Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

పద్య రచన: అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము

తేది: జూలై 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


తే.గీ.
భీష్ము నస్త్ర సన్యాసమ్ము వెనుకె ద్రోణుఁ
డపుడు సర్వ సైన్యాధ్యక్షుఁ డగుడుఁ దీవ్ర
యుద్ధ తంత్రములను బన్ని యోధ ముఖులఁ
గూల్చు చుండఁగఁ గృష్ణుండుఁ గుతిలపడియు;

కం.
'వేఁడి గల యెత్తుగడచే
నేఁ డీతని నిలువరింప నేరక యున్నన్
జూఁడున్ సైన్యం బంతయుఁ
దూఁడరి సేఁతల యుపేక్ష దోసము గాదే?'

తే.గీ.
అనుచు యోచించి, 'ద్రోణుండు తనయు మరణ
మునకు మనఁ జాలఁ' డనుచు భీమునికిఁ జెవిని
వినిచె నిట్లు "నశ్వత్థామ యను గజమును
గూల్చి, యెలుఁగెత్తి చాటుము 'గూలె' ననియు!"

మ.
అనఁగ న్వాయుసుతుండు వేగిరమె యా హస్తీంద్రముం జేరియున్
ఘనవృష్ట్యుత్కట ముష్టిఘాత హతిచేఁ గౌరవ్య సేనా తతుల్
దను వీక్షింపఁగఁ జంపి, బిగ్గఱఁగఁ దా దర్పోద్ధతిం బల్కె నా
వనజాక్షుండు వచించినట్లుగనె, యశ్వత్థామ సంహారమున్!

ఆ.వె.
భీముఁ డట్లు వల్క, విని నమ్మకుండఁగా,
నఱచె ధర్మతనయుఁ డంత లోన,
"సత్య మిదియ సుమ్ము! చచ్చె నశ్వత్థామ!!"
యనియుఁ; జిన్నఁగాను "హస్తి" యనియు!

ఆ.వె.
ద్రోణుఁ డద్ది వినియు రోదించుచును దన
శర శరాసనములఁ జాఱ విడిచె!
ద్రుపద పుత్రుఁ డపుడు ద్రోణుని వధియించెఁ;
గృష్ణుఁ డంత శాంత హృదయుఁ డయ్యె!

(ఇది అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి