Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 10, 2020

జగద్గురు శంకరాచార్యులు


Sri Adi Shankara | Discography | Discogs

చం.
మునుకొని యాదిశంకరులు ముప్పదిరెండగు వత్సరాలు భూ
మిని మనియుండి, జీవుఁ డిల మెచ్చెడి జ్ఞానము నాత్మబోధ రూ
పున నొసఁగెన్, బ్రపంచమున మోహముఁ ద్రుంచెడి శ్లోక రూప లో
చనము సహస్ర వత్సర ప్రశస్తతఁ గూర్చుచు నిల్చియుండఁగన్! 1

సీ.
ఒకవైపు బౌద్ధ, మింకొకవైపు శైవ వై
        ష్ణవములు తమ గొప్పఁ జాటుచుండఁ;
గులమత సహనమ్ముఁ గూర్పంగ జనియించె
        నాదిశంకరుఁడు జనాళి కొఱకు;
ఘన కేరళములోని కాలడి గ్రామానఁ
        గడపె బాల్యమ్ము విజ్ఞాన ఖనిగ;
నాసేతు శీతాచలాంతమ్మువెలుఁగొంద,
        ముమ్మారు నడయాడి, బోధల నిడె;
గీ.
శైవ వైష్ణవ శాక్తేయ భావజాల
మంత మొందించి, మతముల కన్నిటికినిఁ
బఱఁగ నేకత్వ మందించి, ప్రాంత దూష
ణలనుఁ జేయుట వృథయని నచ్చఁజెప్పె! 2

కం.
దుష్టాచారముఁ బోవిడి,
శిష్టాచారమ్ముఁ గొనియుఁ, జిత్కైవల్య
మ్మిష్టమ్మునఁ దఱిఁ జేర్చియుఁ,
గష్టమ్ములఁ దాల్చె శివునిగా శంకరుఁడే! 3

తే.గీ.
స్మార్త, శ్రౌత క్రియలకుఁ బ్రశస్తత నిడ,
వైదికాధ్వసక్రమవైభవమును నిలుప,
నీలలోహితుఁడే యిలన్ నెగడె నిటుల
శంకరుని రూపమునఁ బ్రజల్ సన్నుతింప! 4

కం.
సుజ్ఞానయోగతత్త్వవి
ధిజ్ఞుఁడు శంకరుఁడు శాస్త్ర ధీయుతుఁడై సం
ప్రజ్ఞానవిదితుఁడై త
త్ప్రజ్ఞ విభాసిలఁగఁ దిరిగె భరతోర్వరపై! 5

శా.
మత్యాశ్రిత్యుఁడు శంకరుం డిల "నహం బ్రహ్మాఽస్మి" సిద్ధాంతమున్,
సత్యమ్మై పచరించు "తత్త్వమసి" ప్రజ్ఞానంపు సిద్ధాంతమున్
నిత్యమ్మున్ నిలువంగ నుర్విపయి, మన్నింపంగ సద్విద్యలన్
స్తుత్యమ్మౌ స్థిర చిత్త విత్త మొసఁగెన్ సూక్ష్మంపు సద్జ్ఞానియై! 6

తే.గీ.
"తనదు హృదినున్న దైవంపు దర్శనమునఁ
దగఁ దరించి, యెదిరిలోని దైవదర్శ
నానఁ దాఁ దరియించుటే జ్ఞాన"
మనియుఁ
దెలిపి, జనములఁ దనవైపుఁ ద్రిప్పికొనెను! 7

తే.గీ.
"శివుఁడె విష్ణువు, విష్ణువే శివుఁ" డటంచు,
సకల దేవత లొకటను జ్ఞానసహిత
సత్ప్రబోధాన, దైవత్వ సత్త్వమెఱుఁగఁ
జేసి, యజ్ఞానమునుఁ ద్రోలి, చేతనమును
మనుజులందునఁ గలిగించి, మనసు గెలిచె! 8

ఆ.వె.
"పూజకన్న భక్తి పొసఁగఁ బ్రధాన"మ్మ
టంచుఁ జెప్పి, "యిష్టమైన దైవ
పూజ సేయ, మిగులఁ బొలిచి యనుగ్రహ
మిచ్చు దైవ"
మనుచు హితముఁ దెలిపె! 9

మ.
వడిగా శంకరుఁడంతఁ దా నుపనిషద్భాష్యమ్ము లందించె; సం
దడిగాఁ బ్రార్థనఁ జేయ వ్రాసెఁ బ్రజకై తా దేవతాస్తోత్రముల్;
పడ నోడించె విమూఢ పండితులఁ దా వాదించి వాక్చాతురిన్;
దడవెం బ్రస్ఫుట ధర్మమార్గ హిత మద్వైతమ్ము హిందుత్వమున్! 10

తే.గీ.
చూడఁగాఁ బండితులను శిష్యులుగఁ జేసి,
పొసఁగ నిలను హిందూధర్మములను నిలిపి,
యొనర దేవళములఁ బునరుద్ధరించి,
పరఁగఁ బూజాదికముల నేర్పఱుపఁజేసె! 11

తే.గీ.
బ్రహ్మసూత్ర, విష్ణుసహస్ర భాష్యములఁ, గొ
ఱలి శివానంద, సౌందర్యలహరి వఱల,
వర వివేక చూడామణి, వాక్యసుధయు,
సాధనా పంచకమునుఁ, బ్రస్థాన త్రయము; 12

తే.గీ.
కనఁగ ఘన మనీషాపంచకమ్ము, గాంగ
స్తోత్రము, భజగోవిందము, సుజను లెపుడు
ముఱియ నుపదేశ సాహస్రి మొదలగునవి
శంకరాచార్య కృతులు నెసంగె భువిని! 13

ఉ.
చిన్నతనానఁ దండ్రి మృతిఁ జెందఁగఁ దల్లియ యార్యమాంబ తా
సన్నయమార్గగామిగనుఁ జక్క నొనర్చియు, వేదవిద్యలన్
గ్రన్నన నేర్వఁజేసి, యొనరంగను నిత్యము బ్రహ్మచారినిన్
మన్ననతోడ భిక్షకయి మాన్య గృహమ్ముల కంపెఁ బ్రేమతో! 14

మ.
అనయమ్ముం దిరిపెమ్ము నెత్తు, చొక యిల్లాలింట భిక్షింపఁ, దా
ననుకంపన్ దగ ముష్టిగా నుసిరికాయన్ దాన మీ నా యుదా
రను దారిద్ర్యకృతార్తి పోన్ గనకధారాస్తోత్రముం జెప్పఁగా,
విని యా స్తోత్రముఁ, బుల్కరించి రమయే, భృంగారు మాకందులన్
గొన వర్షించెను సంతసిల్లఁ గొమకుం గోర్కెల్ దగం దీరఁగన్! 15

తే.గీ.
ఒక్క నాఁడార్యమాంబయె యొక్క నదిని
నీరు తేఁబోయి, స్పృహఁదప్పి నేలఁబడఁగ,
శంకరుఁడు నదిం బ్రార్థించి, జలము లిడఁగ,
నదినె రప్పించి, జనుల కానందము నిడె! 16

మత్తకోకిల:
సన్యసింపఁగఁ బోవునప్పుడు సమ్మతింపక శంకరున్
మాన్య యాపెను; స్నాని కాన్ నదిమధ్య మున్గఁగ నక్రమే
ధన్యు శంకరుఁ బట్టఁ, జచ్చెడి తన్ను సన్యసమందఁగన్
మాన్యఁ గోరఁగ, సమ్మతించెను; మంత్రముం బఠియింపఁ గా
ఠిన్య నక్రము వీడెఁ, దల్లికి డెందమందు ముదమ్ము కాన్! 17

చం.
ఒక దినమందునం బవలు నొంటిగ మజ్జనమాడఁబోవఁగా
నొక శ్వపచుండు వచ్చె సదయుం డొక నాలుఁగు జాగిలాలతోఁ,
బ్రకటముగాఁగ నడ్డుపడు వానినిఁ దప్పుకొనంగఁ గోరఁగా,
నిఁక ననె నా శ్వపాకుఁడు సుదృంహితమైన స్వరమ్ము పెంపునన్! 18

చం.
"సకలపు మూల మన్నమున సంభవ మందిన మేను విప్రునం
దొకటె, కటోలునం దొకటె! యొక్కటఁ దప్పుకొనంగ నెద్ది? యీ
ప్రకటితమౌ శరీరమె? సురక్షణ మందెడి యాత్మయే? సఖా!
యిఁక వచియింపుమయ్య! యిది యెట్టిదొ? ద్వంద్వమొ, కాదొ? వేగమే!" 19

తే.గీ.
ఆతఁ డాడిన వచనమ్ము లాలకించి,
శంకరుం డంతరార్థమ్ము సకలము నిఁక
చక్క నెఱిఁగియు ’నీతండు శంకరుండె!
నన్ బరీక్షింప నేతెంచె!’ ననుచు నెఱఁగె! 20

ఆ.వె
ఇంక, శంకరుఁడు "మనీష పంచక"మను
నైదు స్తోత్రములను నపుడు సెప్పి,
"భాష్యకారవృత్తి బ్రహ్మసూత్రమ్ముల
కెనయఁ జేయుమ!
" యని, యెగసె దివికి! 21

కం.
విద్వత్సంస్థితుఁడయ్యును,
నద్వైతమతమ్మె బహువిహారము సేయన్,
సద్వైభవ మిల నిలుపన్,
సద్విద్యాధ్యాత్మబోధ శంకరుఁ డిడియెన్! 22

తే.గీ.
ఆ జగద్గురువునకు నే నంజలించి,
యాతఁ డందించినట్టి శాస్త్రార్థములను
లోకులందఱుఁ దెలిసి, సుశ్లోకులగుచు,
వెలిఁగిపోవఁగఁ గోరెదఁ బ్రీతితోడ! 23

స్వస్తి




శనివారం, మే 09, 2020

ప్రబంధ పరమేశ్వరుఁడు ఎఱ్ఱన

57 [FREE] QUOTES INSPIRATIONAL IN TELUGU WALLPAPER HD DOWNLOAD JPG ...

మ.
నవనీతాంచిత మానసుండు, సుజనుం డౌ శంభుదాసుండు, శ్రీ
శివపాదాంబుజసక్తచిత్తయుతసంసేవాప్రశస్త్యభ్యసో
ద్భవ కైవారవిశేష పాఠనుఁడు, శుంభద్గ్రంథ సల్లేఖనా
సువిచారుం డయెఁ దాఁ బ్రబంధ పరమేశుం డెఱ్ఱనార్యుండిలన్!

ఆ.వె.
శివుని భక్తుఁడయ్యుఁ, జిత్తమ్మునందున
రామవిభుని గాథ వ్రాయఁ దలఁచి,
ప్రథమ కృతిగఁ దాను రామాయణమ్మును
బ్రచురపఱచె భువిని రమ్యముగను!

ఉ.
భాగవతప్రశస్తిఁ బ్రజఁ బావన మానస వీథులన్ బ్రశం
సాగత రీతి నిల్పఁగను, స్వాగతముం దెలుపంగఁ బూనియున్,
వాగధిదేవతాప్తి హరివంశ సుకావ్య సయుగ్మ భాగ స
ర్వాగమ దీప్తులుం గుఱియ వ్రాసెను సత్కవిలోక మెన్నఁగన్!

తే.గీ.
హరిహరాద్వైత భావ సంయమివరుండు,
పండితుఁడు, గురుభక్తితత్పరుఁడు, వినయ
సంభరితుఁడు, సద్ధృదయుండు, సంతరించెఁ
బఱఁగ భారతారణ్యపర్వావశిష్ట
మెలమి నన్నయ్య తిక్కన్న నిల నుతించి!

తే.గీ.
నన్నయ కృతినిఁ జదివి, యెఱ్ఱన్నఁ జదువ,
నదియ నన్నయ వ్రాఁతయౌ ననియ తోఁచుఁ;
దిక్కన కృతిఁ బఠించి, యిద్దియ పఠింప,
నదియుఁ దిక్కన వ్రాఁతయౌ ననియుఁ దోఁచు!

కం.
గంగా యమునా సములె య
నంగను నన్నయయుఁ దిక్కనార్యుల నడుమన్
సంగమ రూపము నెఱ్ఱన
యుం గొనెను సరస్వతీ ప్రయుక్త నదమ్మై!

ఉ.
స్థిత్యునిఁ దా నహోబిలనృసింహునిఁ గొల్చుచు, నిష్టదైవమౌ
సత్యుఁడు సుందరుండు శివసన్నిభుఁడైన నృసింహ రూపునిన్,
బ్రత్యహపాఠనమ్మునకు బాటలు వేయఁగ, భక్తితోడ, నౌ
చిత్యముతోడ వ్రాసెను నృసింహపురాణ విశిష్టకావ్యమున్!

తే.గీ.
ఎఱ్ఱనార్యుఁ డెంతయు సౌమ్య హితవరుండొ,
యెఱ్ఱనార్యు కవిత సౌమ్య హితవరియయి,
విశ్వవిఖ్యాత మాధుర్య వీక్షితయయి,
హృద్యసుమనోహరమ్మయి ప్రీతినిడును!

తే.గీ.
ధన్య పుణ్యకథాప్రబంధంపు రీతి
మనుచు, పౌరాణికపు దివ్యమార్గమునను
నడచి, కావ్యంపు యశమంది, నవ్యమైన
భావనలనందఁజేయు సవ్యమ్ముగాను!

కం.
ఓ యెఱ్ఱన! నిను మదినిడి
ధీయుతులై మనిరి కావ్యధీమంతు లిలన్!
మాయురె! కవితావైభవ
మే యిల నిలిచెనుర! నీ కమిత వందనముల్!

స్వస్తి