తేది: జూలై 13, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రానికి నేను రాసిన పద్యములు
ఆ.వె.
పేదఱికపు శాప మే దారిఁ బట్టెనో
చూడఁ జూడ నదియుఁ జోద్య మాయె!
చిన్న బిడ్డఁ డిట్టు లెన్నియుఁ బని సేయ;
బాల కార్మికుఁ డన వలదె నేఁడు?
తే.గీ.
ఆ కుటుంబ మందు నందఱుఁ బని సేయఁ
గడచు దినము, మిగుల గడ్డు దినము!
పిల్లవాండ్రుఁ గూడఁ బెద్ద పనులు సేయ
వలసి రాఁగ నదియ ప్రభుత తప్పు!
కం.
చదువఁగ వలసిన వయసున
బ్రదుకఁగఁ బని సేయఁగాను వలసెను, కట్టా!
యిది యేమి కాలమయ్యా?
మది రోసెడి ప్రభుత తీరు మారఁగ వలయున్!
ఆ.వె.
కనుక, ప్రభుత ధనము ఖర్చు చేసితి మంచుఁ
బ్రగతి లేక; మిగుల సుగతిఁ గనక;
బాలకార్మికులను బడిఁ జేర్పఁగా లేక;
ధనము ఖర్చు సేయ, ధర్మ మగునె?
కం.
ప్రతి యింటికి వలసిన పని
సతతము నిడి బ్రతుకు బాటఁ జక్కఁగ వేయన్;
గతి చక్కఁ బడును; పిల్లలు
మితి లేకయ చదువుకొండ్రు మీఱిన తమితోన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి