Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 18, 2014

దత్తపది: కటి-కిటి-తటి-నటి...సూర్యోదయ వర్ణన...నచ్చిన ఛందస్సులో...

తేది: అక్టోబర్ 24, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
కటి - కిటి - తటి - నటి
పదాలను ఉపయోగిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి మఱియు (అదే భావంతో) కందపద్యం:


తే.గీ.
కటిక చీఁకటి పొరలను ఖండములుగఁ
జీల్చి, వాకిటి తలుపు ముంజేతితోడఁ
ద్రోచి, వచ్చి, మేల్కొల్పు సద్రుచుల! నెం
టి మొనగాండ్రపై నైన నటించును రవి!!


పై (తేటగీతి) పద్యభావమే కందపద్యమున...

కం.
కూకటి వ్రేళులఁ జీఁకటి
వేకువ జాముననుఁ గూల్తువే వాకిటిలోఁ
దేఁకువ నిడి! నీ వెంతటి
నాకాధీశు పయి నయిన నటియింతువయా!!


సోమవారం, నవంబర్ 17, 2014

న్యస్తాక్షరి: దీపావళి...ఉత్పలమాలలో...

తేది: అక్టోబర్ 22, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన యిచ్చిన
అంశం- దీపావళి
ఛందస్సు- ఉత్పలమాల
మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’,
రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’,
నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’
ఉండాలనగా
నేను వ్రాసిన పద్యము:దీనజనావనుండు వసుదేవసుతుండు దురాన ధారుణీ
సూను నిపాత పాతకుని శూరతఁ దాఁకఁగ, సత్యభామయున్
వాని నెదుర్కొనన్ జనియు ధ్యునొనర్పఁగ, నాఁడు శీఘ్రమే
మానవు లుంచ దీపముల, మాల్మిఁ గనెన్ గద దేవతాళియున్!


ఆదివారం, నవంబర్ 16, 2014

సమస్య: సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్

తేది: అక్టోబర్ 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:సద్గ్రాహ్యము కానట్టి వి
యద్గ్రహణ పరిధినిఁ బోలు నాకారము కిం
చిద్గ్రామ్యాంచితమగు న
సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!శుక్రవారం, నవంబర్ 14, 2014

నిషిద్ధాక్షరి: ల,ళల నిషేధంతో...ఊర్మిళాదేవి నిద్రను...నచ్చిన పద్యంలో...

తేది: అక్టోబర్ 20, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
"ల. ళ" లు లేకుండ
ఊర్మిళాదేవి నిద్రను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి:జనక భూవిభు నౌరస తనయ...తనదు
భర్త సౌమిత్రి, యన్నవెంబడి వనమ్ము
నకును నరిగి, తిరిగివచ్చు నంతదాఁక,
పట్టువిడువక నిద్రించినట్టి సాధ్వి!


గురువారం, నవంబర్ 13, 2014

సమస్య: మృచ్ఛకటిక శకారుఁడు మేలుఁ జేసె

తేది: అక్టోబర్ 19, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:


అల శవర్ణ మెంతటి వక్రమౌనొ, యంత
వక్రబుద్ధియయ్యునుఁ దానె పఱఁగఁ జారు
దత్తుని వసంతసేన చెంతకునుఁ జేర్చి,
మృచ్ఛకటిక శకారుఁడు మేలుఁ జేసె!!


బుధవారం, నవంబర్ 12, 2014

దత్తపది: కోపము - చాపము - తాపము - పాపము...ఉత్తరుని ప్రగల్భములు...నచ్చిన ఛందస్సులో...

తేది: అక్టోబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
కోపము - చాపము - తాపము - పాపము
అనే పదాలను ఉపయోగిస్తూ
ఉతరుని ప్రగల్భములను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన మూఁడు పద్యములు:


(నర్తనశాలలో బృహన్నల యెదుట, నంతఃపురకాంతల యెదుట నుత్తరకుమారుఁడు ప్రగల్భమ్ములు పలుకు సందర్భము)

ఉ.
కోపము నాకుఁ గల్గెడిని గోగ్రహణోద్ధతమూర్ఖకౌరవుల్
పాపముఁ జేసి, సంగరము భావ్యమటంచును నెంచి, నీచులై
తాపములేక నిక్కఁగను, ధైర్యము శౌర్యముఁ బూని నేను నా
చాపముఁ జేతఁ బట్టితిని! సారథిలేఁ డిఁక నేమి సేయుదున్? (1)


***          ***           ***           ***           ***

వ.
కౌరవు లుత్తర గోగ్రహణముం జేసిన విషయము వినిన యుత్తరకుమారకుండు...
కం.
ఈషత్కోప ముఖాంచ
ద్రోషిత హృచ్చాపముక్త రూక్షాంబక వా
క్ఛోషిత తాప ముఖర శ
బ్దోషఃకాల క్షపాపముద్రితఘోషన్! (2)

వ.
అంతఃపురకాంతలయెదుట బృహన్నల చూచుచుండఁగా నిట్లు ప్రగల్భములు పలికెను...
కం.
"కోపము నాకును వచ్చిన
చాపముతోఁ గౌరవులనుఁ జావఁగఁజేతున్!
తాపముతోడుత వారలు
పాపము! శోకార్తులునయి పరువెత్తవలెన్!" (3)

(రెండవ పద్యమున దీర్ఘసమాసమును, మూఁడవ పద్యమున నుత్తరుండు మాటలాడునపు డలఁతి యలఁతి మాటలను హాస్యమునకై వాడితినని గమనించ మనవి)

సోమవారం, నవంబర్ 10, 2014

న్యస్తాక్షరి: ప్రతిపాదాంతమందు వరుసగా భా-ను-మ-తి...ఆటవెలఁది ఛందస్సులో...భానుమతి(దుర్యోధనుని భార్య, సహదేవుని భార్య, సినీనటి వీరిలో ఎవరైనా) వర్ణన...

తేది: అక్టోబర్ 16, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- భానుమతి. 
(దుర్యోధనుని భార్య, సహదేవుని భార్య, సినీనటి వీరిలో ఎవరి గురించి వ్రాసినా సరే!) 
ఛందస్సు- ఆటవెలఁది. 
నాలుగు పాదాలలో చివరి అక్షరాలు వరుసగా భా, ను, మ, తి ఉండాలనగా
నేను వ్రాసిన ఆటవెలఁది పద్యము:


చలనచిత్రములనుఁ జక్కని నటన భా
సురముగానుఁ జేసి సుస్థిరమును
శాశ్వతమగు కీర్తి విశ్వాన భాను
తియె కొనియెను! నే నుతింతును మతి!

ఆదివారం, నవంబర్ 09, 2014

నిషిద్ధాక్షరి: ’ర’కార నిషేధం...రామ రావణ యుద్ధ వర్ణన...కందపద్యంలో...

తేది: అక్టోబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా
రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం వ్రాయమనగా
నేను రాసిన పద్యం:


సీతాపతిహస్తతృణత
శాతపృషత్కోద్విఘాతసంహతిశక్తిన్
దైతేయపతియె హతుఁడయె
సీతాస్తేయాత్యయకృతశిక్షితుఁడగుచున్!!


గురువారం, నవంబర్ 06, 2014

న్యస్తాక్షరి: ప్రతి పాదాద్యక్షరము వరుసగా...బె-జ-వా-డ...తేటగీతిలో...విజయవాడ వర్ణన...

సాహితీ మిత్రులందఱకు, బ్లాగు వీక్షకులకు
కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు!!!


తేది: అక్టోబర్ 10, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- విజయవాడ.

ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా బె, జ, వా, డ ఉండాలనగా

నేను రాసిన పద్యములు:


నా మొదటి పద్యము:

బెబ్బులిని బండిగాఁ గొని వెలుఁగులిడు, వి
యము లందించి, కాచెడు, జనుల వెత ని
వారణమిడు కనకదుర్గ వదనమునఁ బొ
మిన మెఱపుచే విజయవాడయె వెలుంగు!!***          ***          ***          ***


నా రెండవ పద్యము:


బెడఁగు నడ, వినయాంచిత వీక్ష, రా
న వితరణ, మాంధ్రుల మానసాంబు చిర
వాసిత కరుణాయ దరహాస ధార, 
గ్గఱించెడి కుతుక, మటన కనికరి!! 


పై పద్యమున నొక చమత్కారము కలదు.
నాల్గు పాదములలోని...
మొదటి గణపు మొదటి యక్షరములఁ గలిపిన "బెజవాడ" యని,
మూఁడవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "యాంధ్రులకు"నని,
యైదవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "రాజధాని"యని
చమత్కరించుట జరిగినది.


వర్ణితాంశము విజయవాడ సుగుణమే!


ఇందు దొసఁగు లుండవచ్చును. పాండిత్యప్రకర్ష కొఱకుఁ గాక, చమత్కార సాధనకై మాత్రమే నేను దీనిని వ్రాసితిని. కవిమిత్రులు మన్నించి యాదరింపఁగను, దొసఁగులున్న సవరణములు సూచింపఁగను మనవి.