Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 31, 2015

సమస్య: ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!

తేది: సెప్టెంబర్ 07, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(బాల కృష్ణుని కాళియమర్దన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)మేనుం గంపన మందఁగఁ
దానా కృష్ణు పద ఘట్టితముల నవయుచున్
దీనుఁడగు కాళియుండను
నేనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!


శుక్రవారం, అక్టోబర్ 30, 2015

సమస్య: పాపకర్ములు దుష్టులు భాగవతులు!

తేది: సెప్టెంబర్ 06, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


నేరకయె సేసినట్టిడు నీచకృతుల
మథనపడుచును దొసఁగుల మాన్ప మధురి
పు శరణాగతులయి మోక్షము నడిగిరయ
పాపకర్ములు,దుష్టులు,భాగవతులు!సోమవారం, అక్టోబర్ 26, 2015

సమస్య: రోగము లొసంగు జనులకు భోగములను!

తేది: సెప్టెంబర్ 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
"స్వర్గ  లోకమ్మునకుఁ జన, ససిగ నప్స
రో గము లొసంగు జనులకు భోగము"లను
కాంక్షతోడుతఁ బుణ్యస క్తాత్ములగుచు
దానము ల్సేయుచుందురు మానవు లిల!ఆదివారం, అక్టోబర్ 25, 2015

సమస్య: కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!

తేది:  సెప్టెంబర్ 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

స్పష్ట ప్రతిభను నభ్యా
సేష్టిని వ్యుత్పత్తితోడఁ జేర్చియు భావా
క్లిష్టతఁ బద్యాల్ సెప్పన్
గష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!

సమస్య: ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!

తేది: ఆగస్టు 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా నాలుగు పూరణములు

నా మొదటి పూరణము:

(ఒకానొకప్పుడు మహిషాసుర సంహారమునకై త్ర్యంబా సహిత సురనారీ తేజము దేవిగా మారఁగా, సూర్యచంద్రు లామె నేత్రద్వయముగఁ బ్రకాశించిన సందర్భము)సకల సుర వధూ తేజ
స్సకలాసుర హంత్రి దేవి చక్షుద్వితయ
ప్రకటీకృత దీప్తులుగా
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!************************************************
నా రెండవ పూరణము:(శివుఁడు త్రిపురాసుర సంహారముం జేయుటకుఁ బూనుకొనఁగా భూమి రథముగాను, సూర్యచంద్రులు రథచక్రములుగాను, వేదము లశ్వములుగాను, బ్రహ్మ సారథిగాను, నొప్పిన సందర్భము)
ప్రకట త్రిపురాసుర హిం

సకునకు సారథిగ విధియు, స్యందనమౌ భూ
మికిఁ జక్రద్వయముగఁ దా
మొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!***********************************************
నా మూఁడవ పూరణము:


(దేవదానవ యుద్ధమందు రాక్షసులు దేవతల నోడించి యమరావతిని స్వాధీనము జేసికొనఁగ సూర్యచంద్రులతోఁ బాటుగ దేవతలందఱును విష్ణువును శరణు కోరి పలికిన సందర్భము)
వికలాత్ములైన సురలా
యకలంకుని హరినిఁ జేరి యసురుల కృతమున్
సకల మెఱిఁగించుచుండఁగ
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!*************************************************
నా నాలుగవ పూరణము:
(హిమవంతుఁడు శివపార్వతుల కళ్యాణమునకు దేవతల నాహ్వానింపఁగ సూర్యచంద్రులును వచ్చిన వైనము)
సకలేశుఁడు హరునకుఁ బు
త్రిక గిరిజను నిచ్చి పెండిలిం దగఁ జేయన్
సకల సురలఁ బిలువఁగఁ, దా

మొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!************************************************
-:శుభం భూయాత్:-శుక్రవారం, అక్టోబర్ 23, 2015

సమస్య: హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్!

తేది: ఆగస్టు 30, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(పరమ పతివ్రతా మతల్లి యైన సతీ సుమతి, వేశ్యాలోలుఁడైన తన మగని కోరిక ననుసరించి, యతనిని వేశ్యచెంతకుం బంపుట)
పతికి నమస్కరింపఁ బతి పాదములంటి పతివ్రతా విధుల్
సతతముఁ జేయు నా సుమతి; సానిని, శుండను, సర్వవల్లభన్
మతినిఁ దలంచి కోరు పతి మానసమున్ గ్రహియించి, వేగమే
హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్!
గురువారం, అక్టోబర్ 22, 2015

నమోఽస్తు తే జననీ! మహిషాసుర మర్దినీ!!


సుకవి పండిత వీక్షక మిత్రులందఱకు

దసరా పండుగ శుభాకాంక్షలు!

