తేటగీతులు:
ఫాల్గునపు మాసమున వచ్చు పౌర్ణమి తిథి
నాఁడు కాముని పున్నమి నామకమున
జరుపు రంగుల పండుగ సకల జనుల
కైకమత్యమ్ము నేర్పుచు ఘనతఁ గనును!
ఇట్టి పండుగ జరుపుట కెన్నొ కథలు
గలవు! వానిలో నొక్కటిఁ గనఁగ నిదియ!
మునుపు శివుఁడు, సతి యెడబాటును సహింప
లేక, హిమవన్నగమ్మున నేకతముగఁ
దపము సేయంగఁ దొడఁగెఁ జిత్తమును నిలిపి!
అదియ కని, హిమవంతుఁడే యా శివునకు
సేవ లొనరింపఁ గూఁతు నుంచినఁ గనుఁగొని,
యింద్రు నాజ్ఞచే మన్మథుం డేయు పూల
బాణములకు హరుండు సంజ్వరమునంది;
తీక్ష్ణముగఁ ద్రినేత్రమ్మునుం దెఱచి చూడ;
భగ్గుమని మండి కాముండు భస్మమాయె!
రతియె ప్రార్థింప, శాంతించి, ప్రాణమునిడి,
"యతనుఁడై వెలుఁగొందు" నం చనిపె నపుడు!
అట్టి కామ దహనము నేఁ డగుట కతన,
జనులు ప్రతివత్సర మ్మిట్టి సంఘటనము
మఱచిపోకుంటకై నేఁడు మన్మథ దహ
నమ్ము సేయుచునుండి రంతటను విధిగ!
కామ దహ నోత్తర దినాన ఘనముగాను
ప్రజలు వివిధ వర్ణమ్ములఁ బఱఁగఁ జల్లు
కొనుచు సంతసమ్మునఁ బండుగును జరుపుచు
సంప్రదాయమ్ము నిలుప నెసంగుచుండ్రి!
ఈ వసంత కాలమ్మున నెట్టి విషపు
జ్వరములును రాక యుంటకై వనమునఁ గల
సహజ వర్ణాల సేకరించంగఁబూని,
యట్టి యౌషధ గుణముచే హాయి నుండ్రు!
నిమ్మ, కుంకుమ, బిల్వ, దానిమ్మ, పసుపు,
కింశుకపుఁ బుష్ప సంచయాంకితులునయ్యు,
సహజ వర్ణాలఁ బ్రకృతిచే జగము మెఱయ
రంగులనుఁ జల్లుకొందురు రమణమీఱ!
ఇట్టి ప్రాకృతికపు రంగు లెన్నియేని
వాడుచో నెట్టి హానియుఁ బడయకుండ,
నౌషధ గుణమ్ముచేత జాడ్యములు తొలఁగి,
ప్రజలు నారోగ్యముగ నుందురయ నిరతము!
అధిక సముపార్జనాపేక్షనంది కొంద
ఱిట రసాయన మిళిత సంస్కృతినిఁ బూని,
వర్ణములఁ గృత్రిమ రసాయ నార్ణవమ్ముఁ
జేసి, ప్రజ రుజగ్రస్థులఁ జేయుచుంట,
మనకు దురదృష్టముగ మారెఁ గనఁగ నిపుడు!
స్వస్తి