Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఫిబ్రవరి 27, 2014

సమస్య: కపిని వలచి గిరిజ తపము సేసె

కవి పండిత పాఠక మిత్రులకు
మహా శివరాత్రి పర్వదిన 
శుభాకాంక్షలు!

తేది: జూలై 20, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము(ఏకాదశరుద్రరూపుడైన శివుని, పార్వతి నవవిధ భక్తి మార్గాలలోఁ గొలుచుట)

సీ.
హరుని నర్చించియు నత్యనురాగాన,
        బహురూపు నెడఁదలో భక్తిఁ దలఁచె;
త్ర్యంబకుఁ గొలువంగ దాసియుఁ దానయ్యు,
        నపరాజితు సఖిగ నతివ నిలిచె;
నాత్మనివేదన మ్మది శర్వునకు నిడి
        యును, గపర్దికిని వందనము నిడియె;
శంభుని గుణగణ శ్రవణ యయ్యును దాను,
        రైవతుఁ గీర్తించె రమ్యముగను;

గీ.
పాద సేవనముఁ గపాలికిఁ జేయంగ,
దిన దినమ్ము ప్రేమ దీప్తమయ్యె!
కడఁకఁ బూని, తా, మృగవ్యాధునిన్వృషా
కపిని
 వలచి గిరిజ తపము సేసె!!

-:శుభం భూయాత్:-

బుధవారం, ఫిబ్రవరి 26, 2014

సమస్య: కపిని వలచి గిరిజ తపము సేసె

తేది: జూలై 20, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము

సీ.
హరుని నర్చించియు నత్యనురాగాన,
        బహురూపు నెడఁదలో భక్తిఁ దలఁచె;
త్ర్యంబకుఁ గొలువంగ దాసియుఁ దానయ్యు,
        నపరాజితు సఖిగ నతివ నిలిచె;
నాత్మనివేదన మ్మది శర్వునకు నిడి
        యును, గపర్దికిని వందనము నిడియె;
శంభుని గుణగణ శ్రవణ యయ్యును దాను,
        రైవతుఁ గీర్తించె రమ్యముగను;

గీ.
పాద సేవనముఁ గపాలికిఁ జేయంగ,
దిన దినమ్ము ప్రేమ దీప్తమయ్యె!
కడఁకఁ బూని, తా, మృగవ్యాధునిన్వృషా
కపిని
 వలచి గిరిజ తపము సేసె!!

-:శుభం భూయాత్:-

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

సమస్య: ముగిసె నాషాఢమని యేడ్చె ముద్దుగుమ్మ

తేది: జూలై 19, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన పూరణము


కొత్త దంపతు లాషాఢ ముత్తమ మని,
యత్తలకు దూర ముండియు, హాయిఁ గొనుచుఁ
దేలి రానంద లోకాలఁ! దిరుగ నెలయు,
ముగిసె నాషాఢమని యేడ్చె ముద్దు గుమ్మ!!


('ఆషాఢ మింత తొందరగ ముగియకున్న నే యాటంకములు లేక మఱి
కొంత కాలము వర కానందమును బొందుదుము గదా!' యనియే యా యేడుపు!)


ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

పద్య రచన: నేతాజీ సుభాష్ చంద్ర బోస్

తేది: జూలై 19, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


కం.
ఓయీ నేతాజీ! విను
మోయీ, యీ భరతజాతి పొంద స్వతంత్రం
బా యురుతర సంగ్రామం
బాయుధుఁడై సేసితయ్య!వందనమయ్యా!!

తే.గీ.
"హింస హింసచేఁ దనియు నహింసచేతఁ
గాదు; తెల్లవారల గెల్వఁ 'గన్' 'తుపాకిఁ'
జేతఁ బట్టిన లభియించు స్వేచ్ఛ మనకు!
రండు భారత వీరులార! యని సేయ!"

ఆ.వె.
అనుచుఁ బిలిచి, తాను "నాజాదు హిందు ఫౌ"
జనెడి "సైన్య పటలి" సాయుధుఁ డయి;
చేర్చుకొనఁగ జనులఁ జిరకాల వాంఛిత
స్వేచ్ఛ కొఱకు దురము ద్విగుణ మాయె!

ఉ.
భారతమాత దాస్యమునుఁ బాపఁగ నెంచి, సుభాష చంద్రుఁడే
వీర జవానుఁడై దొరల భీతిలఁ జేయఁగ సైన్య యుక్తుఁడై
దారుణమైన యుద్ధము స్వతంత్రతకై కొనసాఁగఁ జేయుచున్
బోరియు వాయు యానమున భూమిని వీడియుఁ జేరె స్వర్గమున్!

మాలినీ వృత్తము:
భరత వర భటాఢ్యా! భవ్య సన్మానితార్యా!
ఖరకర సమ తేజా! గమ్య దాతృత్వ బీజా!
మరణ రణ వినోదా! మాతృ దాస్యాపనోదా!
సరవి నిడుదు జేజే! జాతి నేతాజి జేజే!

-:శుభం భూయాత్:-

గురువారం, ఫిబ్రవరి 20, 2014

సమస్య: వచ్చిన పని సఫలమయ్యె వైరము హెచ్చెన్

తేది: జూలై 18, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణముమెచ్చియు శశాంకుఁ జెంతకు
వచ్చెను తారయు రయమున, వద్దని శుక్రుం
డిచ్చెను శాపము; తారకు
వచ్చిన పని సఫలమయ్యె; వైరము హెచ్చెన్!

సోమవారం, ఫిబ్రవరి 17, 2014

సమస్య: భాష రానివాఁడె పండితుండు

తేది: జూలై 17, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


సకల శాస్త్ర విదిత సద్‍జ్ఞాన  యుక్తుండు,
సకల కావ్య సుపరిచయ యుతుండు,
సకల జనులకును దొసఁగుఁ గూర్చునట్టి దు
ర్భాష రాని వాఁడె పండితుండు!

ఆదివారం, ఫిబ్రవరి 16, 2014

సమస్య: ఈఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

తేది: జూలై 16, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


ఆ తఱి యిన నిభ తనుఁడై
సీతా లక్ష్మణుల తోడ శ్రీ రాముఁడు నా
రాతి రట విడిది సేయఁగ
నీఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

పద్య రచన: అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము

తేది: జూలై 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


తే.గీ.
భీష్ము నస్త్ర సన్యాసమ్ము వెనుకె ద్రోణుఁ
డపుడు సర్వ సైన్యాధ్యక్షుఁ డగుడుఁ దీవ్ర
యుద్ధ తంత్రములను బన్ని యోధ ముఖులఁ
గూల్చు చుండఁగఁ గృష్ణుండుఁ గుతిలపడియు;

కం.
'వేఁడి గల యెత్తుగడచే
నేఁ డీతని నిలువరింప నేరక యున్నన్
జూఁడున్ సైన్యం బంతయుఁ
దూఁడరి సేఁతల యుపేక్ష దోసము గాదే?'

తే.గీ.
అనుచు యోచించి, 'ద్రోణుండు తనయు మరణ
మునకు మనఁ జాలఁ' డనుచు భీమునికిఁ జెవిని
వినిచె నిట్లు "నశ్వత్థామ యను గజమును
గూల్చి, యెలుఁగెత్తి చాటుము 'గూలె' ననియు!"

మ.
అనఁగ న్వాయుసుతుండు వేగిరమె యా హస్తీంద్రముం జేరియున్
ఘనవృష్ట్యుత్కట ముష్టిఘాత హతిచేఁ గౌరవ్య సేనా తతుల్
దను వీక్షింపఁగఁ జంపి, బిగ్గఱఁగఁ దా దర్పోద్ధతిం బల్కె నా
వనజాక్షుండు వచించినట్లుగనె, యశ్వత్థామ సంహారమున్!

ఆ.వె.
భీముఁ డట్లు వల్క, విని నమ్మకుండఁగా,
నఱచె ధర్మతనయుఁ డంత లోన,
"సత్య మిదియ సుమ్ము! చచ్చె నశ్వత్థామ!!"
యనియుఁ; జిన్నఁగాను "హస్తి" యనియు!

ఆ.వె.
ద్రోణుఁ డద్ది వినియు రోదించుచును దన
శర శరాసనములఁ జాఱ విడిచె!
ద్రుపద పుత్రుఁ డపుడు ద్రోణుని వధియించెఁ;
గృష్ణుఁ డంత శాంత హృదయుఁ డయ్యె!

(ఇది అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము)

గురువారం, ఫిబ్రవరి 13, 2014

సమస్య: కోటి కంటె నొకటి మేటి గాదె

తేది: జూలై 15, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


ఒకటఁ గోటి సైన్య; మొకట శ్రీకృష్ణుండు;
'మాట' సాయమ! 'అని' మాట సున్న!
భండనమున గెలుపు పార్థసారథి యిడఁ
గోటి కంటె నొకటి మేటి గాదె?

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

పద్య రచన: మేఘ వ్యాపనము

తేది: జూలై 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
తే.గీ.
వ్యాపన మ్మయె నాకాశ పథము నందు
వార్షుకాభ్రమ్మొ, శారదాభ్రమ్మొ యిదియ?
వార్షికపు మేఘ మైనచో వర్ష మేది?
యిల శరన్మేఘ కాల మహిమ మిదేమొ?! (1)

ఆ.వె.
ప్రిదిలె జవము, శక్తి, గ్రీష్మాతపమ్మునఁ;
బ్రజలు వేచి యుండ్రి వర్షమునకు!
పంట పండు టదియ పదివేలు, లక్షలు;
కాల మహిమ మేమొ కానరాదు! (2)

కం.
చిను కొకటి రాలఁ గానే,
వెనుకటి యుత్సాహ మెలమి పెల్లుబుకంగన్,
మును ముందు కేఁగు రైతుకుఁ
జిను కిట్టుల నాగఁగాను చెడు కాలమ్మే? (3)

ఆ.వె.
గంపె డాశ తోడఁ గనిపెట్టుకొని యుండ,
వాన రాదు పంట పండు కొఱకు;
పంట పండ కున్న నింట వంటయు సున్న;
వంట సున్న యైన బలము సున్న! (4)

జలద వృత్తము
న్యాయము నీకుఁ గాదు;మరియాదయుఁగా;
దీయఁగ రావె వర్షమును నీ క్షణమే;
మాయును బాధ లో జలదమా, మహిలో
శ్రేయము లెల్ల మా కిడఁగఁ జేతు నతుల్! (5)

మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

పద్య రచన: అపురూపమైన బాల్యం...ఇలా...

తేది: జూలై 13, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రానికి నేను రాసిన పద్యములు


ఆ.వె.
పేదఱికపు శాప మే దారిఁ బట్టెనో
చూడఁ జూడ నదియుఁ జోద్య మాయె!
చిన్న బిడ్డఁ డిట్టు లెన్నియుఁ బని సేయ;
బాల కార్మికుఁ డన వలదె నేఁడు?


తే.గీ.
ఆ కుటుంబ మందు నందఱుఁ బని సేయఁ
గడచు దినము, మిగుల గడ్డు దినము!
పిల్లవాండ్రుఁ గూడఁ బెద్ద పనులు సేయ
వలసి రాఁగ నదియ ప్రభుత తప్పు!


కం.
చదువఁగ వలసిన వయసున
బ్రదుకఁగఁ బని సేయఁగాను వలసెను, కట్టా!
యిది యేమి కాలమయ్యా?
మది రోసెడి ప్రభుత తీరు మారఁగ వలయున్!


ఆ.వె.
కనుక, ప్రభుత ధనము ఖర్చు చేసితి మంచుఁ
బ్రగతి లేక; మిగుల సుగతిఁ గనక;
బాలకార్మికులను బడిఁ జేర్పఁగా లేక;
ధనము ఖర్చు సేయ, ధర్మ మగునె?


కం.
ప్రతి యింటికి వలసిన పని
సతతము నిడి బ్రతుకు బాటఁ జక్కఁగ వేయన్;
గతి చక్కఁ బడును; పిల్లలు
మితి లేకయ చదువుకొండ్రు మీఱిన తమితోన్!


సోమవారం, ఫిబ్రవరి 10, 2014

పద్య రచన: సీతాపహరణ ఘట్టము

తేది: జూలై 13, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


కం.
సురుచిరమగు జొంపమ్ముల
నురు గతితోఁ దినుచు మఱల నుఱుకుచుఁ దమితోఁ
దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్.

తే.గీ.
సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త,
"నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
బెంచుకొన మనసాయెను బ్రియము తోడఁ
దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!"

ఆ.వె.
అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
"వద్దు వదిన! యీ సువర్ణ హరిణ;
మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
నిది ప్రమాదకరము! హితము గాదు!!"

తే.గీ.
అన్న లక్ష్మణు మాటల నాలకించి,
రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను రమణి సీత
కోరు తొలి కోర్కి తప్పక తీర వలయుఁ;
బోయి వైళమ దెచ్చెద మాయ లేడి!

కం.
మాయయినఁ బటాపంచలు
సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్;
వేయును మాట లిఁకేలా?
పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయె త్వర గతిన్.

ఆ.వె.
సీత సంతసించె శ్రీ రాముఁ డా జింకఁ
బట్టి తెచ్చు నంచుఁ బరవశించి;
లక్ష్మణుండు కన్నులందున సంశయ
మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!

తే.గీ.
అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యట
రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకును"

కం.
అని సీత వల్క లక్ష్మణుఁ
డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!"

ఆ.వె.
మఱది మాట వినిన మానిని సీత తా
నెంతొ వగచి యతని నింద సేయ;
హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
"గీత దాట" కనుచు, గీసి వెడలె!

