తేది: జూలై 06, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములు
తే.గీ.
కమల పత్రాక్షుఁడు, శుభ లక్షణుఁడు, ధర్మ
రక్షకుఁడు, నీల వర్ణుండు, రఘు కులుండు,
పతిత పావనుం, డసురారి, బలునిగఁ గను
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు! (1)
కందము :
అబలఁ జెఱ నిడిన దశకం
ఠుఁ బిండి సేయుటకుఁ దా ధనుర్బాణములన్
సబలుఁడయి పట్టు నాజా
ను బాహువే ప్రభువు నాకు నుతియింపంగన్! (2)
తే.గీ.
మాయ సన్యాసియై భిక్ష వేయు మనియు
మోసమున సీతఁ జెఱపట్టు మూర్ఖుఁ డైన
రావణుని వధింపఁగ ధనుర్బాణములను
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు! (3)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి