Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 19, 2019

చెలివా? చెల్లివా? తల్లివా? వరుసకు నీవు నా కేమవుతావు?

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (19-07-2019) సమస్య:
చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో?"

నా పూరణము:

[నా కలలో వాణీ దేవిని స్తుతిస్తూ నేను ఆ తల్లిని కోరిన విధము]

"తొలుత న్నే నిఁక దేహ బంధనములే తొల్గంగ నీ చెంతకున్
వెలుఁగుల్వొందఁగ వత్తునమ్మ జననీ! వేదాగ్రణీ! వాఙ్మణీ!
యిల బంధుత్వము లేని నాకు నగుదో హే వాణి! యమ్మమ్మవో?
చెలివో? చెల్లివొ? తల్లివో? వదినవో? జేజమ్మవో? యత్తవో?"

స్వస్తి


శనివారం, జులై 06, 2019

పాపియే సన్మానమును బొందినాఁడు...


శంకరాభరణంలో నేఁటి (06-07-2019) సమస్య:
నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

నా పూరణము:

[కౌశికుఁడను బ్రాహ్మణుఁడు దుర్వ్యసనుఁడై, పాపియై, వేశ్యాలోలతచేఁ బొందిన గుష్ఠురోగముచేఁ గుములుచుండియు, మఱొక వేశ్యాగృహమునకుం గొంపొమ్మని యాజ్ఞనిడి, పతివ్రతా మతల్లియైన యాతని భార్యచే నటులనే కొనిపోఁబడుచు, నటవీమార్గమునఁ గల యొక చెట్టుపైఁ దలక్రిందులుగాఁ దపస్సుచేసికొనుచున్న మాండవ్యునకుఁ గాలు తగిలి, సూర్యోదయకాంతి సోఁకి మరణించునటుల శాపముం బొందెను. అపు డా పతివ్రతా శిరోమణి పతిప్రాణములు పోకుండుటకై సూర్యోదయము నాఁపఁగా, తల్లడిల్లిన దేవతలు నలువ సూచనచే ననసూయాదేవిని శరణువేడఁగా, నామె కౌశికునిఁ బునర్జీవితునిఁ జేయునట్లు వరము నిడఁగా, నా పతివ్రత సూర్యోదయముం గావించెను. సూర్యకిరణములు సోఁకి కౌశికుఁడు మరణింపఁగా, ననసూయాదేవి తన పాతివ్రత్య మహిమచే నాతనిం బునర్జీవితుఁ జేయఁగా, నతఁడు భార్యాయుతుఁడై చని, సద్వ్రతుఁడై సర్వుల మెప్పులను వడసిన కథ నిట ననుసంధానించుకొనునది]


భయమున్ భక్తియు లేని కౌశికుఁడు స్త్రీ వ్యామోహియై, కుష్ఠురో
గియునయ్యున్, ఘనమౌనిశాపతపుఁడై, ఖేదార్తుఁడైయుండ; భా
ర్యయె భర్తృవ్రతదీక్షఁ గొన్న మహిమన్ రక్షించియుం దేల్చ; నా
నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్!


స్వస్తి


శుక్రవారం, జులై 05, 2019

ఈ పూరణము వాణీబ్రహ్మలకును సాధ్యముకాదు!

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (05-07-2019) సమస్య:
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

నా పూరణము:
[రంధ్రయుక్తమైన ఘటమున నీర పూరణము సేయుట వాణీ బ్రహ్మలకుఁ గూడ నసాధ్యమే యనుట]

చేరఁగఁబోయి చక్కనగు చిన్నఘటమ్ములయందు రమ్యమై
తీరుగ నున్న భాండమునుఁ దెచ్చి తధోముఖరంధ్రయుక్త! నే
నీరము నింపఁ జూడఁగను, నిల్వక కాఱుచునుండె! నందులోఁ
బూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే?


స్వస్తి



బుధవారం, జులై 03, 2019

పర్వతాలు సముద్రంలో గునగున నడిచాయి...

Image

శంకరాభరణంలో నేఁటి (03-07-2019) సమస్య:
నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

నా పూరణము:
[పూర్వము పర్వతములకు ఱెక్కలుండెడివి. అవి స్వపక్షగర్వమునఁ జెలరేఁగి యాకాశగమనము చేయుచుండఁగాఁ, బ్రాణులకు మిక్కిలి భయము గలుగుచుండెను. అది కనిన యింద్రుఁడు, వాని గర్వము ఖర్వము జేయఁదలఁచి, వాని ఱెక్కలన్నింటిని తన వజ్రాయుధమున ఖండించెను. ఖండితపక్షములైన నగములు సముద్రమునఁ బడి కొట్టుకొనిపోవుచుండుట ప్రస్తుత సందర్భము]

నెగడెడు పక్ష గర్వమున నింగిని రేఁగుచు నేలతాల్పులే
యెగురుచు నుండ, వజ్రి గని, హేయ విహారనగప్రశస్త ప
క్షగణ విఖండితోగ్రకులిశవ్రతుఁడయ్యెను! వేగ గూలి యా
నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్!

స్వస్తి



మంగళవారం, జులై 02, 2019

నాస్తికుఁడు ఆస్తికుఁడైన విధము...

hd image of a hindu sage కోసం చిత్ర ఫలితం

శంకరాభరణంలో నేఁటి (02-07-2019) సమస్య:
చార్వాకుండను మౌని యాస్తికుఁడుగా సద్భక్తుఁడై యొప్పెఁ బో

నా పూరణము:
[చార్వాకదర్శన మను నాస్తికదర్శనకర్తయైన చార్వాకుఁ డొకనాఁడు నా కలలోఁ గనిపించి, యెందులకో తన నాస్తిక దర్శనముపై రోతపుట్టి కాల్చివేసి దుర్వాసునిఁ జేరి వేదముల నభ్యసించి తన దుఃఖము నశించునట్టు లాస్తికుఁడుగా మారి సద్భక్తుఁడై విలసిల్లినాఁడు]

దుర్వారంబగు స్వప్నమందు నొకటన్ దోరంబుగాఁ గంటి నేఁ;
జార్వాకుం డెటొ రోసి, నాస్తికపునౌ సద్దర్శనం బేర్చి, వే
దుర్వాసున్ దరిజేరి, నేర్చె శ్రుతులన్, దుఃఖంబు వోవన్ గటా!
చార్వాకుండను మౌని యాస్తికుఁడుగా సద్భక్తుఁడై యొప్పెఁ బో!!

స్వస్తి



సోమవారం, జులై 01, 2019

శివస్తుతిలో విష్ణు నామములు...

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (01-07-2019) దత్తపది:
హరి-మాధవ-కేశవ-అచ్యుత...పదాలను అన్యార్థంలో...శివస్తుతి...నచ్చిన ఛందస్సులో...


శ్రీగళ! శివ! పరీణాహ! రిపువినాశ!
పురహ! రోమాధవ! గిరీశ! భూతనాథ!
వ్యోమకేశ! వర్ధన! శంభు! కామహంత!
లేలిహా! సాచ్యుతశరీర! ఫాలనయన!

స్వస్తి