Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 31, 2013

దత్తపది: చెక్కు - సైను - మనీ - డ్రా ..భారతార్థం...స్వేచ్ఛా ఛందం

తేది: డిసెంబర్ 30, 2013 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన ఇచ్చిన
చెక్కు-సైను-మనీ-డ్రా పదాలను ఉపయోగించి,
భారతార్థంలో నచ్చిన ఛందంలో రాయమనగా
నేను రాసిన తేటగీతి


(బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగా, ద్రుపదమహారాజు మెచ్చుకొన్న సందర్భము)

"నేనె విలుకాఁడఁ జూడుఁ"డంచెక్కుపెట్టి,
సొగసై, నునుపైన విశుద్ధ మత్స్య
యంత్రమునుఁ గొట్ట, "నెంత నియమమ నీకు,
బ్రాహ్మణా!"యనె ద్రుపదరా, డ్రాజసమున!

(చివరి పాదమును బ్రాహ్మణా!" యనె ద్రుపదరా, డ్రామ నిడుచు! అని కూడా చదువుకొనగలరు)
  

ఆదివారం, డిసెంబర్ 29, 2013

సమస్య: వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ

తేది: జూన్ 10, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన 
కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...
(ಅಬ್ಧಿಯೊಳು ಮುಳುಗಿದನು ಭಾಸ್ಕರನುರಿವಬಿಸಿಲಿನೊಳ)
ఇచ్చిన సమస్యకు నా పూరణము


తనదు వరపుత్రకుండును దానగుణుఁడు
స్నేహశీలుండు, కర్ణుండు నాహవమున
నర్జునుని చేత హతమొందినపుడు శోక
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ!

శుక్రవారం, డిసెంబర్ 27, 2013

సమస్య: కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసంబునన్

తేది: జూన్ 09, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


ఆ కురుభూమియందు ఘనుఁ డర్జునపుత్త్రుఁడు, ద్రోణముఖ్య నూ
త్నైక విచిత్ర పద్మరచనమ్మును భేదనఁ జేసి, పోరఁగాఁ,
గాకలుదీరు వీరతనుఁ, గష్టముతోడుత యుక్తిఁ బన్ని, యే
కాకినిఁ జంపి, కౌరవులు గర్జన సేసిరి, సంతసంబునన్!

బుధవారం, డిసెంబర్ 25, 2013

పతిపైనన్ పరమసాధ్వి పాదము మోపెన్

తేది: జూన్ 08, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


సతి ప్రేమ యెవరిపైనన్?
పతినే సేవించు నెవరు భక్తిని? బలి స
మ్మతి హరి యెది మోపెఁ దలను?
పతిపైనన్; పరమసాధ్వి; పాదము మోపెన్!

సోమవారం, డిసెంబర్ 23, 2013

సమస్య: రాముఁడు సేయలేని పనిరా కపు లెల్లరకున్ సుసాధ్యమే

తేది: జూన్ 06, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


వేమరు కుప్పిగంతులును, వీక్షణలో చిటిలింపు, వాలముల్
పాముల వోలెఁ ద్రిప్పుటలు, పండ్లికిలింపులు, నెత్తి గోఁకుటల్, 
నీమముతోడ నిక్కుటలు, నిత్యము కొండలు చెట్టు లెక్కుటల్ 
రాముఁడు సేయలేని పనిరా! కపు లెల్లరకున్ సుసాధ్యమే! 

ఆదివారం, డిసెంబర్ 22, 2013

సమస్య: కారము లేకున్న కావు కార్యము లెందున్

తేది: జూన్ 05, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము

   

ధారుణి నెచ్చటఁ జూచిన
వీరమునను లంచ మెదిగి, విశ్వాకృతినిన్
ధారణఁ గొనె! ధనసాక్షా
త్కారము లేకున్న కావు కార్యము లెందున్!!


మంగళవారం, డిసెంబర్ 17, 2013

సమస్య: కనులు లేనివాఁడు కన్నుగొట్టె

తేది: జూన్ 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


కలికి కానుపింపఁ, గామాంధుఁ డయ్యు నా
కనులు లేనివాఁడు కన్ను గొట్టె!
కని, భరించలేక కలికి కాళిక వోలె
వచ్చి, వాని చెంప వాయఁగొట్టె!

(కామంతో కన్నులు మూసికొనిపోయినవాఁడు కనులు లేనివాఁడే కదా!)

ఆదివారం, డిసెంబర్ 15, 2013

పద్య రచన: ద్రౌపదీ వస్త్రాపహరణం

తేది: జూన్ 28, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నా పద్యము

జూదములోన నోడె యమసూనుఁడు! పందెము గెల్చి, తమ్మునిన్
మోదముతోడ ద్రోవదిని మూర్ఖసుయోధనుఁ డీడ్చి తెమ్మనన్,
బైదలి నీడ్చి తెచ్చి, సభవాకిట నిల్పియు, వస్త్ర మూడ్చె! దా
మోదరుఁ డంత వస్త్రముల మోదముతో నిడి కాచె ద్రౌపదిన్!

శుక్రవారం, డిసెంబర్ 13, 2013

సమస్య: సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్


ధరణికి విష్ణువరమ్మున
నరకుఁడు జన్మించి స్త్రీల నయదూరుండై
తరువిడె నఁట చోద్యముగా!
సురభికి జన్మించె ఖరము చోద్య మెటు లగున్?

(తరువిడు = నిర్బంధించు)


మంగళవారం, డిసెంబర్ 10, 2013

సమస్య: తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్

తేది: జూన్ 02, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము


అనలాంబకు, నభవు, శివునిఁ,
ద్రినయను, బాలేందుమౌళిఁ, ద్రిపురారిఁ, బినా
కిని, సర్వజ్ఞుఁ, గృపా భరి
త నయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్!

ఆదివారం, డిసెంబర్ 08, 2013

సమస్య: రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్

తేది: జూన్ 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము

 

లీలం బిల్లలు చేరి ర
సాలముపై రాలు విసరఁ జక్కని ఫలముల్
చాలఁగ నిడు! దైవ మటులె
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్!

గురువారం, డిసెంబర్ 05, 2013

సమస్య: వికలాంగుఁడు రథము నడిపె వినువీథి పయిన్


తేది: జూన్ 11,2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణమ

       

కికురించి రావణియె మా
యకు దిగి రథము వినువీథియం దిడె! సౌమి
త్రి కినిసి, స్థపతి చెయిఁ దఱుగ,
వికలాంగుఁడు రథము నడిపె వినువీథి పయిన్!

(రావణి = ఇంద్రజిత్తు; స్థపతి = సారథి)

ఆదివారం, డిసెంబర్ 01, 2013

పద్యరచన: భిక్షుక వేదన!

తేది: జూన్ 29, 2012 నాటి శంకరాభరణంలోని
పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రానికి
నేను రాసిన పద్యములు


బ్రతికితి మున్ను డబ్బు గలవానిగ; గర్వముతో దరిద్రులన్,
మెతుకు విదుల్పకుండ, మఱి మిక్కిలి పాఱఁగఁ ద్రోలి, నవ్వితిన్!
హితము గనంగలేక, మద మెక్కియు, నెన్నఁడు దానధర్మముల్
మతిఁ దలఁపన్ సహింపకయె, మాన్యత వీడితి పుణ్యదూరునై!


బిచ్చగాండ్రను రాకుండ వెడలఁగొట్టి
పిసినితనమున ధనమును విరివిగాను
కూడఁబెట్టితి; నేనును గుడువకుండ!
దానహీనుఁడ నయ్యును, ధనికుఁ డైతి!


ఇటుల రాత్రి పగలు హెచ్చగు మోహాన
తిండి తినక, ధనము దీక్షతోడఁ
గాయుచుంటి మిగులఁ గాపలదారుగా;
నొక్కనాఁ డలసితి మిక్కుటముగ!


నిదురింప, నొక్క చోరుం
డది గమనించియును నచటి నా ధనమంతన్
వెదకి వెదకి మొత్తము తన
మది మెచ్చఁగ దోచుకొనెను; మట్టియె మిగిలెన్!


నాఁటి నుండియు నేఁ బేదనైతి వినుఁడు!
ధనము, గర్వము తొలగించె దైవ మపుడు!
దానధర్మాలు సేయక ధనము నెపుడు 
కూడఁబెట్టి, కావలదు భిక్షుకులుగాను!!