తే.గీ.
రావణుఁడు యోగి వేషాన రమణి సీత
కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
దాట రాకున్కి, సీతయె దాటి రాఁగ,
నపహరించెను హతవిధీ, యా రమణిని!

(ఇది సీతాపహరణ ఘట్టము. స్వస్తి.)

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

సమస్య: తండ్రి నేర్పు విద్య తప్పు గాదె

తేది: జూలై 11, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


(ప్రహ్లాదుని విష్ణుభక్తి పుష్ప సుగంధము లానుటచే ప్రభావితులైన రాక్షస బాలకుల సంభాషణ)
సుగంధి వృత్తము:
"ఖేద మంది యున్న వారి కేను ది" క్కటంచు నా
మోద మంది తేర్చు విష్ణుమూర్తి భక్తుఁ డైన ప్ర
హ్లాదుచేఁ బఠింప, రాక్షసాధిపుండునౌ నస
ద్వాది, తండ్రి, నేర్పు విద్య తప్పు గాదె సోదరా!

శనివారం, ఫిబ్రవరి 08, 2014

సమస్య: మాట తప్పువాఁడు మంచివాఁడు

తేది: జూలై 10, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన పూరణము


భాష పైన గొప్ప పట్టున్న పండితుం
డతఁడు మాట లాడ నమృత మొలుకు!
వాని మాట పసిఁడి! వానికి లేదయ్య
మాట తప్పు! వాఁడు మంచివాఁడు!!

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

పద్య రచన: రూపాయ బిళ్ళ

తేది: జూలై 10, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


పైస లోన నుండు పరమాత్ముఁ డిల లోన;
ధనమె మూల మయ్యె ధరణి లోన;
డబ్బు లేని వాఁడు డుబ్బుకుఁ గొఱ గాఁడు!
కాన, గూడఁబెట్టఁ గలుగు సుఖము!!

కులము గొప్పదైన; గోత్రోత్తముండైన;
విద్య యున్న; సద్వివేకమున్న;
ధనము గల్గు వాని దాసునిగా మాఱి,
సతము సేవఁ జేయు నతఁడు, నిజము!

రూపాయియె పరమార్థము;
పాపములను జేసి యైనఁ బైసను బెంచన్
దాపత్రయ పడుచుందురు;
రూపాయీ, నీకు నతులు! ప్రోవుము జనులన్!

గురువారం, ఫిబ్రవరి 06, 2014

సమస్య: తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల

తేది: జూలై 09, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


నేఁటి తలిదండ్రు లెంతయో నిష్ఠ తోడ
నాంగ్ల మాధ్యమ విద్యల నందఁ జేయఁ
దెలుఁగు మాట్లాడుటయె యప్రతిష్ఠ యనుచుఁ
దల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల!

బుధవారం, ఫిబ్రవరి 05, 2014

సమస్య: వంటఁ జేయలేనివాఁడు మగఁడె?

తేది: జూలై 08, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


(శివపార్వతులను కలుపుటకై కబురంపిన ఇంద్రునితో మన్మథుడు పలికిన మాటలు)

చివురు లెత్తఁ బ్రేమ శివపార్వతులలోన
నిపుడు వేతు నేను నిట్టి బాణ
మిదియ పూవుటమ్ము నిది వేసి యా తను
వంటఁ జేయలేనివాఁడు మగఁడె?

సోమవారం, ఫిబ్రవరి 03, 2014

పద్య రచన: మల్లికా కుసుమం

తేది: జూలై 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యముశారదాభ్రేందు కుంద మందార ఫేన 
కాశ ఘనసార హిమనగాకార ధవళ
వర్ణ మాత సరస్వతి, వాణి నేఁడు 
మల్లెపూవులఁ జూడంగ మదిని మెదిలె! 

శనివారం, ఫిబ్రవరి 01, 2014

సమస్య: పట్టు నాజానుబాహువే ప్రభువు నాకు

తేది: జూలై 06, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములుతే.గీ.
కమల పత్రాక్షుఁడు, శుభ లక్షణుఁడు, ధర్మ
రక్షకుఁడు, నీల వర్ణుండు, రఘు కులుండు,
పతిత పావనుం, డసురారి, బలునిగఁ గను
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు! (1)కందము :
అబలఁ జెఱ నిడిన దశకం
ఠుఁ బిండి సేయుటకుఁ  దా ధనుర్బాణములన్
సబలుఁడయి పట్టు నాజా
ను బాహువే ప్రభువు నాకు నుతియింపంగన్! (2)తే.గీ.
మాయ సన్యాసియై భిక్ష వేయు మనియు
మోసమున సీతఁ జెఱపట్టు మూర్ఖుఁ డైన
రావణుని వధింపఁగ ధనుర్బాణములను
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు! (3)