తేది: అక్టోబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
కోపము - చాపము - తాపము - పాపము
అనే పదాలను ఉపయోగిస్తూ
ఉతరుని ప్రగల్భములను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన మూఁడు పద్యములు:
(నర్తనశాలలో బృహన్నల యెదుట, నంతఃపురకాంతల యెదుట నుత్తరకుమారుఁడు ప్రగల్భమ్ములు పలుకు సందర్భము)
ఉ.
కోపము నాకుఁ గల్గెడిని గోగ్రహణోద్ధతమూర్ఖకౌరవుల్పాపముఁ జేసి, సంగరము భావ్యమటంచును నెంచి, నీచులై
తాపములేక నిక్కఁగను, ధైర్యము శౌర్యముఁ బూని నేను నా
చాపముఁ జేతఁ బట్టితిని! సారథిలేఁ డిఁక నేమి సేయుదున్? (1)
*** *** *** *** ***
కౌరవు లుత్తర గోగ్రహణముం జేసిన విషయము వినిన యుత్తరకుమారకుండు...
కం.
ఈషత్కోప ముఖాంచ
ద్రోషిత హృచ్చాపముక్త రూక్షాంబక వా
క్ఛోషిత తాప ముఖర శ
బ్దోషఃకాల క్షపాపముద్రితఘోషన్! (2)
వ.
అంతఃపురకాంతలయెదుట బృహన్నల చూచుచుండఁగా నిట్లు ప్రగల్భములు పలికెను...
కం.
"కోపము నాకును వచ్చిన
చాపముతోఁ గౌరవులనుఁ జావఁగఁజేతున్!
తాపముతోడుత వారలు
పాపము! శోకార్తులునయి పరువెత్తవలెన్!" (3)
(రెండవ పద్యమున దీర్ఘసమాసమును, మూఁడవ పద్యమున నుత్తరుండు మాటలాడునపు డలఁతి యలఁతి మాటలను హాస్యమునకై వాడితినని గమనించ మనవి)
మీ నారికేళ ద్రాక్షాపాక పద్యాలు హాస్యానికి వ్రాసినవని ఎలా అనుకోమంటారు? సందర్భానికి, పాత్రకు తగిన ఔచిత్యాన్ని ప్రదర్శించారు. చాలా బాగున్నవి.
రిప్లయితొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి