Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, నవంబర్ 28, 2013

పద్య రచన: శ్రీ కృష్ణ దేవరాయలు

తేది: జూలై 06, 2012 నాటి శంకరాభరణంలోని

పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు

నేను రాసిన పద్యములు

సీ.
అష్ట దిగ్గజ కవు లాహ్లాదమును గూర్చ
......భువన విజయ మేలు భూపుఁ డెవఁడు?
ఆముక్త మాల్యద నలవోకగా రచి
......యించి, యాంధ్ర కవుల మించె నెవఁడు?
జాంబవ త్యుద్వాహ సత్యావధూ ప్రీణ
......నముల సంస్కృతమున నడపె నెవఁడు?
దేశ భాషల యందుఁ దెలుఁగు లెస్స యటంచు
......నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?

గీ.
అతఁడె మూఱు రాయర గండ; యాంధ్ర భోజ;
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదు లందియు, వెలిఁగిన వీర వరుఁడు;
నతఁడె శ్రీకృష్ణదేవరాయలు ఘనుండు!


కం.
ఇరు ప్రక్కల దేవేరులు
మురిపెముఁ దీర్చంగ నడుమ మోదము తోడన్
వర విగ్రహ రూపెత్తెను
దిరుమల వేంకట నగేశు దేవళ మందున్!


తే.గీ.
తెలుఁగు భాషను సత్కావ్యములును వెలయఁ
గవులఁ బోషించి, మించి, సత్కార మెలమిఁ
జేసి, సభలోనఁ బ్రజల రంజింపఁ జేసి,
కృష్ణ రాయఁడు స్వర్ణ యుగేంద్రుఁ డయ్యె!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి