తేది: సెప్టెంబర్ 19, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:
(1)
ఒడిదొడుకు లిడక వరముల
నిడు పోచమతల్లిఁ గొలుచు♦ నేమముతోడన్
విడువక సాకనుఁ బోయఁగ
గుడికేగుట మేలు కల్లుఁ ♦ గొని భక్తులకున్!!
(2)
జడదారిఁ గొలువ భక్తుఁడు
గుడి కేగుట మేలు! కల్లుఁ ♦ గొని భక్తులకున్,
మృడున కపచార మిడకయ
వడిగా నిలు సేర మేలు ♦ పాయికి మిగులన్!!
(3)
మడితో నెట కేగుట మేల్?
వెడ శుక్రుం డేమి గొనియుఁ ♦ బ్రీతుం డగునో?
వడి వేల్పెవరికి వరమిడు?
గుడి కేగుట మేలు; కల్లుఁ ♦ గొని; భక్తులకున్!!