Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 13, 2013

నీల ఐరావతము శ్వేత ఐరావతముగ మారిన కథ!

కవి పండితులకు, వీక్షకులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు


తేది: సెప్టెంబర్ 15, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికలో నేను రాసిన పద్యములు.


స్వాగతవృత్తము:
స్వాగతమ్ము దివిజాధిప! దేవా!
వేగ కావఁగదె శ్వేత సువాహా!
భోగభాగ్యములు పొంపిరి వోవన్
దేఁ గదే, మఘవ! దీన దయాళూ!

కరిబృంహితము:
వాసవుఁడ! కరి బృంహితము విని పజ్జ నునుచఁగ, నచ్చరల్
హాసమునఁ గడు భోగముల ఘన హర్షమును నిడఁ బాడ, దు
ర్వాసముని దివి పుష్ప సరమును రంజిలఁగ నిడఁ గాన్కగన్
వీసమయినను లెక్కనిడకయ వేసితివి చవుదంతికిన్!

గంధగజేంద్రము:
చేసెను గంధ గజేంద్రము తానే
వాసనఁ జేరినవౌ భ్రమరాలన్
వే సనకుండను విఘ్నమిడంగన్
బూ సరమందలి పూవులు నల్గన్!

మేఘవిస్ఫూర్జితము:
మునీంద్రుం డా చేష్టన్ సహనము సెడం బూర్ణ సక్రోధనుండై
"యనేకాక్షా! నీవున్ సురగణములున్ యష్టి జీవుండ్రు నయ్యున్,
వినీలమ్మౌ మాతంగ సహితముగన్ విఘ్నముల్ గల్గుఁ గాతన్"
మినుం దాకన్ గంఠధ్వని నుడివెఁ దా మేఘ విస్ఫూర్జితమ్మై!

మత్త (పంచపాది):
శాపమ్ముం దా విని చదిరమ్మున్
గాపట్యమ్మే తన కడ నంచున్
గాపాడం దూఁకెను కలశాబ్ధిన్
శాపో'న్మత్త'న్ గని శరధీశుం
డేపుం జూపెం గరటికిఁ బ్రీతిన్!

ఇంద్రవంశము:
ఇంద్రుండు నా శాపమునే వినంగ "మౌ
నీంద్రా! ననుం బ్రోచియు నీదు శాపమున్
సాంద్రానుకంపన్ మనసారఁ ద్రిప్పి, దే
వేంద్రాదులన్ గావుమ యింద్ర వంశమున్!"

జలదము:
నా విని మౌనియప్డు కరుణాకరుఁడై
తా వరమిచ్చెఁ ద్రచ్చఁగ సుధాబ్ధి కడన్
వేవురు దేవదానవులు పేత్వమునున్
ద్రావఁగఁ దీఱు నంచు జలదమ్ము వలెన్!

ఇంద్రవజ్ర(పంచపాది):
వారంతటన్ వేగమె పాలవెల్లిన్
జేరంగఁ బోయె న్మఱి చిల్క నంతన్
క్షీరాబ్ధిలోఁ జూచిరి శ్వేత దంతిన్
దోరమ్ముఁ బీయూషముఁ దోచె వెంటై
యీరప్డు కీర్తించిరి యింద్రవజ్రల్!

                  -:శుభం భూయాత్:-

2 కామెంట్‌లు: