Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 20, 2021

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్య్మ కథ

బ్లాగు మిత్రులకు, సుకవి మిత్రులకు, వీక్షకులకు
శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!!






ఆ.వె. 
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)

ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)

కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)

తే.గీ. 
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)

కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)

తే.గీ. 
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)

ఆ.వె. 
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి, 
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి, 
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)

కం. 
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)

తే.గీ. 
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి, 
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)

కం. 
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)

తే.గీ. 
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి! 
దేవి! నారాయణప్రి యాబ్ధిజ నమామి”
నుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)

తే.గీ. 
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)

తే.గీ. 
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)

కం. 
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14) 

స్వస్తి




(ఇది శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ)

-:o:శుభం భూయాత్:o:-

ఆదివారం, ఆగస్టు 08, 2021

నూటయెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటయెనిమిదవ పద్యము:

చంపకమాల:
స్థిత మతి జోడ్చియుం, గడిఁది శ్రేష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య సౌ
మ్యత, గురుతం; గడుం బొసఁగ, మాన్యతఁ గూర్చియుఁ బ్రోవుమయ్య; గ
ణ్యత ధృత ప్రేమ, నా శతక మంకితముం గొని, శాంతిఁ బెంచి, కృ
ష్ణ! తనుపవే! హరీ! తనర సంబర మీయవె! తార్క్ష్య! కేశవా! 108

గర్భిత కందము:
మతి జోడ్చియుం, గడిఁది శ్రే
ష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య సౌమ్యత, గురుతన్;
ధృత ప్రేమ, నా శతక మం
కితముం గొని, శాంతిఁ బెంచి, కృష్ణ! తనుపవే! 108

గర్భిత తేటగీతి:
కడిఁది శ్రేష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య!
పొసఁగ, మాన్యతఁ గూర్చియుఁ బ్రోవుమయ్య!
శతక మంకితముం గొని, శాంతిఁ బెంచి,
తనర సంబర మీయవె! తార్క్ష్య! కేశ! 108


ఇది శ్రీమద్వాసుదేవకరుణాకటాక్షవీక్షణావాప్తకవితావిశేష శ్రీమద్గుండువంశపయోవారాశిపూర్ణచంద్ర మల్లికాంబా రామస్వామి సత్పుత్ర త్రిలింగభాషావిద్వత్కవివిధేయ మధురకవి బిరుదాంచిత మధుసూదన నామధేయ విరచిత శ్రీకేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము సర్వము సమాప్తము


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నూటయేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటయేడవ పద్యము:

చంపకమాల:
నవ శతకాద్యులే యిలను నా శతకమ్ముఁ బఠింపఁగాను, స
వ్య వివధమౌఁ; దగన్ వెలయఁ బ్రస్ఫుట గర్భకవిత్వ మిచ్చు; శ్రీ
ధవ! హిత పండితుల్ గనఁగ, ధన్యత నిచ్చును గాఢ భక్తి; యా
దవ మహితా! హరీ! స్థిరత, దైవిక గాథలఁ దెల్పుఁ గేశవా! 107

గర్భిత కందము:
శతకాద్యులే యిలను నా
శతకమ్ముఁ బఠింపఁగాను, సవ్య వివధమౌ;
హిత పండితుల్ గనఁగ ధ
న్యత నిచ్చును గాఢ భక్తి; యాదవ మహితా! 107

గర్భిత తేటగీతి:
ఇలను నా శతకమ్ముఁ బఠింపఁగాను,
వెలయఁ బ్రస్ఫుట గర్భకవిత్వ మిచ్చుఁ;
గనఁగ, ధన్యత నిచ్చును గాఢ భక్తి;
స్థిరత, దైవిక గాథలఁ దెల్పుఁ గేశ! 107



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, ఆగస్టు 07, 2021

నూటయాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటయాఱవ పద్యము:

చంపకమాల:
వెస రచియింప నన్ సరిగఁ బ్రేచి, చికీర్షిత చర్చ సేసి, చే
ర్చి సదయఁ దా, మొగిన్ దొసఁగుఁ జెప్పియు, దిద్దఁగఁ, దుష్టి మెచ్చియున్,
దెస వచియించి, నన్ బరఁగ దిగ్రుచిఁ దేల్చిన పండితాళిఁ గొ
ల్తు సతతమున్; హరీ! యడుగుఁ దోయజ మంటెద నయ్య! కేశవా! 106

గర్భిత కందము:
రచియింప నన్ సరిగఁ బ్రే
చి, చికీర్షిత చర్చ సేసి, చేర్చి సదయఁ, దా
వచియించి, నన్ బరఁగ ది
గ్రుచిఁ దేల్చిన పండితాళిఁ గొల్తు సతతమున్! 106

గర్భిత తేటగీతి:
సరిగఁ బ్రేచి, చికీర్షిత చర్చ సేసి,
దొసఁగుఁ జెప్పియు, దిద్దఁగఁ, దుష్టి మెచ్చి,
పరఁగ దిగ్రుచిఁ దేల్చిన పండితాళి
యడుగుఁ దోయజ మంటెద నయ్య! కేశ! 106



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నూటయైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటయైదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! నినుఁ గేశవున్ శతక రూపునఁ గొల్చియు, సన్నుతింపఁ, బ్రో
వవె వెస నన్! హరీ! పుడమి వర్ధిలఁ, బొత్త మపూర్వరీతిఁ జూ
పవె! ఘనదైవమా! కవుల పంక్తినిఁ జేర్చియు, గారవించి, తే
ర్పవె జగతిన్! గడున్ భువిని వ్యాప్తము సేయవె! పూజ్య! కేశవా! 105

గర్భిత కందము:
నినుఁ గేశవున్ శతక రూ
పునఁ గొల్చియు, సన్నుతింపఁ, బ్రోవవె వెస నన్!
ఘనదైవమా! కవుల పం
క్తినిఁ జేర్చియు, గారవించి, తేర్పవె జగతిన్! 105

గర్భిత తేటగీతి:
శతక రూపునఁ గొల్చియు, సన్నుతింపఁ,
బుడమి వర్ధిలఁ, బొత్త మపూర్వరీతిఁ
గవుల పంక్తినిఁ జేర్చియు, గారవించి,
భువిని వ్యాప్తము సేయవె! పూజ్య! కేశ! 105



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శుక్రవారం, ఆగస్టు 06, 2021

నూటనాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటనాలుఁగవ పద్యము:

చంపకమాల:
గత సుకవీశులం దమర, గర్భకవిత్వ ప్రియత్వ మేచ, వ్రా
సితిఁ గొలఁదిన్; గనం, గవిత శ్రేష్ఠముఁ గ్లిష్టముఁ గాఁగ, నేను సం
గత స్వక నైపుణిన్, శతక గర్భకవిత్వముఁ జక్క వ్రాయ, వం
ద్యత యెసఁగెన్! వెసన్, హృదియ నర్తిలె నాకపు టింటఁ! గేశవా! 104

గర్భిత కందము:
సుకవీశులం దమర, గ
ర్భకవిత్వ ప్రియత్వ మేచ, వ్రాసితిఁ గొలఁదిన్;
స్వక నైపుణిన్, శతక గ
ర్భకవిత్వముఁ జక్క వ్రాయ, వంద్యత యెసఁగెన్! 104

గర్భిత తేటగీతి:
అమర, గర్భకవిత్వ ప్రియత్వ మేచఁ,
గవిత శ్రేష్ఠముఁ గ్లిష్టముఁ గాఁగ, నేను
శతక గర్భకవిత్వముఁ జక్క వ్రాయ,
హృదియ నర్తిలె నాకపు టింటఁ! గేశ! 104



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నూటమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటమూఁడవ పద్యము:

చంపకమాల:
స్వభు! నవ విగ్రహం బొనర జాంబవుఁ డుంపఁగ, నొంటిమిట్టపై
విభవముతోఁ గడుం గృపను వెల్గెడు రాఘవ! శ్రేష్ఠ! శార్ఙ్గి స
న్నిభ! రవినేత్ర! నీ వొనర నింపవె మోదము నో కుజేశ! ప్రా
క్ప్రభ లిడవే! వెసం బ్రజలు రంజిలఁ గావవె! రామ! కేశవా! 103

గర్భిత కందము:
నవ విగ్రహం బొనర జాం
బవుఁ డుంపఁగ, నొంటిమిట్టపై విభవముతో,
రవినేత్ర! నీ వొనర నిం
పవె మోదము నో కుజేశ! ప్రాక్ప్రభ లిడవే! 103

