ఒక్క నాఁడొక యడవిలో నొక్క బాలుఁ
డజపుఁ; డట గొర్ల మేపుచుండంగ, నొక్క
దొంగ, బాలునిం గనక, తా దొంగిలించి
నట్టి ధనము లెక్కించుకొనంగ సాఁగె! 1
వానిఁ గనఁగానె బాలుండు, వాఁడు దోచు
కొన్న ధనమంత, యుక్తినిఁ బన్ని, దోచఁ
బడిన వారికే యీయంగ వలెనటంచుఁ
దలఁచి, యెలుఁగెత్తి యేడ్వఁ దొడంగె నపుడు! 2
బాలుఁ డట్టు లేడ్చెడి కతం బరయఁగానుఁ
జనియు, "బాలకా! యెందుల కనియు నీవు
నేడ్చుచుంటివి? కారణ మ్మిపుడు నాకుఁ
జెప్పుచోఁ దీర్పఁ గందును! చెప్పు"మనియె! 3
ఏడ్చుచున్నట్టి బాలుండు, నేడ్పు నాపి,
"యయ్య! నా తల్లి యొక గొఱ్ఱె నమ్మి, నాకు
నొక పసిఁడి యుంగరముఁ గొనె నోయి! యదియె
బిగుతుగా లేక, సడలి, బావిం బడెనయ!! 4
ఉంగరము లేక యింటికి నుత్క్రమింప,
నాదు తల్లియె దండించు ననుచు నేను
నేడ్చుచుంటిని!" యనఁగానె, యెంత యేని
నెదను సంతసించి, పసిఁడినిం దలంచి; 5
’అహహ! యేమి నా భాగ్యమ్ము! యాదవార్భ
కుండు పోఁగొట్టు కొన్నట్టి మెండియమును
బావిలో దూఁకియు, వెదకి, పట్టుకొనియు,
"దొరుక లే" దంచుఁ జెప్పి, కొందు నయ దాని!’ 6
అనుచు యోచించి పశ్యతోహరుఁడు వెసను,
"బాలకా! నేను వెదికెద బావిలోన!
వెదకి తెచ్చియు నిచ్చెద ! వ్యథను వేగ
వీడి, యిచ్చటి మూటఁ గాపాడు"మనియు; 7
చెప్పి, బావి నుఱికి, గవేశించుచుండ;
బాలుఁ డా మూటనుం గొని, పల్లెకుఁ జని,
పెద్దలకు జరిగినయట్టి విధము నంతఁ
జెప్పి, వారి తోడుత బావి చెంతకుఁ జనె! 8
వారు నడవిలో నున్నట్టి బావి చెంతఁ
జనఁగ, నింకను నందు నుత్సాహమునను
నుంగరమునకై వెదకుచు నున్న దొంగ
యుంగరముఁ గానక నిరాశ నొంది యపుడు; 9
పైకి వచ్చునంతనె వేగ వచ్చి, యతనిఁ
బట్టి, బంధించి, దోచిన వాని నన్ని
వారివారికి నిడి, శిక్షఁ బఱఁగ నిడిరి!
పిట్ట కొంచెమైననుఁ గూఁత గట్టిది గద!! 10
స్వస్తి