Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 23, 2013

పద్య రచన: శుచిష్మంతుఁడు వరుణునిగ మారిన కథ


తేది: సెప్టెంబర్ 20, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన వరుణుని చిత్రమును గూర్చి నేను రాసిన పద్యములు...

తే.గీ.
కర్దమ ప్రజాపతికినిఁ గలఁడు పుత్రుఁ
డాతఁడే శుచిష్మంత సమాహ్వయుండు!
నతఁ డొక దిన మచ్ఛోదమన్ దమ్మె యిల్లు
సొచ్చి, తోడి బాలురతోడ నిచ్చకమగు;


ఆ.వె.
ఆట లాడుచుండ నందొక మొసలియు
మ్రింగి జలధి విభు సమీప మిడియె!
నంత నొక్క నాఁడు నట శివభటులును
బాలుఁ గని, "యిదేమి వారిధిపతి?


తే.గీ.
కర్దముని పుత్రుఁ దెచ్చితి? కనఁగఁ దగునె?
తమరు నిట్టి పనినిఁ జేయ ధర్మ మగునె?"
యనఁగ భయపడి, కైలాసమునకుఁ జేర్చ;
శివుఁడు బాలుని నింటికిఁ జేరఁ బంప.



కం.
జనకుని యాజ్ఞనుఁ బడసియుఁ
జని, కాశీ పట్టణమునఁ జంద్ర ధరునికై
యనితరమగు తపమునుఁ జే
సెను; శివుఁడును వచ్చి, సంతసించి వర మిడెన్!



ఆ.వె.
"వత్స! నీకు నిత్తు వరముఁ గోరు” మటన్న
"దేవ! ధన్యు నైతి! త్రిపురవైరి!
'వరుణ పథము' నిమ్ము; వరుణుండ నగుదును!
భూతనాథ! భర్గ! బుధ్న!తుంగ!"



ఉత్సాహము:
కరుణతోడ వరమునిడఁగఁ గాంక్ష తీరె నతనికిన్;
శరపు సిరులఁ గొనియుఁ దాను సాగరేశుఁ డయ్యుఁ దాఁ
గరము వర్ష మిడియుఁ జనులఁ గాచుచుండ నిత్యమున్,
జిర యశమ్ము వడసె! జనులు చేరి, కొలిచి రాతనిన్.



తే.గీ.(పంచపాది)
"జలపతి! వరుణ! సరిదీశ! జంబుక! కప!
కేశ! పాశ్చాత్య! వార్షుభ! పాశహస్త!
ప్రత్యగాశాపతి! విలోమ! వర్ష దేవ!
శ్యామలాపతి! సంవృత్త! సన్నుతు లిడి,
మిమ్ముఁ గొలుతుము! కాపాడు, మేఘనాథ!"


వ.
అనుచు నిట్లు కొలువ, వరుణుఁడు సంతుష్టుఁడై సకాలమున వర్షములఁ గురిపించుచు, వారలఁ గాచుచుఁ దానును సుఖంబుండె.



(సమాప్తము)


-: శుభం భూయాత్ :-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి