Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 15, 2016

సాహితి సవ్వడి (పద్యాల సవ్వడి) వారి ఇ పేపర్‌లో నా పరిచయం



"సాహితీ సవ్యసాచి" గుండు మధుసూదన్

వరంగల్: ప్రముఖ పద్యకవి, రచయిత గుండు మధుసూదన్


వరంగల్ జిల్లాలోని గిర్మాజీపేట గ్రామంలో గుండు మల్లికాంబ, రామస్వామి లకు అష్టమ సంతానంగా జన్మించిన గుండు మధుసూదన్ పద్యకవిగా తెలుగు సాహితీలోకంలో సుపరిచితులు. ఒకవైపు అధ్యాపకులుగా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూనే, మరోవైపు తన ప్రవృత్తి అయిన పద్య సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తూ, ఇప్పటివరకు దాదాపు రెండువేలకు పైగ పద్యాలు రాసిన తాను, అనేక అంతర్జాల బ్లాగుల్లోనూ, వాట్సప్, ఫేస్ బుక్ తదితర వేదికల్లో అనేక రచనలు చేస్తూనే, ఇంకెందరికో మార్గదర్శనం చేస్తున్న గుండు మధుసూదన్ గారికి చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. పాటలుకూడా పాడతారు. తెలుగు సాహితీ ప్రపంచంలో భాష మనుగడకోసం నిరంతరం కృషిచేసే "సాహితీ సవ్యసాచి", మన తెలంగాణతల్లి ముద్దుబిడ్డ గుండు మధుసూదన్.

మధుసూదనుని కలంనుండి జాలువారిన రచనలు:
1. వేయికి పైగా పద్యరూప సన్మాన పత్రములు
2. సూక్తి ముక్తావళులు (పద్యాలు)
3. "హరి" శతకము, "తెలుగు బాల" శతకము
4. పెక్కు దేవతా స్తుతులు, ఖండ కావ్యాలు
5. వేయికిపైగా సమస్యాపూరణలు, దత్తపదులు, నిషిద్ధాక్షరులు, న్యస్తాక్షరులు, వర్ణనలు, మొ.,
6. బాలల నీతి పద్య కథలు (సులభ శైలిలో)


సన్మానాలు - పురస్కారాలు:
1. ఆంధ్ర పద్య కవితా సదస్సు, శ్రీలేఖ సాహితి, సహృదయ సాహితి వారలచే పద్యకవిగా సన్మానం.
2. రాష్ట్రభాషోపాధ్యాయ సంస్థ, బహుజన ఉపాధ్యాయ సంఘం వారలచే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "పద్య తెలంగానం" లో పద్య కవిగా సన్మానం.
4. అయుత కవితా యజ్ఞంలో వేయికి పైగా పద్య కవితలను ప్రకటించినందుకు "తెలుగు కవితా వైభవం, హైదరాబాదు" వారిచే "సహస్ర కవి భూషణ" మొ. బిరుద ప్రదానం, సన్మానం.
5. పోతన జయంత్యుత్సవాల సందర్భంగా "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారిచే ఓరుగల్లు పద్యకవిగా బమ్మెర గ్రామంలో సన్మానం.
6. "పద్యాల సవ్వడి" లో పద్యాలతో సాహితి సవ్వడి చేస్తున్న మధురకవి గుండు మధుసూదన్ గారు "గురజాడ ఫౌండేషన్, అమెరికా" వారి "తెలుగు కవిత పురస్కారం-2016" కు ఎంపికైనారు.


-చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యం పైన మక్కువ
-వృత్తి అధ్యాపకుడు -ప్రవృత్తి సాహిత్యం
-రెండు వేలకు పైగా పద్య రచనలు
-ఎన్నో పురస్కారాలు, బిరుదులు

పద్యం ద్వారానే తెలుగు భాషకు పునర్వైభవం: మధురకవి గుండు మధుసూదన్
తెలుగుభాషకు పునర్వైభవం తెలుగు పద్యం ద్వారానే సాధ్యమవుతుంది. మన తెలుగు మృతభాషగా మారకూడదంటే...పద్యాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. తెలుగు పద్యం రక్షింపబడితేనే, తెలుగుభాష రక్షింపబడుతుంది. సాంప్రదాయికమైన తెలుగుభాష పద్యాలలోనే ఉంది. కాబట్టి ప్రతి తెలుగువాడూ పద్యాన్ని రాయాలి, ఆదరించాలి, పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి.
స్వస్తి

బుధవారం, ఆగస్టు 10, 2016

బాలల నీతి పద్య కథలు: మంత్రి తెలివి



ఒక్క రాజుగారికిఁ బల్వు రూడిగీండ్రు
కలరు సేవల నొనరింపఁగాను మిగుల!
నందఱును నమ్మకము గలయట్టి వారె!
రాజుకొఱకు కష్టములందు వ్రాలువారె!! 01

ఒక్క దినమున రాజు శుద్ధోదగాహ
మునుఁ జలుపఁగం జనుచుఁ దన ముద్రిక నొక
స్వర్ణ పేటిక యందున భద్రముగను
నుంచి స్నానమ్ముకై సనె నంచితముగ! 02

రాజు స్నానమాడియు వచ్చి రభసముగను
ముద్దుటుంగరమునుఁ దాల్చఁబోవఁ, బెట్టె
నుంగరము మాయమాయె! వరాంగుళీయ
కమ్ము కానుపించని కారణమ్మదేమొ?  03

తనదు పెండ్లినాఁటి బటువు; ఘనమగు నుడు
గరయునైనట్టి యయ్యది కానఁబడక
యుండఁగా నెవ్వ రూరక యుందు రయ్య?
రాజు వేగమే మంత్రిని రమ్మనమనె! 04

మంత్రి వచ్చిన తోడనే మన్ననమునఁ
గూరుచుండంగఁజేసియుఁ గూర్మిమీఱ
జరిగినట్టి వృత్తాంతమ్ము సాంతముగను
దెలిపి, దొంగనుఁ బట్టించు వలనుఁ గోరె! 05

మంత్రి యెంతయు యోచించి, మంచివార
లైన సేవకులకుఁ గీడునైన నీయ
కుండ దొంగనుఁ బట్టంగఁ గోరిక మెయి
నొక్క యాలోచనము సేసె నక్కజముగ! 06

యోచనము సేసి యిట్లనె "నోయి రాజ!
సేవకులఁ బిలిపింపుఁడు శీఘ్రముగను!
వారితో మాటలాడి నేఁ జోరునిఁ దగఁ
బట్టుకొందును తప్పక పార్థివ వర!" 07

వెంటనే రాజు వారలఁ బిల్వనంప,
వార లందఱు వచ్చిరి పరుగుతోడ!
మంత్రి వారికి నొకకొన్ని మంత్రపూత
మైన పుడుకల నిడి పల్కె మానితముగ! 08

"సేవకోత్తములార! విశిష్టమైన
యీ పుడుకలను మీరలు హితముఁ గోరి
చేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసి నా కిండు రాణమీఱ! 09

ఇవియ మాహాత్మ్యమున్నట్టియవియ కాన,
చోరహస్తంపుఁ బుడుక యించుక పెరుఁగును!
కాన, దొంగ తప్పక దొరుకంగఁ బట్టు
మార్గ మిద్దియ యగు! మీకు మంచి జరుగు!!" 10

అనఁగ విన్న చోరుఁడు శీఘ్ర మతని చేతఁ
గల పుడుకను దా నొకయించుక విఱిచి వెసఁ
జేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసియు మరలి వచ్చెనపుడు! 11

అంత మంత్రియు నందఱి హస్తములను
గల పుడుకలఁ బరీక్షించి, కడను నున్న
సేవకుని పుల్లనుం బరీక్షించఁగానె
యించుకయ తగ్గియుం గానుపించె నదియె! 12

వెంటనే మంత్రి యతఁడె తా వెదకుచున్న
దొంగ యని గుర్తెఱింగియుఁ దొందరించి,
పట్టి బంధించి, చెఱలోనఁ బెట్టెనపుడు!
యుక్తిచేఁ గార్యముల్ దీరు నుత్తమముగ!! 13

స్వస్తి


సోమవారం, ఆగస్టు 08, 2016

బాలల నీతి పద్య కథలు: తొందరపాటు...


ఒక్క యూరను బ్రాహ్మణుం డొకఁడు గలఁ డ
తండు విష్ణుశర్మాభిధఁ దనరుచుండు!
నతని భార్యయె యన్నపూర్ణమ్మయనఁగఁ
బేరునకుఁ దగు గుణముచే వెలుఁగుచుండు!! 1

ఆమె ప్రేమతో వేసెడి యన్నపు మెతు
కులనుఁ దిని యొక్క ముంగిస కూర్మితోడ
నిల్లుఁ గాఁచుచు నుండును నెల్ల వేళ
లందు ఫణులు రాకుండ సురక్షితముగ! 2

ఒక్క దినమున బాపఁడు ప్రక్క యూర
జరుగు బ్రహ్మోత్సవములకుఁ జనఁగ నటులె
యతని భార్యయుఁ దమ పుత్రు నచటి తొట్టె
లో నిదురపుచ్చి నీటికై తానునుఁ జనె! 3

వార లేఁగుటఁ గాంచి సర్పరిపు వంత
నింటిలోనికి నేఁగి తా హితముఁ గనఁగఁ
గాఁపు గాయుచుండఁగ నొక్క కాళ మచటి
త్రాటిపై నుండి యుయ్యేల దరికి వచ్చె! 4

పామునుం గాంచి ముంగిస పరుగునఁ జని,
తొట్టెపైఁకి లంఘించియు దిట్టతనము
తోడ దానితో వడిగఁ బోరాడి దాని
ఖండములుగఁ జేసియుఁ జంపె ఘనత మెఱయ! 5

పేరునకు ముంగిసయె కాని, ప్రేమమునకు
మనుజు కన్నను నెక్కుడౌ మాన్యయదియె!
మేలు మఱచి కీడొనరించు కూళకన్నఁ
గొలఁది మేల్ గృతజ్ఞ యగు నకులము మిన్న! 6

అహిరిపువు సర్పముంజంపి యచటనె తన
ఘనతఁ జూపింప వేచియుండిన క్షణమున
నీరముం దెచ్చు గేహిని నినదము విని
పరుగు పరుగున నెదురేఁగెఁ బ్రమదమునను! 7

నోట రక్తమ్ము కాఱ సంతోషముగను
నెదురయిన ముంగినిం గని ముదిత యపుడు
తనదు కొమరునిఁ జంపె నటనుచుఁ దలఁచి
చేర రాఁగానె తన బిందెచేతఁ జంపె! 8

చంపి లోనికి నేఁగి తా సత్వరముగ
నూయెలను గల పుత్రుని డాయఁగఁ జని
సుఖముగా నిద్ర పోయెడి సుతునిఁ గాంచి
క్రింద ముక్కలై యున్నట్టి దృంభువుఁ గనె! 9

కనిన యంత ముంగిస యొనర్చిన కృతమ్ము
సర్వ మవగతమ్మాయెఁ బ్రశస్తమైన
త్యాగముం గని దుఃఖించెఁ దానొనర్చి
నట్టి ద్రోహమ్ముఁ దలఁచియుఁ దుట్టతుదకు! 10

చూచితిరె మీరు మేల్గూర్చుచుండు జనులఁ
దొందరించియుఁ గీడునుఁ బొందఁజేయు
మౌఢ్యమందించెఁ గద దుఃఖ మాఢ్యులకును!
వలదు, దొసఁ గిడు తొందరపాటు వలదు!! 11

స్వస్తి