ఖల మహిష దనుజ దురితము
విలయ ఘటిత పటు బలమున  వెడలఁగ నిడియున్
నిలిపితివి యమర జయమును
దలఁతును మది నిపుడు జనని 
 దశభుజ దుర్గా!

ఇందిరా రమణ సోదరీ! హిమజ!  హిండి! చండి! ఖల శోషిణీ!
నందయంతి! గిరిజా! మదోత్కట! మ
నస్వినీ! దనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరు
ణాంతరంగ! వరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర 
 ఖండితోగ్ర! మృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత 
 భక్తిమస్త! నగనందినీ!
మందయాన! పరమార్థ దాయిని! న
మః సతీ! మహిష మర్దినీ!

-:శుభం భూయాత్:-
బుధవారం, అక్టోబర్ 21, 2015

మాతా! త్రిదేవీ! త్రిమూర్త్యాత్మికా!

మిత్రులందఱకు మహర్నవమి శుభాకాంక్షలు!!
శా.
చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్  శ్రీ వాణివై నిల్చి, స
చ్చేతోమోద విశేష సంపద లిడన్  శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్  శ్రీ గౌరివై నిల్చి, స
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!
కం.
వాణీ! వీణా పాణీ!
పాణి స్థిత సకల విభవ  భాస్వ ల్లక్ష్మీ!
ప్రాణేశార్ధాజిర శ
ర్వాణీ! ధీ బల ధనాఢ్య!  వరదాయి! భజే!!మంగళవారం, అక్టోబర్ 20, 2015

సద్దుల బతుకమ్మా...సల్లంగ జూడమ్మా...!!!

మిత్రులందఱకు బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

(తెలంగాణమునం బడతు లందఱు బ్రతుకమ్మ పండుగ నాఁ డెట్టుల బ్రతుకమ్మ నలంకరించి, పూజింతు రనఁగా...)


సీ.
తంగేడు పూవులఁ దాంబాలమునఁ గుండ్ర
.....ముగ నందముగఁ బేర్చి,
మురువు సూపు
వివిధమ్ములగు రంగు
లవి గునుగులఁ జేర్చి,
.....మందార, కట్ల, చే
మంతుల నిడి,
బంతిపూవులు పోఁక
బంతిపూవులు వింత
.....సొబగుల నీనఁగాఁ 
 జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ 
 బండువు సేయంగ
.....బ్రతుకమ్మ నడుమ గౌ 
 రమ్మనుంచి,

గీ.
ధగధగలతోడి పట్టుపీ 
 తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు 
 ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ 
 గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు 
 పడతులంత!

కం.

బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరి చివర 
 నిక్కపు భక్త్యు
న్నతి నాడి పాడియును స
న్మతి బ్రతుకమ్మను నిమజ్జ 
 నము సేతురయా!


ఆ.వె.
ముత్తయిదువ లపుడు 
 పూతురు పసుపును
పుస్తెలకును గౌరి  పూజసేసి!
సన్నిహితులు హితులు  సఖులంత కష్టసు
ఖములఁ జెప్పుకొండ్రు  కలిసిన కడ!

తే.గీ.
ఇంటినుండియుఁ దెచ్చిన 
 హితకరమగు
తీపి వస్తువులనుఁ బంచి,  తినియు, మఱల
సద్దులను మూటఁగట్టియు  సంబరమున 
నిండ్లకుం జేరఁ బోదురా  యింతులంత!

కం.

బ్రతుకమ్మ పర్వదినమున
నతి సంతోషమున దుర్గ 
 నవ్యానందాల్
సతులందఱ కిడి, వారలఁ
బతులకుఁ బిల్లలకు స్థిరత 
 బ్రతు కిడుఁ గాతన్!<||> శుభం భూయాత్ <||>సోమవారం, అక్టోబర్ 19, 2015

సమస్య: దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ!

తేది: ఆగస్టు 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(రాజసూయయాగ సమయాన దుశ్శాసనుని భార్యయు, ద్రౌపదియుఁ గలిసికొని, సంతసించిన ఘట్టము)
దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపదతనయ
తోడికోడండ్రు గానఁ, గ్రతువునఁ గాంచి
సంతసించిరి, తాము స్త్రీసహజమైన
పేరఁటమ్మునఁ గలసిన విధమెఱింగి!
ఆదివారం, అక్టోబర్ 18, 2015

సమస్య: ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్!

తేది: ఆగస్టు 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
కొండొకఁడు సతీ యుతుఁడై
మెండుగ హరిఁ గొల్చి, "కనక మి"మ్మన, దయ వి
ష్ణుం డిడె! సతిపయిఁ గనక
మ్ముండను వీక్షించి, మగఁడు మోదము నందెన్!!శనివారం, అక్టోబర్ 17, 2015

అమ్మా! ఆదిపరాశక్తీ! శాంకరీ! నమోఽస్తు తే!
అమ్మ! మనమ్మునందు నిను నండగ నమ్మితి! నమ్ము మమ్మ! మో
హమ్ముఁ బెకల్చి, సన్మనము నందఁగ నిచ్చి, హృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చి, సతతమ్ము దయారస మిమ్ముఁ గూర్చి, నా
కిమ్మహి జన్మ దున్మి, యిఁకఁ గేవల సద్గతి నిమ్మ! యమ్మరో!!శుక్రవారం, అక్టోబర్ 16, 2015

దత్తపది: పాత్ర-పాత్ర-పాత్రము-పత్రము...అవే అర్థాలతో...భాగవతార్థంలో...తేటగీతి పద్యం....

దాదాపు ఒక నెల రోజుల క్రిందట
మా పాఠశాలలో జీవశాస్త్రమును బోధించు ఉపాధ్యాయులు శ్రీ కె. శ్రీధర్ గారు
కోరి యిచ్చిన దత్తపది:
పాత్ర(=పాత్రధారిత్వము)-పాత్ర(=పళ్ళెరము)-పాత్రము(=యోగ్యము)-పత్రము(=పర్ణము) అను పదములను నిర్దేశితార్థములతో మాత్రమే...
భాగవతార్థంలో...
తేటగీతి పద్యం వ్రాయమనగా..
నేను వ్రాసిన పద్యము


(శ్రీకృష్ణతులాభార ఘట్టము)ధవునిఁ గొనుగోలు సేయు పాత్రను ధరించి,
తనదు పతినప్డు సత్యయే తపసి పాత్ర
యందిడెఁ! దిరిగి కొన నపహాస్య పాత్ర
య్యె! రుక్మిణి, యిడి పత్ర, మతనిఁ గొనియె!!


గురువారం, అక్టోబర్ 15, 2015

సమస్య: మన్మథుండు హైమవతికి మగఁడు గాదె!

తేది:  ఆగస్టు 11, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

మగఁడు గద రతీదేవికి మన్మథుండు!
హైమవతికి మగఁడు గాదె హరుఁడు! రమకు
మగఁడు గాదె మురహరుండు! మగఁడు గాదె
వాణికి చతుర్ముఖుండు! వివాద మేల?బుధవారం, అక్టోబర్ 14, 2015

దత్తపది: లంగా-లుంగీ-చీర-దోవతీ...భారతార్థంలో...నచ్చిన ఛందస్సులో...

తేది: ఆగస్టు 25, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన 
లంగా-లుంగీ-చీర-దోవతీ ...పదములను
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులోవ్రాయమనగా
నేను వ్రాసిన రెండు పద్యములు:


(ఖాండవ వనమును దహించి, మయ విరచిత యింద్ర[ఖాండవ]ప్రస్థముగ నొనర్చిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)మొదటి దత్తపది: కందము:
ఖాండవ తరులం గా లిచి
మెండు బలుం గీ డుఁ ద్రోచి మేలైన భువిన్
గండరగండఁడు చీరఁ 
దండిగ హరి దోవ తీ సెఁ దమ నగరముగన్!!
రెండవ దత్తపది: (పై పద్య భావమునే మత్తేభమునందు):

తరులం గా లిచి ఖాండవానఁ దగ నింద్రప్రస్థమన్ రాజధా
ని రచింపన్ మయు సాయమంది, బలులుం గీ ర్త్యాత్ములున్ రాజ్యపా
లురునై చీరఁ గఁ, బాండునందనుల నాల్గుం దిక్కులం గెల్వఁగన్
బురికొల్పంగను, నశ్వమేధమునకున్ బ్రోత్సాహియై దోవతీ
సి, రణోన్ముఖ్యవిజేతృ భాగ్యమొసఁగెన్ శ్రీకృష్ణుఁడే మాన్యుఁడై!!మంగళవారం, అక్టోబర్ 13, 2015

సమస్య: పడుచున్నను పెండ్లియాడువారే లేరే?

తేది:  ఆగస్టు 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు
మొదటి పూరణము:
(అన్ని యుండియు నెంత కాలమైననుం బెండ్లి కుదురని యువకుని మనోగతము)
"గడనము వేలుగ! నేనొ
క్కఁడనే కొడుకునయ! దేవ! కట్నమడుగ! రాఁ
గడఁగియుఁ బడుచులు, సంతస
పడుచున్, ననుఁ బెండ్లియాడువారే లేరే?!"

రెండవ పూరణము:
"పడతులు పుట్టఁగ వలదని
కడుపులు తీయించుకొనుచు ఘనముగఁ బడుచుల్
గొడుకులఁ గందురె? కొందల
పడుచున్నను పెండ్లియాడువారే లేరే?!"సోమవారం, అక్టోబర్ 12, 2015

సమస్య: కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!


తేది: ఆగస్టు 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(మాయా ప్రభావమునకు లోనైన రావణుఁడు శివునితోఁ బార్వతి నిమ్మని కోరుట)మిక్కిలి చొక్కునఁ జిక్కియుఁ
గ్రక్కున ముక్కంటి యింతి కర మందుకొనన్
జక్క నడుగు "దశగళుఁ డను
కుక్కకుఁ" దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్!


ఆదివారం, అక్టోబర్ 11, 2015

సమస్య: బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్!

తేది: ఆగస్టు 22, 2015నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ప్రియుని పొగడ్తలకుం బొంగిపోవు ప్రియురాలి పరిస్థితినిం దెలుపుట)"రాణీ! తొలి వలపుల యలి
వేణీ! నీ ప్రణయ వచన వీచిని ననుఁ, బూ
బోణీ! తేల్చుమ" యను మరు
బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్!శనివారం, అక్టోబర్ 10, 2015

సమస్య: శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!

తేది: ఆగస్టు 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
శ్రావణమ్మున శుక్రవారమ్మునాఁటి
శుభఘడియలోన మున్నీటిచూలి, తోయ
జాసన, కమల కరుణా కటాక్ష దృగ్వి
శేషమే చాలు నెనలేని శ్రీలు గురియు!


గురువారం, అక్టోబర్ 08, 2015

సమస్య: అఖిలకవిమాన్యమై యలరారు బూతు!

తేది: ఆగస్టు 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
బూతు పద్యమ్ము లేకున్న రోతురనుచు
సకల జనులను రంజింప శ్రావ్యమయ్యు
నఖిలకవిమాన్యమై యలరారు బూతు
పద్యముల్ కవి చౌడప్ప వ్రాసెఁ, గనుఁడు! 

***          ***          ***

కందపద్యాలఁ బది నీతి కథలుఁ బదియు
బూతులం జెప్పఁగాఁ దానుఁ బూనుకొనియు
సర్వులును మెచ్చ రచియించు చౌడ సుకవి
కఖిలకవిమాన్యమై యలరారు బూతు!
బుధవారం, అక్టోబర్ 07, 2015

సమస్య: భారత యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!

తేది: ఆగస్టు 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(అశ్వమేధ యాగాశ్వ గ్రహీత బభ్రువాహనుఁ డర్జునుని నిర్జించిన విధమునుం దర్జించుచు ధర్మరాజుతో శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము)"కోరియుఁ జిత్రాంగదకుఁ గు
మారుఁడు హయముం గొని, పరమాంచితమౌ సౌ
వీరత నర్జునుఁ జంపఁగ,
భారత! యుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్!"మంగళవారం, అక్టోబర్ 06, 2015

సమస్య: కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట!

తేది: ఆగస్టు 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ధౌమ్యుఁ డుపమన్యు గురుభక్తి తత్త్వముఁ గనఁ
గనుఁ బరీక్షించె; నతనికిం గనులు వోయె;
నపుడు గురు వశ్వినులఁ బిల్చినంత; వెసనుఁ
గన్నులబ్బెను! ఫలమునుఁ గాంచె నెదుట!!
ఆదివారం, అక్టోబర్ 04, 2015

సమస్య: చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

తేది: జూలై 07, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


["చంద్రహాసుని కథ"నిట ననుసంధానించుకొనునది]


చంద్రహాసునిం దుర్బుద్ధి చంపనెంచి,
"విషము ని"మ్మనె లేఖలో; "విషయ ని"మ్మ
నియును మార్చెను విషయయే రయమునఁ! గన,
చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!!శనివారం, అక్టోబర్ 03, 2015

సమస్య: రామకథ విని మురిసెను రాక్షసుండు!

తేది: సెప్టెంబర్ 14, 2015 నాటి శంకరాభరణములోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
వినయమున రాముఁ జేరి, విభీషణుండు
మిత్రుఁడై భక్తి సేవింప, మిత్రసుతుఁడు
రామకథ నప్డు బహుసుందరముగ వినిచె!
రామకథ విని మురిసెను రాక్షసుండు!!


గురువారం, అక్టోబర్ 01, 2015

సమస్య: భర్తృరహిత సంతుఁ బడసి మురిసె!

తేది: ఆగస్టు 16, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముమత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ
డామె కన్నెతనము హతము కాని
వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!
భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె!!