తేది: జూలై 19, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
కం.
ఓయీ నేతాజీ! విను
మోయీ, యీ భరతజాతి పొంద స్వతంత్రం
బా యురుతర సంగ్రామం
బాయుధుఁడై సేసితయ్య!వందనమయ్యా!!
తే.గీ.
"హింస హింసచేఁ దనియు నహింసచేతఁ
గాదు; తెల్లవారల గెల్వఁ 'గన్' 'తుపాకిఁ'
జేతఁ బట్టిన లభియించు స్వేచ్ఛ మనకు!
రండు భారత వీరులార! యని సేయ!"
ఆ.వె.
అనుచుఁ బిలిచి, తాను "నాజాదు హిందు ఫౌ"
జనెడి "సైన్య పటలి" సాయుధుఁ డయి;
చేర్చుకొనఁగ జనులఁ జిరకాల వాంఛిత
స్వేచ్ఛ కొఱకు దురము ద్విగుణ మాయె!
ఉ.
భారతమాత దాస్యమునుఁ బాపఁగ నెంచి, సుభాష చంద్రుఁడే
వీర జవానుఁడై దొరల భీతిలఁ జేయఁగ సైన్య యుక్తుఁడై
దారుణమైన యుద్ధము స్వతంత్రతకై కొనసాఁగఁ జేయుచున్
బోరియు వాయు యానమున భూమిని వీడియుఁ జేరె స్వర్గమున్!
మాలినీ వృత్తము:
భరత వర భటాఢ్యా! భవ్య సన్మానితార్యా!
ఖరకర సమ తేజా! గమ్య దాతృత్వ బీజా!
మరణ రణ వినోదా! మాతృ దాస్యాపనోదా!
సరవి నిడుదు జేజే! జాతి నేతాజి జేజే!
-:శుభం భూయాత్:-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి