ఒక్క నాఁడొక యడవిలో నొక్క బాలుఁ
డజపుఁ; డట గొర్ల మేపుచుండంగ, నొక్క
దొంగ, బాలునిం గనక, తా దొంగిలించి
నట్టి ధనము లెక్కించుకొనంగ సాఁగె! 1
వానిఁ గనఁగానె బాలుండు, వాఁడు దోచు
కొన్న ధనమంత, యుక్తినిఁ బన్ని, దోచఁ
బడిన వారికే యీయంగ వలెనటంచుఁ
దలఁచి, యెలుఁగెత్తి యేడ్వఁ దొడంగె నపుడు! 2
బాలుఁ డట్టు లేడ్చెడి కతం బరయఁగానుఁ
జనియు, "బాలకా! యెందుల కనియు నీవు
నేడ్చుచుంటివి? కారణ మ్మిపుడు నాకుఁ
జెప్పుచోఁ దీర్పఁ గందును! చెప్పు"మనియె! 3
ఏడ్చుచున్నట్టి బాలుండు, నేడ్పు నాపి,
"యయ్య! నా తల్లి యొక గొఱ్ఱె నమ్మి, నాకు
నొక పసిఁడి యుంగరముఁ గొనె నోయి! యదియె
బిగుతుగా లేక, సడలి, బావిం బడెనయ!! 4
ఉంగరము లేక యింటికి నుత్క్రమింప,
నాదు తల్లియె దండించు ననుచు నేను
నేడ్చుచుంటిని!" యనఁగానె, యెంత యేని
నెదను సంతసించి, పసిఁడినిం దలంచి; 5
’అహహ! యేమి నా భాగ్యమ్ము! యాదవార్భ
కుండు పోఁగొట్టు కొన్నట్టి మెండియమును
బావిలో దూఁకియు, వెదకి, పట్టుకొనియు,
"దొరుక లే" దంచుఁ జెప్పి, కొందు నయ దాని!’ 6
అనుచు యోచించి పశ్యతోహరుఁడు వెసను,
"బాలకా! నేను వెదికెద బావిలోన!
వెదకి తెచ్చియు నిచ్చెద ! వ్యథను వేగ
వీడి, యిచ్చటి మూటఁ గాపాడు"మనియు; 7
చెప్పి, బావి నుఱికి, గవేశించుచుండ;
బాలుఁ డా మూటనుం గొని, పల్లెకుఁ జని,
పెద్దలకు జరిగినయట్టి విధము నంతఁ
జెప్పి, వారి తోడుత బావి చెంతకుఁ జనె! 8
వారు నడవిలో నున్నట్టి బావి చెంతఁ
జనఁగ, నింకను నందు నుత్సాహమునను
నుంగరమునకై వెదకుచు నున్న దొంగ
యుంగరముఁ గానక నిరాశ నొంది యపుడు; 9
పైకి వచ్చునంతనె వేగ వచ్చి, యతనిఁ
బట్టి, బంధించి, దోచిన వాని నన్ని
వారివారికి నిడి, శిక్షఁ బఱఁగ నిడిరి!
పిట్ట కొంచెమైననుఁ గూఁత గట్టిది గద!! 10
స్వస్తి
బాలుడు వేసెను గాలము
రిప్లయితొలగించండివాలుగ పడెనోయి దొంగ బావిని దూకెన్
గొల్లన వచ్చిరి పురజను
లెల్ల !జిలేబీ ! ఖలుండు లెస్సగ దొరికెన్
సావేజిత
జిలేబి
జిలేబీ గారికి ధన్యవాదములు!
తొలగించండిబాలుఁడు దొంగనుఁ బట్టిన
మేలిమి కథనే జిలేబి, మిగుల సరసమై
క్రాలెడి గతి వ్రాసితిరి సు
ధాలిప్త భరితముగాను దండము లివియే!!