ధరణీ భారము నుజ్జగింపఁగను స్వ♦త్వాంశాస్థ సంభూతుఁడై
చెఱసాలన్ జనియింప నా యమున గూ♦ర్చెన్ దారి వ్రేపల్లెకై
పరఁగన్ నందయశోద లింట నడుగుం ♦ బద్మమ్ములన్ మోపియున్
సరవిన్ బూతన పాలుఁ ద్రావి యుసురుల్ ♦ సర్వమ్ముఁ దాఁ బీల్చి, యెం
దఱు దుష్టాత్ములు నేఁగుదెంచి యతనిన్ ♦ దర్పోద్ధతిం జంపఁగా
విరచింపన్ బలు మాయలన్; విఱిచియున్, ♦ వేగమ్ముగన్ జంపి, సో
దర యుక్తుండయి వ్రేఁత లిండ్లఁ జని దు♦గ్ధమ్మంతయుం ద్రావ, స
త్వర మా బాలుని చేష్టలన్ని తెలుపన్, ♦ దన్మాత యా బాలునిన్
బరమాత్మున్ బసిబాలుఁ డంచుఁ దెలుపన్ ♦ వారందఱుం బోవ, నా
దరమెంతేఁ గనిపింప గోపిక లటన్ ♦ స్త్నానమ్ముఁ జేయంగ, ప
ల్వుర వల్వల్ దగ దొంగిలించియు వెసన్ ♦ భూజమ్ముపై దాఁచఁగన్
బరమాత్ముండని వారలంత కరముల్ ♦ పైకెత్తి దండమ్మిడన్
గరుణాత్ముండయి వారి కిచ్చె వలువల్, ♦ కైమోడ్పులం గొంచుఁ, దా
నరుదెంచెన్ బశుపాలనమ్మునకు స♦ఖ్యాళిం దగం గూడియున్
జిరకాలమ్మట బంతులాఁడు కలనన్, ♦ జిత్రమ్ముగా బంతి యా
సరసిన్ మున్గఁగఁ గృష్ణుఁ డప్డు మడువున్ ♦ జక్కంగఁ దా దూఁకఁగన్
సరసిం గాళియ సర్ప మప్పుడు హరిన్ ♦ జంపంగ నుంకించఁ, దా
నురుహస్తమ్మున ముష్టిఘాత మిడఁగా ♦ నుద్వేగ మెంతేని రా
నురగ మ్మప్పుడు కృష్ణుపైఁ దనదు దం♦ష్ట్రోత్సేక హాలాహలో
త్కరముల్ చిమ్మ యశోద సూనుఁ డపుడున్ ♦ దా వేగ సర్పమ్ముపై
నుఱికెన్ భోగము పైన నెక్కి నటరా♦జోత్తంస విద్వాంస రా
డ్వర నాట్యాంబుధి మున్గి ధింతకిట ధిం ♦ తద్ధింత తద్ధింత ధిం
ధిర ధిమ్మంచును నాట్యమాడ నపుడున్ ♦ దీనుండు కాళీయుఁ డా
దరమొప్పంగను "గావు" మంచుఁ బలికెన్ ♦ దర్పమ్ము సర్పమ్మునన్
దరలెన్; గర్వము ఖర్వమయ్యె, సతులున్ ♦ దర్జించి రా కాళియున్;
గరుణన్ వీడు మటంచుఁ బల్క నపు డా ♦ కాళీయ దర్పోర్జితుం
డురగమ్మున్ విడనాడి దూఁకె భువిపై ♦ దూరీకృతావేశుఁడై;
వరమిచ్చెన్ ’దన పాదముద్రఁ గని వే ♦ పక్షుల్ దొలంగున్ సదా
త్వరఁ బొ’మ్మంచును బల్కి, చేరె సఖులన్ ♦ వర్ణింప నా గాథనున్;
సరసీజాత సునేత్రుఁ డప్డు మఱలెన్ ♦ సభ్రాతృమిత్రాదుఁడై;
కరియానల్ మురళీరవమ్ము వినియున్ ♦ గానామృతమ్మానఁగన్
దరహాసాంబుధి ముంచి తేల్చి, దయతోఁ ♦ దన్వంగులం గూడి, వే
గిరమే కంసుని ప్రోలికిం జనియుఁ గ♦ల్కిం గుబ్జనున్ వేగ సుం
దరిగన్ జేసియు, హస్తిఁ దున్మి, జనుల♦త్యాదృత్యుదారాత్ములై
వఱలన్ జాణుర ముష్టికాఖ్యుల వధిం♦పన్ యుద్ధముం జేసి కూ
ల్చి రణౌత్సుక్యునిఁ గంసుఁ జంపియును ద♦ల్లిందండ్రినిన్ జేరి వే
చెఱసాలన్ వెడలించి, కొల్చి, మురిపిం♦చెన్ సేవ లందించియున్;
సరసీజాక్షిని రుక్మిణీ మణిని హృ♦త్స్థానమ్మునందున్ దగన్
బరిగృహ్యాంచితగా నొనర్చి వరుసన్ ♦ భార్యాష్టకుండయ్యు, స
ద్వరదుండయ్యెను పాండుభూపు తనయుల్ ♦ ధర్మాత్ములై కొల్వఁగన్
నరు సారథ్యముఁ జేసి కూర్మి సలహా ♦ నందించి గెల్పొందఁగన్
కురువీరుల్ తమయంతఁ దాము తొలఁగన్ ♦ గోపాలుఁడే పూని యు
ర్వరనున్ గెల్వఁగఁ జేసెఁ; బుట్టి ముసలం♦బా యాదవామ్నాయమున్
బరిమార్పన్ సమకట్ట, నప్డు, మునిశా♦పమ్మున్ మదిం గాంచియున్
జరియింపంగను లేక తాను వనిలో ♦ శయ్యావిలోలుండయెన్;
శరమున్ వేయఁ గిరాతుఁ డొక్కఁ డట, వి♦శ్వాకారుఁ డా వెంటనే
సరవిన్ జన్మ సమాప్త మౌట, వెడలెన్ ♦ సర్వేశుఁ డా చక్రియున్
వర వైకుంఠముఁ జేరె! నట్టి ఘనుఁడౌ ♦ పక్షీంద్ర యానుండు శ్రీ
హరి విశ్వాత్ముఁడు పద్మనాభుఁడు నిలిం♦పారాతివైరుండు శా
ర్ఙ్గి రమానాథుఁడు పాంశుజాలికుఁడు పుం♦డ్రేక్షుండు మమ్మోమెడున్!
-:శుభం భూయాత్:-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి