Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

పద్య రచన: మేఘ వ్యాపనము

తేది: జూలై 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు




తే.గీ.
వ్యాపన మ్మయె నాకాశ పథము నందు
వార్షుకాభ్రమ్మొ, శారదాభ్రమ్మొ యిదియ?
వార్షికపు మేఘ మైనచో వర్ష మేది?
యిల శరన్మేఘ కాల మహిమ మిదేమొ?! (1)

ఆ.వె.
ప్రిదిలె జవము, శక్తి, గ్రీష్మాతపమ్మునఁ;
బ్రజలు వేచి యుండ్రి వర్షమునకు!
పంట పండు టదియ పదివేలు, లక్షలు;
కాల మహిమ మేమొ కానరాదు! (2)

కం.
చిను కొకటి రాలఁ గానే,
వెనుకటి యుత్సాహ మెలమి పెల్లుబుకంగన్,
మును ముందు కేఁగు రైతుకుఁ
జిను కిట్టుల నాగఁగాను చెడు కాలమ్మే? (3)

ఆ.వె.
గంపె డాశ తోడఁ గనిపెట్టుకొని యుండ,
వాన రాదు పంట పండు కొఱకు;
పంట పండ కున్న నింట వంటయు సున్న;
వంట సున్న యైన బలము సున్న! (4)

జలద వృత్తము
న్యాయము నీకుఁ గాదు;మరియాదయుఁగా;
దీయఁగ రావె వర్షమును నీ క్షణమే;
మాయును బాధ లో జలదమా, మహిలో
శ్రేయము లెల్ల మా కిడఁగఁ జేతు నతుల్! (5)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి