Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 25, 2014

దత్తపది: యేసు-చర్చి-సిలువ-మేరీ...మతసామరస్యం...నచ్చిన పద్యం...

క్రైస్తవ సోదరులందరికీ
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

తేది: డిసెంబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
యేసు - చర్చి - సిలువ - మేరీ

పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మతసామరస్యం గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి పద్యం:

సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
ననియ చర్చిలు మతపెద్దలంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
(చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)బుధవారం, డిసెంబర్ 24, 2014

దత్తపది: తీపి - కారము - పులుపు - చేదు....భారతార్థంలో...నచ్చిన ఛందం...

తేది: అక్టోబర్ 30, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
తీపి - కారము - పులుపు - చేదు
పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము:(ఉపపాండవులనుం జంపిన యశ్వత్థామనుఁ జంపెదనని యర్జునుఁడు శపథముఁ జేయు సందర్భము)

"ౘంపితీపిల్లలను నీవు సంతసమునఁ;
గోరి యుపపాండవుల కపకారము నిడి
నట్టి పాపులు పుడమి నుండంగఁ ౙనదు!
త్రుటిని నిను నాదు శరముచేఁ దునిమివైతు!!"సోమవారం, డిసెంబర్ 08, 2014

న్యస్తాక్షరి: త్యా-గ-రా-జు...శాంతము లేక సౌఖ్యము లేదు...ఆటవెలదిపద్యంలో...

తేది: అక్టోబర్ 28, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్యా - - రా - జు’ ఉండాలనగా
నేను రాసిన ఆటవెలదిత్యాగరాౙు సెప్పె  నానాఁడు "శాంతమ్ముఁ
నక సౌఖ్య మెౘటఁ  గన"రటంౘు;
రామునకును నిదె ని  రంతర వినతి యౌఁ
ౙుమ్ము కనఁగ లోక  సూత్ర మగుౘు!


ఆదివారం, డిసెంబర్ 07, 2014

సమస్య: దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

తేది: అక్టోబర్ 27, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:


పాపియు మాఱఁగ నెంచియు
లోప సహిత హృదయ గృహములోఁ గ్రుచ్చిన విల్
తూపగు దుశ్చింతాహృ
ద్దీప మ్మార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్!

శనివారం, డిసెంబర్ 06, 2014

నిషిద్ధాక్షరి: శ్రీరామ పట్టాభిషేకం

తేది: అక్టోబర్ 26, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన శ్రీరామ పట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి పద్యంలో
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘’ నిషిద్ధం
రెండవపాదాన్ని ‘’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘’ నిషిద్ధం
మూడవపాదాన్ని ‘’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం
నాలుగవపాదాన్ని ‘’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చుననగా
నేను రాసిన తేటగీతి పద్యము:రాజసింహాసనమున శ్రీరామునపుడు
క్తి భరతుండు పట్టాభిషిక్తుఁ జేసి,
లిత మర్యాదు లక్ష్మణు నలరఁ జేసి,
స్త్రి శత్రుఘ్ను నానంద సదనుఁ జేసె!


మంగళవారం, డిసెంబర్ 02, 2014

సమస్య: హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపుమనెన్

తేది: అక్టోబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా నాలుగు పూరణములు:


(1)
హరి మురహరియను చోరులు
హరియింపఁగ నొకరియింట నడుగిడ, నచటన్
హరివర్ణపు నగఁ గని, ముర
హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
(హరినిన్ = హరివర్ణ (పచ్చని రంగుగల) ఆభరణమును)

(2)
హరియింతు నను కశిపునకు
హరి నా ప్రహ్లాదుఁ డపుడు "హరి హరి"యనుచున్
బరగంగఁ బిలిచి మదమో
హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
(మదమోహరి హరికిన్ = మదమును, మోహమునుం గలవాఁడును, దివిజపురాపహారియునగు హిరణ్యకశిపునకు)

(3)
హరి హరి! సర్పము కప్పను
హరియింప వెనుఁ దవులఁ గని "హా హా"యనఁగన్
"బరగ నిది తిండియౌ"నని
హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
(హరి = విష్ణువు, హరికిన్ = సర్పమునకు, హరినిన్ = కప్పను)

(4)
హరిణాక్షి వెంట రాఁగా,
హరి హరిపురి కరుగుఁదెంచ, హరితవనమునన్
విరి తావిఁ గొని హరిమనో
హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
(హరినిన్+చూపి=హరితవనమున విరి తావినిం బ్రసరింపఁజేసెడు పారిజాతమనియెడు దేవతావృక్షమునుం జూపించి)