Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 31, 2014

సమస్య: చవట కదా నిన్నుఁ దలఁప శంకర పత్నీ

తేది: జులై 24, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


ప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! పార్వతి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!

మంగళవారం, జులై 29, 2014

సమస్య: తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల

తేది: జులై 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

జనుల మోసగించు, జగడమ్ములాడును,
మద్యపానమందు మమతఁజూపు,
"సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!

ఆదివారం, జులై 27, 2014

సమస్య: వేయికనులవాఁడు వినతకొడుకు

తేది: జూలై 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముమాతృదాస్యమపుడు మాన్పఁగా నమృతమ్ముఁ
గాద్రవేయుల కిడఁగా, హరించె
వేయికనులవాఁడు! వినతకొడుకు తల్లి
చెఱను డుల్చి, వెలిఁగె స్థిరముగాను!

గురువారం, జులై 24, 2014

సమస్య: రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్

తేది: జులై 19, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముదేవుఁడని యెఱుఁగకయె యా
దేవుని యాలినిఁ జెఱఁగొని తిప్పలనిడ నా
దేవుని చేతనె మడిసెను
రావణుఁ! డా సీతమగఁడు రక్షించు మిమున్!


మంగళవారం, జులై 22, 2014

సమస్య: వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన

తేది: జులై 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


అఱువదేఁడుల కల నిజమైన వేళఁ,
బాలకులు గిరిజనుల వివక్షఁ జూపి,
యాజ్యమునుఁ బోసి రగిలింప, నకట, పోల
వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన!


సోమవారం, జులై 21, 2014

సమస్య: పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై

తేది: జులై 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

తుట్టతుద వరకు సుఖముగ
నెట్టి విధమునైన బ్రదుక నెంచియు, నడుమన్,
"బిట్టుగ బ్రదికెడు యోచన
పుట్టినవాఁ" డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై!
(వృద్ధుఁడై మరణించువరకు సుఖజీవనము గడపఁదలఁచినవాఁడు, నడుమనే మరణించవలెనని యనుకోఁబోఁడని యాశయము)

ఆదివారం, జులై 20, 2014

సమస్య: దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె

తేది: జులై 14, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పంచపాది)
శాపమే లేనిచో, రామ సహిత రామ
లక్ష్మణుల వనవాసాన రావణుండు
జానకినిఁ జెఱ నిడ, వానిఁ జంపి, జనుల
కష్టములఁ బాపు టెట్టులఁ గలుగుఁ? గాన,
దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె! (౧)

శాపవశమున రాముఁడు జనన మంది,
జానకీపతియై, వనిఁ జని, యసురపు
వైరమునఁ బోరి, చంపఁగఁ బ్రజల కపుడు
"దశరథుని శబ్దభేది" మోదమ్ముఁ గూర్చె! (౨)

బుధవారం, జులై 16, 2014

సమస్య: పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు

తేది: జులై 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు
సూర్యచంద్రులు లేకయే చోద్యముగను
వికసనమునందెఁ గవులార వేగిరముగఁ
బూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!

శనివారం, జులై 12, 2014

సమస్య: జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్

తేది: జూలై 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(శివధనుర్భంగము గావించిన శ్రీరాముని పుష్పమాలాలంకృతుని జేయుచు సీత పలికిన సందర్భము)

త్రినయన ధనుభి ద్యోధుని,
దనుజాంతకు, సవనరక్షిఁ, ద్వరితోద్య న్నూ
తన వరరాగ మనస్సం
జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్!

గురువారం, జులై 10, 2014

సమస్య: రాముని భార్యలకు నింద రానేవచ్చెన్

తేది: జూలై 08, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు


(1)
(చవితి చంద్రుని దర్శించిన దోషముచే మునిపత్నులు అగ్నివలన నిందలు మోయవలసివచ్చిన సందర్భము)

కామించియు ముని పత్నులఁ
బ్రేమనుఁ బొందంగలేని విశ్వపు సతి యా
భామల రూపెత్తఁగ నౌ
రా! మునిభార్యలకు నింద రానేవచ్చెన్!

(2)
(లక్ష్మీపద్మావతుల మూలముననే వేంకటేశుఁడు ఱాయైనాఁడని యొక వదంతి పుట్టెననుట...)

రామల నడుమను వేఁగుచు
నేమియుఁ బలుకకయె వేంకటేశుఁడు ఱాయై
భామల విడ, మా హృదయాఽ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్!


సోమవారం, జులై 07, 2014

సమస్య: వానలు రైతులకు దుఃఖభాజనము లగున్

తేది: జూలై 07, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

చేనికి నవసర మగు తఱి
నైనను గుఱియకయె మిగుల నార్తినిఁ ద్రోయున్,
జేనినిఁ బడవలదనఁ, బడి,
"వానలు" రైతులకు దుఃఖభాజనము లగున్!

ఆదివారం, జులై 06, 2014

సమస్య: కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్

తేది: జూలై 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(కోకిల యను పేరుగల బాలిక పక్షుల కూఁతలు సాధన జేయు సందర్భము...)

చక్కని బాలిక కావునఁ
జిక్కని యనుకరణఁ జూప శీఘ్రమె వేడ్కన్
జొక్కఁపుఁ గూఁతలఁ గూయుచుఁ
"గొక్కొరొకో కొక్కొరొ"యని కోకిల కూసెన్!

శనివారం, జులై 05, 2014

సమస్య: మంచి విద్యల నేర్చుట మానవలెను

తేది: జూలై 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(దుష్టవిద్యలవలని నష్టములఁగూర్చి ముచ్చటించుచుఁ గట్టమంచివారితో నతని మిత్రుఁడు పలికిన సందర్భము)

జనులఁ గికురువొడిచి, వారి ధనము నపహ
రించు విద్యలు నేఁడు విశృంఖలముగఁ
జెలఁగెఁ! ద్వరిత గతినిఁ జెడు తొలఁగఁ, గట్ట
మంచి! విద్యల నేర్చుట మానవలెను.

గురువారం, జులై 03, 2014

సమస్య: సవతి లేని యింట సౌఖ్యమేది?

తేది: జూలై 03, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


లోని కడుగిడఁగను వీనుల విందైన
మాటలాడి, తోషమందుఁ దేల్చి,
మగని గారవించఁగను బ్రియోక్తి సుధార
సవతి లేని యింట సౌఖ్యమేది?