గర్భిత తేటగీతి:
ఒనర జాంబవుఁ డుంపఁగ, నొంటిమిట్టఁ
గృపను వెల్గెడు రాఘవ! శ్రేష్ఠ! శార్ఙ్గి!
యొనర నింపవె మోదము నో కుజేశ!
ప్రజలు రంజిలఁ గావవె! రామ! కేశ! 103



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నూటరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటరెండవ పద్యము:

చంపకమాల:
శ్రమ నకలంకుఁడై పరఁగ రత్నకుఁ డూను తపః ప్రదీప్త నా
గము పయినన్ మము న్నెపుడుఁ గాచెడు రత్నగిరీశ! దేవ! శ్రే
యము వికసింప, నే విసుగు నందక, యన్నవరేశ! సత్య! నా
ణ్యము లిడెదే! హరీ! దయల నందఁగఁ జేసెదె! తార్క్ష్య! కేశవా! 102

గర్భిత కందము:
అకలంకుఁడై పరఁగ ర
త్నకుఁ డూను తపః ప్రదీప్త నాగము పయినన్
వికసింప, నే విసుగు నం
దక, యన్నవరేశ! సత్య! నాణ్యము లిడెదే! 102

గర్భిత తేటగీతి:
పరఁగ రత్నకుఁ డూను తపః ప్రదీప్త!
యెపుడుఁ గాచెడు రత్నగిరీశ! దేవ!
విసుగు నందక, యన్నవరేశ! సత్య!
దయల నందఁగఁ జేసెదె! తార్క్ష్య! కేశ! 102



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నూటయొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటయొకటవ పద్యము:

చంపకమాల:
అల ముని సాకుచేఁ, దిరుమలాద్రినిఁ జేరియు దేవ! నీవు తి
ప్పలఁబడియుం, గడుం బ్రియతఁ బద్మవతిం గని, పెండ్లియాడి, యూ
హలఁ గని, భార్యలం గ్రమత నక్కునఁ జేర్చియు, ఱాయివైతె, కో
ర్కుల నిడితే! హరీ! జనుల మ్రొక్కుల నందితె! శౌరి! కేశవా! 101

గర్భిత కందము:
ముని సాకుచేఁ, దిరుమలా
ద్రినిఁ జేరియు దేవ! నీవు తిప్పలఁబడియుం
గని భార్యలం, గ్రమత న
క్కునఁ జేర్చియు, ఱాయివైతె, కోర్కుల నిడితే! 101

గర్భిత తేటగీతి:
తిరుమలాద్రినిఁ జేరియు దేవ! నీవు
ప్రియతఁ బద్మవతిం గని, పెండ్లియాడి,
క్రమత నక్కునఁ జేర్చియు, ఱాయివైతె!
జనుల మ్రొక్కుల నందితె! శౌరి! కేశ! 101



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, ఆగస్టు 05, 2021

నూఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూఱవ పద్యము:

చంపకమాల:
త్వర, ఘన! రాఘవా! మిగులఁ దప్తుని భద్రుని మెచ్చి, నీవు, భూ
ధరము పయిం గడుం దొడరి, దారయుఁ దమ్ముఁడు తోడనుండ, స్వం
కుర ఘన భక్తితో గుడిని గోపన గట్టఁగఁ, గూర్మి నుంటె, ప్ర
స్ఫుర కృపతోన్, వెసం బ్రజలఁ బ్రోచుచు, నో రఘురామ! కేశవా! 100

గర్భిత కందము:
ఘన! రాఘవా! మిగులఁ ద
ప్తుని భద్రుని మెచ్చి, నీవు, భూధరము పయిన్
ఘన భక్తితో గుడిని గో
పన గట్టఁగఁ, గూర్మి నుంటె, ప్రస్ఫుర కృపతోన్! 100

గర్భిత తేటగీతి:
మిగులఁ దప్తుని భద్రుని మెచ్చి, నీవుఁ
దొడరి, దారయుఁ దమ్ముఁడు తోడనుండ,
గుడిని గోపన గట్టఁగఁ, గూర్మి నుంటె,
ప్రజలఁ బ్రోచుచు, నో రఘురామ! కేశ! 100



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

తొంబదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

తొంబదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
అల సుమనోజ్ఞమై, పరఁగ యాదమహర్షి తపాన, వెల్గు తా
వలముగనౌ స్థలిన్, శ్రిత శుభప్రద యాదగిరిన్, వసించి కొ
ల్పుల సుమవేదిపై, నరులఁ బ్రోచు మధుద్విష! నారసింహ! శో
భిలఁ గనుమా! హరీ! వెసనుఁ బ్రేల్చుమ దుష్కృతి! విష్ణు! కేశవా! 99

గర్భిత కందము:
సుమనోజ్ఞమై, పరఁగ యా
దమహర్షి తపాన వెల్గు తావలముగనౌ
సుమవేదిపై, నరులఁ బ్రో
చు మధుద్విష! నారసింహ! శోభిలఁ గనుమా! 99

గర్భిత తేటగీతి:
పరఁగ యాదమహర్షి తపాన వెల్గు,
శ్రిత శుభప్రద యాదగిరిన్ వసించి,
నరులఁ బ్రోచు మధుద్విష! నారసింహ!
వెసనుఁ బ్రేల్చుమ దుష్కృతి! విష్ణు! కేశ! 99



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, ఆగస్టు 03, 2021

తొంబదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
వర! సుమనోహరా! గుఱిని వస్త్రములన్ విడి, గోపికాళి, స
త్వర మునుఁగన్, వెసన్ మునిఁగి, స్త్నానము సేయఁగఁ, బోయి నీవు, శ్రీ
శ్వర! గమనించియున్, వశల వస్త్రములం గొని, వారు మ్రొక్క, స
త్వర మిడితే! హరీ! త్వరగ వారలఁ దేర్చితె! వ్యక్త! కేశవా! 98

గర్భిత కందము:
సుమనోహరా! గుఱిని వ
స్త్రములన్ విడి, గోపికాళి, సత్వర మునుఁగన్,
గమనించియున్, వశల వ
స్త్రములం గొని, వారు మ్రొక్క, సత్వర మిడితే! 98

గర్భిత తేటగీతి:
గుఱిని వస్త్రములన్ విడి, గోపికాళి,
మునిఁగి, స్త్నానము సేయఁగఁ, బోయి నీవు,
వశల వస్త్రములం గొని, వారు మ్రొక్క,
త్వరగ వారలఁ దేర్చితె! వ్యక్త! కేశ! 98



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

తొంబదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదియేడవ పద్యము:

చంపకమాల:
చని, వన మందునం దొడరి, శప్తుని భీమరథుం బలాదు వ్యో
మునిఁ గనియున్, హరీ! కొసరి, గోపుల దాఁచఁగ, గుర్తెఱింగి, చే
తనుఁ గొని కాళ్ళనుం, బరఁగ దబ్బునఁ ద్రిప్పియు, బండఁ గొట్టి, బ్రుం
గ నడఁచితే! వనిన్ సరగఁ గాచితె గోపుల శౌరి! కేశవా! 97

గర్భిత కందము:
వన మందునం దొడరి, శ
ప్తుని భీమరథుం బలాదు వ్యోమునిఁ గనియుం,
గొని కాళ్ళనుం, బరఁగ ద
బ్బునఁ ద్రిప్పియు, బండఁ గొట్టి, బ్రుంగ నడఁచితే! 97

గర్భిత తేటగీతి:
తొడరి, శప్తుని భీమరథుం బలాదుఁ
గొసరి, గోపుల దాఁచఁగ, గుర్తెఱింగి,
పరఁగ దబ్బునఁ ద్రిప్పియు, బండఁ గొట్టి,
సరగఁ గాచితె గోపుల శౌరి! కేశ! 97



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

తొంబదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదియాఱవ పద్యము:

చంపకమాల:
ఘన! భవనాశకా! యమర, ఖాండవ మేర్చఁగ నగ్ని వేఁడ, న
ప్ప నతిఘ మీన్, వెసం బుడికి పార్థుఁడు నీవునుఁ బోటుముట్ల, దీ
క్షను, నవ శక్తిమైఁ గదలి, గాండివి కాల్పఁగ ఖాండవమ్ము, ఠీ
వినిఁ గనవే! హరీ! యిడవె వేగమె సాయము నీశ! కేశవా! 96

గర్భిత కందము:
భవనాశకా! యమర, ఖాం
డవ మేర్చఁగ నగ్ని వేఁడ, నప్ప నతిఘ మీన్,
నవ శక్తిమైఁ గదలి, గాం
డివి కాల్పఁగ ఖాండవమ్ము, ఠీవినిఁ గనవే! 96

గర్భిత తేటగీతి:
అమర, ఖాండవ మేర్చఁగ నగ్ని వేఁడఁ,
బుడికి పార్థుఁడు నీవునుఁ బోటుముట్లఁ,
గదలి, గాండివి కాల్పఁగ ఖాండవమ్ము,
నిడవె వేగమె సాయము నీశ! కేశ! 96



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

సోమవారం, ఆగస్టు 02, 2021

తొంబదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదియైదవ పద్యము:

చంపకమాల:
తత ఘన! గోదయే తలనుఁ దాల్చిన మాలను దైవపూజఁ జే
ర్చి, తనరఁగా, వెసం గనియు, జియ్యయె తప్పనఁ; "గ్రమ్మఱంగఁ ద
ద్వ్రత, తనుఁ దాల్చి, నా కిడిన దండనె తాల్చెద నే" నటంచుఁ, దా
ల్చితె సతమున్! హరీ! రమణి చిత్తముఁ దేర్చితె శ్లాఘ్య! కేశవా! 95

గర్భిత కందము:
ఘన! గోదయే తలనుఁ దా
ల్చిన మాలను దైవపూజఁ జేర్చి, తనరఁగాఁ,
"దనుఁ దాల్చి, నా కిడిన దం
డనె తాల్చెద నే" నటంచుఁ, దాల్చితె సతమున్! 95

గర్భిత తేటగీతి:
తలనుఁ దాల్చిన మాలను దైవపూజఁ
గనియు, జియ్యయె తప్పనఁ; "గ్రమ్మఱంగ
నిడిన దండనె తాల్చెద నే" నటంచుఁ,
రమణి చిత్తముఁ దేర్చితె శ్లాఘ్య! కేశ! 95



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

తొంబదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
అన, విను శ్రీవరా! గిరిధరా! కన, నాయమ కృష్ణ మీర! క
న్గొని, నిను వే కడుం దనివి, గోపిక రీతినిఁ దాన యెంచి, పా
వన మన మూన్చెఁ! దన్మధుర భక్తినిఁ బాడిన మాన్య కిత్తె ధీ
యు, నభవమున్, భువిన్ బుధ నియోగ్య మహత్కృతిఁ బూజ్య! కేశవా! 94

గర్భిత కందము:
విను శ్రీవరా! గిరిధరా!
కన, నాయమ కృష్ణ మీర! కన్గొని నిను, వే
మన మూన్చెఁ! దన్మధుర భ
క్తినిఁ బాడిన మాన్య కిత్తె ధీయు, నభవమున్! 94

గర్భిత తేటగీతి:
గిరిధరా! కన, నాయమ కృష్ణ మీర!
తనివి, గోపిక రీతినిఁ దాన యెంచి,
మధుర భక్తినిఁ బాడిన మాన్య కిత్తె
బుధ నియోగ్య మహత్కృతిఁ బూజ్య! కేశ! 94



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, ఆగస్టు 01, 2021

తొంబదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదిమూఁడవ పద్యము:

చంపకమాల:
కన, వనమాలి! నీ వలరఁ, గ్రక్కన నీ కృతు లన్నమయ్య క
మ్ర నుతులతో, హరీ! యెసఁగ వ్రాసియు, నంకిత మిచ్చి నీకు గొ
బ్బున ఘనమోదముం జెలఁగి పూన్చిన, మెచ్చితె! శ్రీనివాస! చి
ద్వన మిడితే, భువిన్ స్థిర విభాసిత కీర్తులఁ దేర్చి, కేశవా! 93

గర్భిత కందము:
వనమాలి! నీ వలరఁ, గ్ర
క్కన నీ కృతు లన్నమయ్య కమ్ర నుతులతో,
ఘనమోదముం జెలఁగి పూ
న్చిన, మెచ్చితె! శ్రీనివాస! చిద్వన మిడితే! 93

గర్భిత తేటగీతి:
అలరఁ, గ్రక్కన నీ కృతు లన్నమయ్య
యెసఁగ వ్రాసియు, నంకిత మిచ్చి నీకుఁ
జెలఁగి పూన్చిన, మెచ్చితె! శ్రీనివాస!
స్థిర విభాసిత కీర్తులఁ దేర్చి, కేశ! 93



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు