Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 26, 2013

పద్య రచన: వాయవ్య దిక్పాలక చరిత్రము


తేది: సెప్టెంబర్ 21, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన వాయువు చిత్రమునకు నేను రాసిన పద్యములు...

కం.
పూతాత్ముండను విప్రుఁడు
పూతమనమ్ముననుఁ గాశి పురమందునఁ దా
వీతానుబంధుఁ డయ్యును
జోతలనిడి తపము శివుని స్తుతులన్ జేసెన్! (1)

తే.గీ.
పెక్కు వత్సరములు తపం బివ్విధమునఁ
జేయ, శివుఁడు సంతోషించి, చిత్తమలర
దిక్పతిత్త్వమ్ము, పంచమూర్తిత్త్వ,సర్వ
గత్త్వ, సర్వసత్త్వావబోధత్త్వములిడె! (2)

తే.గీ.
పంచమూర్తిత్త్వగత వాయువయ్యు జనుల
దేహములలోనఁ దానుండి దివ్య జీవ
నమ్ము నిడియును మనల దినమ్ము దినముఁ
గాచుచుండెను ప్రాణమౌ గాలి నిడియు! (3)

కం.
ప్రాణాపానవ్యానో
దానసమానాఖ్య పంచ తత్త్వాత్ముండై
ప్రాణుల లోపల నెపుడున్
దానై నివసించుచుండు దైవమతండే! (4)

ఆ.వె.
ఇట్టి వాయుదేవు నిలఁ బ్రజ నిత్యమ్ము
సకల పూజలందుఁ బ్రకటముగను
బరగఁ బూజ సేయ; వరదుఁడు వాయుదే
వుండు ప్రాణులందు నుండి వెలిఁగె! (5)

వ.
ఇట్లు వాయుదేవుండు ప్రాణులలోను, విశ్వమందునను వ్యాపించి, వాయవ్య దిశఁ బాలించుచుండఁ బ్రజలందఱును నతని నిట్లు స్తుతి సేయందొడంగిరి.(6)

తే.గీ.(మాలిక)
ప్రాణ! మారు! తానిల! సమీర! ప్రసత్వ!
వాత! భూతాత్మ! సంహర్ష! వాయు! శుష్మి!
ఖగ! భృమల! లఘగ! లఘాట! కంపలక్ష్మ!
దర్వరీక! నభోజాత! తత! తపస్వి!
శ్వాస! వేగి! సృదాకు! సర్వత్రగామి!
సతత గతి! పవి! పవమాన! శార! మర్క!
పవన! సప్తమరు! ద్యాతు! ప్రవహ! సరటి!
సమగతి! సదాగతి! స్పర్శ! ప్రముఖ! సూక!
శ్వసన! పృశదశ్వ! సృక!జగత్ప్రాణ! లఘటి!
మాతరిశ్వ! సమీరణ! హే తరస్వి!
మా శరీరమ్ము నందుండి, మమ్ముఁ గాచి,
శ్వాసవై, పంచప్రాణమై, సర్వ కాల
సర్వ విధ శుభకార్య సంస్కార కృతుల
మమ్ము వీడక యుండు మో మారుతాత్మ! (7)

వ.
అని స్తుతించుచుండఁ బవనుండును నత్యంత ప్రమోదుండునై విశ్వప్రజల నందఱను నెల్ల వేళలఁ గాపాడుచుండు. (8)

                           లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!
                               
                                 -:శుభం భూయాత్:-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి