ఆ.వె.
వెలసె నిరృతుఁడు మును బింగాక్షుఁ డను బోయ
యయి యహింసఁ బూని యటవి నుండె!
నతని పిన్న తండ్రి యట బాటసారులఁ
గొల్లకొట్టి ధనము కూడఁబెట్టు!(1)
కం.
ఒకనాఁ డతండు నది పా
యక తెరువరిఁ గొల్లకొట్టె ననుచర యుతుఁడై;
"యకటా! ననుఁ గాపాడుఁడు;
నొకఁడనుఁ గాఁ జూచి వీర లొక్కట నన్నున్ (2)
తే.గీ.
దోచుకొనఁ జూచుచుండిరి; తొందరఁగను
నన్నుఁ గాపాడుఁ"డని నంత, నతని కడకుఁ
జేరి, పింగాక్షుఁ డనియె "నో చిన్నతండ్రి!
బాటసారిని విడు" మని వలుకఁ గానె;(3)
కం.
కోపమున, సఖులుఁ జూడఁగఁ
బాపమ్మని యెంచకుండ బాలునిఁ జంపెన్!
శాపమొ, యనుగ్రహమ్మో?
యా పసివాఁ డట్లు చచ్చి, యల నిరృతుఁ డయెన్!!(4)
తే.గీ.
పరుల కుపకారమునుఁ జేసి స్వర్గతుఁడయి,
పుణ్య వశమున నిరృతిగఁ బుట్టి, యష్ట
దిక్పతులలో నొకండయి, స్థిర యశుఁడయెఁ!
బరుల కుపకారమునుఁ జేయ, భాగ్య మిదియ!!(5)
-: శుభం భూయాత్ :-
నైరృతి పూర్వజన్మ వృత్తాంతాన్ని సుందరంగా పద్యబద్ధం చేశారు. చాలా బాగుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండినిర్రుతి కథ చాలా అద్భుతంగా పద్యాలలో పొందుపరచి చెప్పారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు స్వామిగారూ!
తొలగించండి