Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 30, 2019

కలువలదొర అలుకతో తమ్మిదొరను మ్రింగాడు...

hd image of Lord Shiva who does penance with Parvati కోసం చిత్ర ఫలితం
శంకరాభరణంలో నేఁటి (30-06-2019) సమస్య:
కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై

నా పూరణము:

(శివపార్వతులను సతీపతులఁ జేయుటకై సుమబాణములఁ బ్రయోగించిన మన్మథుని శివుఁడు భస్మ మొనర్చిన సమయానఁ బార్వతి తనకు శివుఁ డెట్టులఁ గనిపించెనో తండ్రి హిమవంతునకుఁ దెలుపు సందర్భము)

"వలిమలచూలి నన్ బడరుఁ బన్నుగ నాలుమగండ్రఁ జేయఁగాఁ
దలఁపులచూలు వేయ నటఁ దా ననతూఁపులఁ, గోడెరౌతు తా
నలుకను నగ్గికంటఁ గనె! నత్తఱి నా కనిపించెఁ దండ్రి! యా
కలువల సంగడీఁ డెసఁగి, కాఁకవెలుంగును మ్రింగె నల్కమై!!"

[వలిమలచూలు=పార్వతి; బడరుఁడు=శివుఁడు; తలఁపులచూలు=మన్మథుఁడు; ననతూఁపులు=పుష్పబాణములు; కోడెరౌతు=శివుఁడు; కలువల సంగడీఁడు=చంద్రుఁడు; కాఁకవెలుంగు=సూర్యుఁడు; అల్కమై=కోపముతో]

స్వస్తి


చంద్రుఁడు కోపమున సూర్యుని మ్రింగినాఁడు...

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, నృత్యం


శంకరాభరణంలో నేఁటి (29-06-2019) సమస్య:

కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమైనా పూరణము(అౘ్చతెనుఁగున):[సముద్రమును దాఁటి లంకఁ బ్రవేశించి, యా రావణుఁ జంపెద ననెడి యుత్సాహమున నెదుటఁ గాంచఁగా, నా సముద్ర మువ్వెత్తున నెగసి పడుచుండెను. దానినిఁ గనిన శ్రీరాముఁ డమితోగ్రుఁ డయ్యెను! అప్పు డా రామచంద్రునిఁ జూడఁగాఁ జల్లనివాఁడైన చంద్రుఁడు కోపమున వేవెలుఁగైన సూర్యుని మ్రింగినాఁడా యనునట్లుండెను...అనుట]చెలఁగియు నీటికుప్ప నిఁకఁ జెంగున దాఁటి, బిరాన బంతిమో
ములదొరఁ ౙంపె దంౘుఁ దన మోమున సంతసమొల్కఁ గాంౘ, నా
తలికె యదొక్కమా ఱొదరి దబ్బున లేవఁగ, వేగ దానిపైఁ
ౙలమునుఁ బూనె నత్తఱిని ౙన్నపుఁగాపరి! యెంచి ౘూడఁ, నా
కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై!!(నీటికుప్ప=సముద్రము; బంతిమోములదొర=రావణుఁడు; ఆతలికె=అప్పటికే; ఒదరి=విజృంభించి; ౙన్నపుఁగాపరి=శ్రీరాముఁడు; కలువల సంగడీఁడు=చంద్రుఁడు; కాఁకవెలుంగు=సూర్యుఁడు; అల్కమై=కోపముతో)స్వస్తి
శనివారం, జూన్ 29, 2019

మోసం చేసేవాళ్ళకే పుణ్యం దక్కుతుంది...

చిత్రంలోని అంశాలు: ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు

శంకరాభరణంలో నేఁటి (29-06-2019) సమస్య:
మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

నా పూరణము:
[శివవరగర్వమున శివునే భస్మము సేయఁబూనిన భస్మాసురుని, విష్ణువు మోహినీ రూపమునఁ దన యాటపాటలతో మురిపించి, భస్మము చేసి, నుతికెక్కినాఁడు! ఇటుల మోసముతో వరముఁగొనిన ప్రమాదకారినే మోసగించిన విష్ణువు వంటి వారలకే తత్పుణ్యఫలము దక్కును గదా! అనుట]

హాసవిలాసనర్తనల నాటలఁ బాటల ముంచి తేల్చి కా
దే సెలరేఁగు బూదిపొలదిండినిఁ గూల్చి పొగడ్త లందెఁ బ
ద్మాసనుతండ్రి మోహినిగఁ దాలిచి రూపము! మోసగాండ్రనే
మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్!!

స్వస్తి

శుక్రవారం, జూన్ 28, 2019

చోరులు హిత దాతలు!


శంకరాభరణంలో నేఁటి (28-06-2019) సమస్య:
ప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్

నా పూరణము:
[చోరులు పరుల విషయమున దుష్టులైనప్పటికిని, స్వీయాభివృద్ధి విషయమున హితైషులై యుందురనుట]

ప్రేప్సలఁ దేలుచున్, బ్రజకు వెక్కసమైన దురంతదుఃఖముల్
వీప్సనుఁ గూర్చుచున్, మదికిఁ బ్రేరణ నిచ్చెడి దుష్టకృత్య ప్రా
రిప్సకులై, సతమ్మమిత రేఫపుఁ జౌర్యపు వృత్తిఁ బూని, యా
త్మేప్సిత దాతలై, హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్!


(ప్రేప్స=ఊహ; వీప్స=ఒకటి వెనుక నొకటి వ్యాపింప నిచ్ఛ; ఆరిప్స=ఆరంభింపవలెననెడి కోరిక; రేఫము=హేయము)


స్వస్తి

గురువారం, జూన్ 27, 2019

కోరికలే ముక్తి కారకములు!శంకరాభరణంలో నేఁటి (27-06-2019) సమస్య:
జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

నా పూరణము:
[ఒక భక్తుఁడు తన దైవమునకుఁ జేయునట్టి నివేదనము]

"దేవా! నీ పద సేవఁ జేయు నరుతో దీవ్యత్సఖిత్వంబునున్;
నీవై చేసిన భూతజాలములపై నిర్వ్యాజ దాక్షిణ్యమున్;
భావాతీతవిశిష్టభక్తియుతమై వర్తిల్లు త్వత్పాదరా
జీవాకాంక్షలు, ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్!"


స్వస్తి

బుధవారం, జూన్ 26, 2019

అంబను పెండ్లాడిన భీష్ముఁడు!

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (26-06-2019) సమస్య:
అంబను బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్

నా పూరణము:

అంబరకేశుఁ డక్షరున కద్రిజ సేవలు సేయుచుండఁగా,
శంబరసూదనుండు సుమసాయకముం దగ వేసె! నప్డు కో
పంబున బూది సేసి, ఘనబంధపుఁ బేర్మిని సత్ప్రయత్నుఁడై
యంబను బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్!


[అంబ=పార్వతి; భీష్ముఁడు=శివుఁడు]స్వస్తి


మంగళవారం, జూన్ 25, 2019

చెఱసాలే సౌఖ్యకరము!

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (25-06-2019) సమస్య:
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్

నా పూరణము:

[మధురానగరానికి వెడలి, తిరిగిరాని శ్రీకృష్ణునికై వేచి వేచి యొక గోపిక విరహంతో పలవరించు సందర్భము]

"రారా నా మొర నాలకించి! యిఁక నన్ రక్షించి, నీ కౌఁగిలిన్
జేరం జేసియు, సౌఖ్యమిమ్ము హరి! నా జీవమ్ము నీవే కదా!
మారా, నా పరమాత్మ వీవె, సుర సమ్మాన్యా! ప్రియాశ్లేష మన్
గారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?"


స్వస్తి


సోమవారం, జూన్ 24, 2019

గుణవంతుఁడగు శిశుపాలునిఁ జంపవచ్చునా?

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (24-06-2019) సమస్య:
వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే

నా పూరణము:

[శ్రీకృష్ణుఁడు శిశుపాల వధ మొనర్చుటను జీర్ణించుకొనలేక కౌరవ దుష్టచతుష్టయమైన దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణాదులు తమలో తాము వితర్కించుకొను సందర్భము]

"స్థిరతఁ గురూపి రూపసిగఁ జేసిన మాత్రనఁ దాను రుక్మిణీ
తరుణిని లేవఁదీసికొని ధర్మువు వీడి చనంగ న్యాయమే?
సరవిని నూఱు తప్పులివి చంపెద నంచును దుర్మదంబునన్
వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?"


స్వస్తి
ఆదివారం, జూన్ 23, 2019

ఆ మగువలకు వెన్నెలలే చీఁకటులైనవి

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (23-06-2019) సమస్య:
ఫుల్ల సరోజ నేత్రలకుఁ బూర్తిగఁ జీఁకటు లయ్యె వెన్నెలల్

నా పూరణము:

[శ్రీకృష్ణు నక్రూరుఁడు మధురానగరికిఁ గొంపోవునప్పుడు, గోపిక లడ్డుపడఁగా, శ్రీకృష్ణుఁడు వారికి నచ్చఁజెప్పి, వెడలఁగాఁ, గృష్ణుఁడు లేని యా గోపికల మనఃస్థితి యెటులున్నదో తెలుపు సందర్భము]

ఉల్లముఁ బ్రాణముం దనువు నుత్తమ పూరుషునందుఁ జేర్చి, తా
మల్లనఁ బోవు స్వీయ హృదయస్థిత కృష్ణుఁ జనంగనీక, తా
మెల్లరు వాని నడ్డఁ, బచరింపుల మాటలఁ జెప్పి పోవు నా
నల్లనివాఁడు లేని వదనమ్ములు నల్లనయయ్యె! నట్లె, యా
ఫుల్ల సరోజ నేత్రలకుఁ బూర్తిగఁ జీఁకటు లయ్యె వెన్నెలల్!!

స్వస్తిశనివారం, జూన్ 22, 2019

కలమును గని కలవరపడిన కవివర్యుఁడుశంకరాభరణంలో నేఁటి (22.06.2019) సమస్య:
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో

నా పూరణము:

[కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను జెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]

కలరవకూజితాంచితసుగంధరసాలకిసాలఖాదనన్
బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁ
బలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

(ఏకలము=అడవిపంది)

స్వస్తి


శుక్రవారం, జూన్ 21, 2019

శునకమ్మును గని భీతిల్లిన రాక్షసుడు


శంకరాభరణంలో నేఁటి సమస్య:
శునకమ్మున్ గని భీతుఁడై పఱచె రక్షోనాథుఁ డాలమ్మునన్

నా పూరణం:

[త్ర్యంబకుఁడు ధనుర్బాణ కవచములను ధరించి, ఛత్ర కేతన యుత రథారూఢుఁడై, దివ్యసైన్యముతోఁ ద్రిపురాసురులతోడి యుద్ధమునకు వెడలి, హరిని స్మరించి, నారాయణాస్త్రము వేయ, నా రాక్షసేశ్వరుఁ డా శివుని యమ్మును జూచి, భయపడి యుద్ధరంగాన్ని వీడి పాఱిపోయె నను సందర్భము]

ధనురారాముఖుఁడై నిచోళకుఁడునై తత్స్యందనారూఢుఁడై
చన యుద్ధంబున దివ్యసైన్యయుతుఁడై సచ్ఛత్ర సత్కేతుఁడై
యనలాక్షుండు హరిన్ స్మరించి యటఁ దా నస్త్రమ్ము వేయంగ, నీ
శున కమ్మున్ గని, భీతుఁడై పఱచె రక్షోనాథుఁ డాలమ్మునన్!

[ధనుః+ఆరాముఖుఁడు+ఐ=ధనుర్బాణములు కలవాఁడై; నిచోళకుఁడునై=కవచమును కలవాఁడై; ఈశునకు + అమ్మున్ + కని = శివునకు అమ్ముగా ఒనర్పఁబడిన నారాయణాస్త్రాన్ని జూచి;]

స్వస్తిగురువారం, జూన్ 20, 2019

స్తనములు నాల్గు గల్గిన సుందరి...


a lady with pearles in neck image hd కోసం చిత్ర ఫలితం

శంకరాభరణంలో నేఁటి (20.06.2019) సమస్య: 
స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా 

నా పూరణము: 

[ఒకఁడు తన మిత్రునితో నొక సుందరినిఁ జూచితినని వచించిన సందర్భము] 

"ఘనతర నాట్యభంగిమము కమ్రవిలాస సువర్ణహాస వ 
ర్తనము స్వరూపమో వినుత రమ్య విశిష్ట ప్రహృష్ట దీప్త మా 
మనమున సంతసమ్ము విసుమానము కన్నులఁ గంఠమందు గో 
స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!

(గోస్తనము=నలువది పేటలు గల ముత్యాల హారము

స్వస్తి


ఆదివారం, జూన్ 02, 2019

తెలంగాణ రాష్ట్రావతరణ పంచమ వార్షిక పర్వ దినోత్సవ శుభకామనలు!

సంబంధిత చిత్రం

ఉ.
శ్రీకరులై వెలింగెడి యశేష జనావళి సంతసించుచున్
జేకొనినట్టి సాత్కృత విశిష్టయునౌ తెలఁగాణ రాష్ట్రమే
ప్రాకటమౌచు నీ దినమె రమ్యసుశోభిత నవ్యరాష్ట్రమై
మేకొని యేర్పడెన్, జగతి మెప్పుల నందుచుఁ బొంగిపోవుచున్!

ఉ.
నా తెలఁగాణ స్వేచ్ఛగను నవ్వుచు హాయిగ వెల్గునంచు, నీ
నేతలు వీరులుం బ్రజలు నిత్యసుశోభలఁ దేలునట్లు, నేఁ 
డీ తెలఁగాణ రాష్ట్ర మది యెప్పటి నుండియొ వేచియుండ, నౌఁ
గాత మటంచు వచ్చెఁ దెలఁగాణము! స్వప్నము సత్యమాయెఁగా!

సీ.
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
        నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
        కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
        వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
        కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ
గీ.
డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును!

ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్షఁ గేసియార్!

సీ.
ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
        తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
        సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
        జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
        సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;
గీ.
యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు!

శా.
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్!

తే.గీ.
సకల జనులిఁక సంతోష సౌఖ్యములను
బొంది, వెలిఁగెడుఁ గావుత పూర్ణముగను!
శాంతి కల్గుతఁ దెలుఁగు రాష్ట్రద్వయమున!
స్వేచ్ఛ యెసఁగుత! యభివృద్ధి వేగ గొనుత!!

తే.గీ.
ఆయురారోగ్యభోగభాగ్యైహికములు
సకలశుభముల నొందియు, సౌమ్యతఁ గొని,
నవ్య రాష్ట్రమ్మునం దెలంగాణ జనులు
శుభము లీప్సితములుఁ బొంది, శోభఁ గనుత!!

స్వస్తి

జై తెలంగాణ! జై జై తెలంగాణ!