాపఁగఁ జూచెదరు శిష్యు లానందింపన్!!

బుధవారం, సెప్టెంబర్ 04, 2013

పద్య రచన: శివ గంగ


సీ.
వామ నోన్నత పాద బ్రహ్మ ప్రక్షాళితో
....ద్భవ వియచ్చారిణీ భవ్య గంగ;
ఘన భగీరథ తపోగత వర్తనానుసా
....రీద్ధ చారిత్ర సంబద్ధ గంగ;
శంత నావిష్కృత సత్ప్రేమ సంభావ్య
....సంసార బద్ధ సంస్కర్త్రి గంగ;
భూజన పాప నిర్మూల నోత్కంఠ ప్ర
....వాహ సముత్తుంగ భావ గంగ;
గీ.
శివ జటాజూట నిర్ముక్త జీవ గంగ;
వార్ధి సంలగ్న హృదయ సత్వరిత గంగ;
తుంగ రంగ దభంగ తరంగ గంగ;
కలుషిత ధ్వస్త సంస్తుత్య గగన గంగ!

సమస్య: నుతజల పూరితం బయిన నూతఁ బడం దగు సజ్జనాళికిన్

మంత్రి రాజున కెట్టి కృత్య మవలంబింపఁ దగినదో తెలుపుచున్న సందర్భము.

సతము హితమ్ముఁ గోరి, వరుసం దరిఁ జేరెడి దీను లందఱన్
వెతలఁ దొలంగఁ జేయుచు,సుభిక్షముగా మనఁ జేయ బాగు! దు
ష్కృతమతి యౌచుఁ దప్పులను జేయఁగఁ గీర్తి నశించు; నప్డు, భూ
నుత! జల పూరితం  బయిన నూతఁ బడం దగు సజ్జనాళికిన్!!

మంగళవారం, సెప్టెంబర్ 03, 2013

సమస్య: శూలి తనయ గంగ సోదరి యుమ

ఏకాదశి పర్వదినమును బురస్కరించుకొని శ్రీ మహా విష్ణువు శివకుటుంబము నాహ్వానించిన సందర్భము.

"రండు, రండు, రండు! ప్రార్థింతు రారండు!
శూలి! తనయ గంగ! సోదరి యుమ!
గణప! శరజ! రండు ఘనమైన దినమిది!
స్వాగత"మని శేషశాయి పిలిచె!!

సోమవారం, సెప్టెంబర్ 02, 2013

సమస్య: హంతకునకు వరమొసంగె నలర జగము

కం.
ఎంతయు ముదమున నస్త్రపు
సంతతి రామునకు నిడఁగఁ జని కౌశికుఁడా
గాంతను దాటకిఁ గూల్చిన
హంతకునకు వరమొసంగె నలర జగములున్! (1)

తే.గీ.
పాశుపతమును గోరి తపముఁ గిరీటి
సేయఁ, బరికించి, శివుఁ డయ్యి బోయ; కిటిని
బంపె; నరుఁడుఁ గొట్టె! శివుఁడు పరుగునఁ గిటి
హంతకునకు వరమొసంగె నలర జగము!! (2)