Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 26, 2015

ఆహ్వానం!





ఈ శతావధానములో నిషిద్ధాక్షరి మరియు సమస్యా పూరణములు 

నిర్వహించుట కొరకు సమర్థవంతమైన పృచ్ఛకులు కావాలి.

పాల్గొను పృచ్ఛకులందరికి జనవరి 6,7,8,9, 2016, నాలుగు రోజులు 

ఉచిత భోజన వసతులు కల్పించ బడుతాయి. 

విరములకు

డా || నలవోలు నరసింహా రెడ్డి 

9848898515, 9133072535.






శనివారం, డిసెంబర్ 19, 2015

సమస్య: నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

తేది: సెప్టెంబర్ 25, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




నెలఁతల సఖ్యత కొఱకయి
లలనా మండలి నొకండు లలి నడుపం దాన్
బొలుపార నగుచుఁ బడఁతులు
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

గురువారం, డిసెంబర్ 17, 2015

సమస్య: భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!

తేది: సెప్టెంబర్ 13, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(శంకరుఁడు భీమాసురునిఁ జంపిన కథ నిట ననుసంధానించుకొనునది)




ఆ సుదక్షిణ దంపతు లార్తితోడ
హరునిఁ బూజింప, భీముండు నపహసించి,
"ఱాయి కాచునే" యని, కత్తి వ్రేయఁ, ద్రిపుర
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!



సోమవారం, డిసెంబర్ 14, 2015

సమస్య: ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!

తేది: సెప్టెంబర్ 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





దానవుండయ్యు ప్రహ్లాదుఁ డనవరతము
హరిని మనమునఁ దలఁచుచు, నర్భకులకుఁ
బరఁగ హరిభక్తిఁ గలిగించె! భక్తిచేత
ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!!



శనివారం, డిసెంబర్ 12, 2015

సమస్య: అన్నదానమ్ము సేయువా రధము లిలను!

తేది: సెప్టెంబర్ 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




తనకు మున్నుఁ బుట్టినవాఁడు తన కెవరగు?
క్షేమమునుఁ గూర్పఁ గర్ణుండు నేమి సేయు?
హితముఁ గొని, కీడుఁ జేయువా రెవ్వ రుర్వి?
నన్న, దానమ్ము సేయు, వా రధము లిలను!


సోమవారం, డిసెంబర్ 07, 2015

సమస్య: కోడలా నాదు పతి నీకుఁ గొడుకు గాదె!

తేది: సెప్టెంబర్ 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(సాగరునకు భార్యయైన గంగకుఁ జంద్రుఁడు, శివుఁడు నిద్దఱునుం గొడుకు వరుస యౌదురు. విష్ణు పాదోద్భవయైన గంగ పార్వతికిం గోడలు వరుస కావలెను. ఈ వరుసల ననుసరించి పార్వతి గంగతోఁ జమత్కరించు సందర్భము)



"సాగరున కీవు వలచిన సతివి; మఱియుఁ
జంద్రుఁడే నాకు మఱఁది; యా శంకరునకు
నతఁడు తమ్ముఁడు; విష్ణువౌ నన్న నాకుఁ;
గోడలా! నాదు పతి నీకుఁ గొడుకు గాదె!!"



శనివారం, డిసెంబర్ 05, 2015

సమస్య: రాములందు గొప్ప రాముఁ డతఁడు!

తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు




నా మొదటి పూరణము:



ఒక సతి యొక మాట యొక బాణ నినదుఁడై
యుండుఁ గాని యొండు నువిదఁ గనఁడు;
రమణిఁ జెఱనుఁ బెట్టు రావణా దీంద్రియా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!



***      ***      ***




నా రెండవ పూరణము:



పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
మాతృహంత క్షాత్రమార్గోత్సృజులగు నా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

(ఈ పై పూరణలో అన్వయం బాగా లేనందున, దశరథరాముని ప్రస్తావన లేనందున...
దానిని ఈ క్రింది విధంగా సవరిస్తున్నాను)



సవరించిన పూరణము:
పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!



బుధవారం, డిసెంబర్ 02, 2015

దత్తపద్యారంభము: "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..."

తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తపద్యారంభము "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..." నను వాక్యమునకు నేను చేసిన పూరణము





మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ మన్మథార్తయై
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!