Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 31, 2015

సమస్య: గుణ హీనుం డైనవాఁడె గురు వన నొప్పున్!

తేది: జులై 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ప్రణిధానైశ్వర్యుండున్,
గణనఁ గనిన బ్రహ్మసూత్ర గరిమాది నిమం
త్రణ షట్ఛాస్త్రజ్ఞుఁ, డస
ద్గుణ హీనుం డైనవాఁడె గురు వన నొప్పున్!ఆదివారం, ఆగస్టు 30, 2015

సమస్య: సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!

తేది: జులై 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు

నా మొదటి పూరణము:
పోరునఁ ద్రిపురాసుర సం
హారమునకు విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
తేరు గుణి శిఖుల నిడ, మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!


***        ***        ***        ***        ***


నా రెండవ పూరణము:


(త్రిపురాసురసంహారమున నుపయుక్తమగు బీజాక్షరమ్ముం గొనుమని విశ్వకర్మ యనఁగా శివుఁడు "రం" బీజాక్షరమును స్వీకరించిన సందర్భము)"కోరుమయా బీజాక్షర
మేరీతిని యుక్తము మఱి హితకర" మనఁగన్
గోరి మనః కర్మణ వచ
సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!శుక్రవారం, ఆగస్టు 28, 2015

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ!

బ్లాగు మిత్రులకు, సుకవి మిత్రులకు, వీక్షకులకు
శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!!

ఆ.వె. 
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)

ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)

కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)

తే.గీ. 
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)

కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)

తే.గీ. 
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)

ఆ.వె. 
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి, 
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి, 
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)

కం. 
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)

తే.గీ. 
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి, 
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)

కం. 
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)

తే.గీ. 
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి! 
దేవి! నారాయణప్రి యాబ్ధిజ నమామి”
నుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)

తే.గీ. 
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)

తే.గీ. 
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)

కం. 
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14) 
(ఇది శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ)

-:o:శుభం భూయాత్:o:-


గురువారం, ఆగస్టు 27, 2015

సమస్య: పుష్కరస్నాన మొనరింపఁ బోయె సిరులు!

తేది: జులై 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(ఎన్నఁడునుఁ బుష్కరమ్ముల మాట వచింపని మగనిఁ బురికొల్పి, స్నానమాచరింపఁ జేసిన యొక గృహిణి వృత్తాంతము)ఎన్నఁడుం బుష్కరమ్ముల నెదనుఁ దలఁచి,
పోవనట్టిఁడువానితోఁ బోవుదమనఁ
బుష్కరస్నాన మొనరింపఁ బోయె! సిరులు
గేహమందు సమృద్ధిగఁ బోహళించె!!

మంగళవారం, ఆగస్టు 25, 2015

సమస్య: రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!

తేది: జులై 13, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముకామిత హరి రాజ్యంబునుఁ
బ్రేమనుఁ గాయంగఁ గోరి వేగిర పడఁగన్
భీమాజి డిందఁ జేసియు
రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!

(హరిరాజ్యంబు=వైకుంఠము)[వైరియై రావణుఁడు, తానతి శీఘ్రముగఁ బొందం గోరిన వైకుంఠ ధామ ద్వారపాలకత్వమును దయతోఁ బ్రసాదింపఁగ శ్రీరాముఁడు భీకర యుద్ధముం జేయు నెపమునఁ జంపి, యతని కోరికనుం దీర్చెనని తాత్పర్యము]
సోమవారం, ఆగస్టు 24, 2015

సమస్య: హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము...

తేది: జులై 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
నా మొదటి పూరణము:
కలదు తాజమహలది యాగ్రా నగరిని;
హౌర కలకత్తలోఁ; జార్మినారు, కోఠి
హైదరాబాదులోన; నౌకాశ్రయమ్ము
వరలె ముంబాయిలో! విను, భరతపుత్ర!!
నా రెండవ పూరణము:
ఏండ్లు గడచిన మునుమంది దేమియగునొ?
యెవ్వ రెఱుఁగుదురో యయ్య యీ నగరము?
కన నెడారులు సంద్రాలగునొ? వెలయునొ
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము?ఆదివారం, ఆగస్టు 23, 2015

సమస్య: విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్!

తేది: జులై 11, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ఆద్యంత రహితుఁ దెలుపు సు
వేద్యాంచితసూక్ష్మదర్శి, విస్తృతశాస్త్రా
ద్యద్యతనజ్ఞాని, యస
ద్విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్!!


శనివారం, ఆగస్టు 22, 2015

సమస్య: ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!

తేది: జులై 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముత్యక్తోద్భక్తి విగాహా
శక్తత దుర్వ్యసన భార సక్త సరుగ్ణో
ద్వ్యక్తాయత దుర్జీవ
న్ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!
ప్రతిపదార్థ తాత్పర్యములు ఇస్తేనే కాని
అర్థం కానట్టి ప్రౌఢపద్యాన్ని
పూరణగా ఇచ్చారని
శ్రీ కంది శంకరయ్యగారు తెలిపినందున,
నేను పాఠకుల, వీక్షకుల కోసం
పై పద్యానికి ఈ క్రింది విధంగా
ప్రతిపదార్థ తాత్పర్యాల్ని ఇస్తున్నాను:


దుర్వ్యసన=చెడు అలవాట్లు అనెడి
భార=బరువును
సక్త=తగిలించుకొనుట ద్వారా,
ఉత్+భక్తి=గొప్పభక్తిచేత
త్యక్త=విడువబడి (భక్తికి, పూజలకు దూరమై అనుట),
విగాహ=చక్కఁగా స్నానము చేయుటకును
అశక్తత=శక్తి లేక (స్నానం కూడా చేయలేక అనుట)
సరుగ్ణ=(శరీరము) రోగగ్రస్థమైనట్లుగా
ఉత్+వ్యక్త+ఆయత=బాగుగా తెలియబడుటయను వార్తావ్యాప్తి కలిగి (అనగా జనులందరికీ బాగా తెలియబడి అనుట)
దుర్జీవత్+ముక్తికిన్=దుఃఖకరమైనట్టి జీవముయొక్క విడుదలకు (అనగా దుఃఖకరమైన అకాలమరణమునకు అనుట)
మార్గమ్ము=దారితీయునది (అనగా కారణమగునది)
మద్యమునున్=మద్యమును
క్రోలుటయే=సేవించుటయే కదా!


భావం: దుర్వ్యసనాలకు బానిసను చేయడం ద్వారా...భక్తికీ, పూజాదికాలకూ దూరం చేసి, కనీసం స్నానం కూడా చేయడానికి కూడా శక్తిలేకుండా చేసి, రోగగ్రస్థుని చేసి, అందరిచేతా చీదరించుకోబడడం అనే దుఃఖాలను కలిగించి, చివరకు అకాల మరణానికి గురిచేసే...మహమ్మారి..."మద్యపానమే" కదా! అని భావం.
శుక్రవారం, ఆగస్టు 21, 2015

సమస్య: రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

తేది: జులై 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
శుంభన్ముఖి మండోదరి
రంభోరు మహేప్సితార్థ రంజిత మదనో
జ్జృంభద్ధృద్రాగోత్ప్రా
రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!గురువారం, ఆగస్టు 20, 2015

సమస్య: భారమనిరి తాళి భార్యలెల్ల!

తేది: జులై 07, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

సకల భువనములను సంతసమ్మునఁ దాల్చి
ప్రోచునట్టి మగఁడు పురుష వర్యుఁ
డష్టభార్యలకును హర్షంబునను గట్ట
"భార" మనిరి తాళి భార్యలెల్ల!

(చతుర్దశ భువన భాండములను భరించు భర్త [ =అట్టి భర్త కట్టిన తాళి] భారముగాఁ గాక తేలికగా నుండునా?)
మంగళవారం, ఆగస్టు 18, 2015

సమస్య: కలికి పద తాడనమ్ములే కడు ప్రియములు!

తేది: జులై 06, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


వెగటు చేష్టలు చేయుచు, వీరుల వలె 
వెకిలి నవ్వులు నవ్వుచు, వెంటఁ బడెడి
దుడుకు యువకుల దండింపఁ దొడగినట్టి
కలికి పద తాడనమ్ములే కడు ప్రియములు!!ఆదివారం, ఆగస్టు 16, 2015

దత్తపది: కబాడి-క్రికెట్టు-టెన్నిసు-హాకీ...భారతార్థంలో...నచ్చిన ఛందంలో...

తేది: ఆగస్టు 14, 2015 న వాట్సప్ లోని "పండిత సమాఖ్య" లో నొక మిత్రుఁడు దత్తపది శీర్షికన
కబాడి-క్రికెట్టు-టెన్నిసు-హాకీ
పదాలను ఉపయోగించి
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి (పంచపాది) పద్యము
పంచపాది:
క్రి కెట్టులో మదిమెచ్చు సరసమైన
భక్తి గీతికఁ బాడిరి పాండు సుతులు
సూనృతమ్మైన మాటెన్ని సుగతుల నిడ
"నో సహస్రబాహా! కీడు నుపశమింపు!"
మనుచు కైమోడ్పులం గూర్చి వినమితులయి!శనివారం, ఆగస్టు 15, 2015

దత్తపది: సమంత-తమన్న-త్రిష-అనుష్క...భారత స్వాతంత్ర్య సంగ్రామం గూర్చి...నచ్చిన ఛందస్సులో...

తేది: ఆగస్టు 14, 2015 న వాట్సప్ లోని "పండిత సమాఖ్య" లో నొక మిత్రుఁడు దత్తపది శీర్షికన
 సమంత-తమన్న-త్రిష-అనుష్క 
పదాలను ఉపయోగించి
 భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని గూర్చి
నచ్చిన ఛందస్సులో వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము


(తెల్లదొరలను పాఱఁద్రోలడానికి భారతస్వాతంత్ర్యోద్యమ యజ్ఞాన్ని, ధనుర్వేదాన్ని దీక్షతో సాధనఁ జేయు ధానుష్కులవలె చేయవలెనని గాంధీజీ భారతీయులనుం గోరిన సందర్భము)"దుష్ట సితముఖుల్ సేసిన దోసమంతఁ
గదలఁ ద్రోలి, భరతమాతఁ గాతమన్న;
భారత స్వతంత్ర త్రిషవణముఁ జేయ
వలయు ధానుష్క దీక్షిత స్వరువు వోలె!"పద్య రచన: మహారాణా ప్రతాప సింహుడు...

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం

సాహితీ మిత్రులకు, సుకవులకు, వీక్షకులకు
భారత స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలు!

తేది: జులై 06, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రానికి నేను వ్రాసిన...
తేటగీతి మాలిక:
భరతదేశ మహావీర! పరమ పురుష!
జన్మభూమిని శత్రుహస్తగతఁ గాక
యుంటకై పోరి యక్బరు వంటి వాని
ముప్పుతిప్పలు పెట్టి యపూర్వమైన
ధైర్యసాహసములు సూపి ధరణిమాత
ఋణముఁ దీర్చుకొన్నట్టి యుర్వీతనయ!మ
హోదయా! మహారాణ! సమాదరించు
ధాత్రి నిరతమ్ము నిన్నుఁ బ్రతాపసింహ!


స్వస్తి

గురువారం, ఆగస్టు 13, 2015

న్యస్తాక్షరి: ప్రతిపాదాద్యక్షరం ప-చ్చ-ద-నం...వృక్షసంరక్షణ గూర్చి...ఆటవెలఁది పద్యం...

తేది: జులై 05, 2015 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- వృక్షసంరక్షణ
ఛందస్సు- ఆటవెలది
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘ప - చ్చ - ద - నం’ ఉండాలనగా
నేను వ్రాసిన పద్యము
త్త్రి రక్ష ణాఖ్య వర రత్న యత్నతో
చ్చతను నేఁడు ముఖ్య సచివు నాజ్ఞఁ
రువు లెన్నొ నాటి పరిరక్షణము సేయ
నంద మిడును! వర్ష మంద మిడును!!బుధవారం, ఆగస్టు 12, 2015

పద్య రచన: భరతుని బాల్యక్రీడలు...

తేది: జులై 05, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన ఆటవెలఁది పద్యము


(భరతుఁడు సింగపుఁగొదమల నదలించుచు నాడుకొనుట)


అలరుఁ బుట్టువుననె యామోద మందించు
చందముగను భరతుఁ డందముగనుఁ
జిత్రమైన రీతి సింగంపుఁ గొదమలఁ
జేతఁ బూని యాడెఁ! జిఱుత యతఁడె?మంగళవారం, ఆగస్టు 11, 2015

సమస్య: స్వర్ణ మృగమును రాముఁడు పట్టి తెచ్చె!

తేది: జులై 04, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(బంగరు జింకనుఁ దెచ్చుట కేఁగిన రామునిం గూర్చి కైమోడ్పులతో సీత తన మనస్సున వితర్కించిన సందర్భము)

"స్వర్ణ మృగమును రాముఁడు పట్టి తెచ్చె
నా, మదీయ హృదయమున హర్షమెసఁగుఁ!
దేక పోయెనా, మదిని భ్రాంతియు నణంగు!
నేమి యైనను నేను మన్నింతు నిపుడు!!"


సోమవారం, ఆగస్టు 10, 2015

సమస్య: నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!

తేది: జులై 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(వెన్నను దొంగిలించుమని పురికొల్పిన వెన్నుని నేస్తములను బలరామునితోపా టొక్కొక్కరినిం జిఱుకోపమునం దర్జించుచు యశోద పలుకుచున్న సందర్భము)


"అన్నా! వెన్నల దొంగిల
వెన్నునిఁ బురికొల్పు  మిమ్ము వెన్నుల మీదన్
జెన్నుగఁ గొట్టెద వరుసగ
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!"ఆదివారం, ఆగస్టు 09, 2015

సమస్య: హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్!

తేది: జులై 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(శప్తుఁడగు పతి మరణ కారకమైన సూర్యోదయము నరికట్టుటకై సతీసుమతి పలికిన సందర్భము)"మత్పతి శప్తతఁ గని మ
ద్ధృత్పద్మము ముడుచుకొనియె! నినుఁ డుదయింపన్
సత్పథగామిగఁ గాక, వి
య త్పరివృత తిమిరము వెలయఁగవలె నెపుడున్!!"శనివారం, ఆగస్టు 08, 2015

సమస్య: వాణి వీణ యెల్లపు డపస్వరముఁ బల్కు!

తేది: జులై 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

గాత్ర సంగీత సాధనకై యెపుడును
వాణి వీణలు స్పర్థనుఁ బరిఢవింతు!
రెన్నఁడేని యపస్వర మెసఁగఁ జనదు
వాణి! వీణ యెల్లపు డపస్వరముఁ బల్కు!!
బుధవారం, ఆగస్టు 05, 2015

పద్యరచన: సైంధవవధ...

తేది: జూన్ 30, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన పద్యము 
తేటగీతిమాలిక:
పాండవుల నడ్డి యభిమన్యు పాలిట యముఁ
డైన కతమున సైంధవుఁ డర్జున కృత
శపథ ఫలముగ ననిలోన జడిసి డాఁగఁ;
జక్ర మడ్డుగఁ బెట్టియుఁ జక్రి రవి కి
రణము లడ్డంగఁ; జీఁకటి రణతలమునఁ
గాంచి చనుఁదెంచ; నర్జునుం డంచితముగ
వానిఁ జంపియుం బ్రతిన నప్పగిదిఁ దీర్చె!


మంగళవారం, ఆగస్టు 04, 2015

సమస్య: కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!

తేది: జూన్ 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ఒక వైద్యశాలలో నొక రోగికి మందిడగా నతఁడు చేయు వింత చేష్టలను గని పరిచారిక భిషక్కుతోఁ బలికిన సందర్భము)
"చేకొని మందిడ, నితఁ డిడెఁ
గీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
కేకల! నిది కనఁగ వితథ
మో, కాక నిజమొ? కనుఁగొను మో దోషజ్ఞా!"
సోమవారం, ఆగస్టు 03, 2015

దత్తపది: శివ-హర-భవ-రుద్ర...విష్ణుస్తుతి...నచ్చిన ఛందస్సులో...

తేది: జూన్ 28, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
శివ - హర - భవ - రుద్ర
పదాలను ఉపయోగిస్తూ...విష్ణువును స్తుతిస్తూ
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము
హరి! రథాంగపాశి! వనమాలి! రవినేత్ర!
శార్ఙ్గధర! వరాహ! రమేశ! శంఖపాణి!
పద్మనాభ! వరాంగ! సువర్ణవర్ణ!
స్వభు! గరుద్రథరథ! చక్రి! పాహి పాహి!!

(గరుద్రథరథ=[గరుద్రథుఁడు=గరుత్మంతుఁడు] గరుత్మంతుని రథముగా [=వాహనముగా] గలవాఁడా..అనఁగా ఓ విష్ణుమూర్తీ...అని తాత్పర్యము)ఆదివారం, ఆగస్టు 02, 2015

సమస్య: శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!

తేది: జూన్ 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
అవధినిడె నూరు తప్పుల
కవలం బరిమార్ప వృష్ణి! యా శిశుపాలుం
డవహేళన సేసె! హరికి
శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!!

(రాసభము = గాడిద [శిశుపాలుఁడనెడు గాడిద])