Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 06, 2013

పద్య రచన: క్షీర సాగర మథన వృత్తాంతము...


తేది: ఆగస్టు 16, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన కూర్మావతారం చిత్రమునకు నేను రాసిన పద్యములు...
ఆ.వె.
దేవ దానవులును దీవ్రమౌ యుద్ధాన
మరణ మందుచుండ; మాధవునకు
విన్నవించఁగాను విష్ణుండు "క్షీర సా
గర మథనము సేయఁగా వలె" ననె!(1)


తే.గీ.
పాల సంద్రాన మంథర పర్వత మిడి,
వాసుకినిఁ గవ్వమునుగ దేవతలు దాన
వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి పోవ నదియుఁ;
గలఁతఁ జెంది, హరినిఁ జేరి, తెలుపఁ గాను;(2)

కం.
చిఱు నగవున విష్ణు వపుడు
కరుణను దాఁబేటి మేటిగా మాఱియు, మం
ధరమును వీపున మోయఁగఁ;
దరచిరి యా పాలకడలిఁ ద్వరితోత్సుకతన్!(3)

తే.గీ.
కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ దొలుతఁ బుట్టె
హాలహల; మది దహియింప; నందఱు హరు
శరణ మర్థించి, రప్పుడు శంకరుండు
గరళముం ద్రాగి, యంత శ్రీ కంఠుఁ డయ్యె!(4)

తే.గీ.(పంచపాది)
ముదముతో వారుఁ ద్రచ్చంగ మొదట కామ
ధేను వుదయించఁగ వశిష్ఠుఁ డెలమిఁ గొనియెఁ;
ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావతములు, కల్ప
వృక్ష మప్సరసల నింద్రుఁ డా క్షణమ్మె
కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ గొనియె హరియు!(5)

కం.
చివరకు సురాసురులు వెను
దవులగఁ గోరిన యమృతము ధన్వంతరియే
ధవళ రుచులుఁ బ్రసరించఁగ
నవు మోమున విష్ణు మ్రోల నప్పుడ యుంచెన్!(6)

ఆ.వె.
దేవ దానవులును దీవ్రమౌ తమితోడ
"మాకు మాక"టంచు మత్సరించి,
వాదు లాడుచుండ వైకుంఠుఁ డప్పుడు
మోహినిగను మాఱి ముందు నిలిచె!(7)

తే.గీ.
వారి కప్పుడు మోహిని పలికె నిట్లు,
"వినుఁడు! నే నీ యమృతమునుఁ బ్రేమ మీఱ
మీకు నందఱకును వంచి, మిమ్ము నమరు
లనుగఁ జేసెద! నాసీను లగుఁడు నిచట!"(8)

కం.
ఇది విన్న దేవ దానవు
"లదియే వర"మనుచు నటులె నటఁ గూర్చుండన్;
సుదతి యమృతము సురల కిడె;
నిది రాహువుఁ గేతువునుఁ గనిరి సురల కిడన్! (9)

ఆ.వె.
కనియు సురల చివరఁ జని, వారు కూర్చుండ;
మోహినియును వంపె మోద మలర!
సూర్య చంద్రు లిదియు సూచించ నా చక్రి,
గొంతు దిగక మునుపె, గొంతుఁ ద్రెంచె!(10)

ఆ.వె.
కంఠమం దమృతము గల రాహు కేతుల
తలలు బ్రతికె! మొండె మిలనుఁ జచ్చె!
గ్రహణ మందు చుండ్రు రాహు కేతువు లెప్డు
శశిని, రవిని! కాని, వశులు కారు! (11)

తే.గీ.
ఇటుల దేవత లమరులై పటు తరముగ
రాక్షసులతోడ యుద్ధమ్ము ప్రబలముగను 
జేసి, దనుజుల నిర్జించి, జేత లైరి;
క్షీర సాగర మథనమ్ము క్షేమ మిడఁగ!! (12)

(ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)

       -:శుభం భూయాత్:-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి