మ.
నవనీతాంచిత మానసుండు, సుజనుం డౌ శంభుదాసుండు, శ్రీ
శివపాదాంబుజసక్తచిత్తయుతసంసేవాప్రశస్త్యభ్యసో
ద్భవ కైవారవిశేష పాఠనుఁడు, శుంభద్గ్రంథ సల్లేఖనా
సువిచారుం డయెఁ దాఁ బ్రబంధ పరమేశుం డెఱ్ఱనార్యుండిలన్!
ఆ.వె.
శివుని భక్తుఁడయ్యుఁ, జిత్తమ్మునందున
రామవిభుని గాథ వ్రాయఁ దలఁచి,
ప్రథమ కృతిగఁ దాను రామాయణమ్మును
బ్రచురపఱచె భువిని రమ్యముగను!
ఉ.
భాగవతప్రశస్తిఁ బ్రజఁ బావన మానస వీథులన్ బ్రశం
సాగత రీతి నిల్పఁగను, స్వాగతముం దెలుపంగఁ బూనియున్,
వాగధిదేవతాప్తి హరివంశ సుకావ్య సయుగ్మ భాగ స
ర్వాగమ దీప్తులుం గుఱియ వ్రాసెను సత్కవిలోక మెన్నఁగన్!
తే.గీ.
హరిహరాద్వైత భావ సంయమివరుండు,
పండితుఁడు, గురుభక్తితత్పరుఁడు, వినయ
సంభరితుఁడు, సద్ధృదయుండు, సంతరించెఁ
బఱఁగ భారతారణ్యపర్వావశిష్ట
మెలమి నన్నయ్య తిక్కన్న నిల నుతించి!
తే.గీ.
నన్నయ కృతినిఁ జదివి, యెఱ్ఱన్నఁ జదువ,
నదియ నన్నయ వ్రాఁతయౌ ననియ తోఁచుఁ;
దిక్కన కృతిఁ బఠించి, యిద్దియ పఠింప,
నదియుఁ దిక్కన వ్రాఁతయౌ ననియుఁ దోఁచు!
కం.
గంగా యమునా సములె య
నంగను నన్నయయుఁ దిక్కనార్యుల నడుమన్
సంగమ రూపము నెఱ్ఱన
యుం గొనెను సరస్వతీ ప్రయుక్త నదమ్మై!
ఉ.
స్థిత్యునిఁ దా నహోబిలనృసింహునిఁ గొల్చుచు, నిష్టదైవమౌ
సత్యుఁడు సుందరుండు శివసన్నిభుఁడైన నృసింహ రూపునిన్,
బ్రత్యహపాఠనమ్మునకు బాటలు వేయఁగ, భక్తితోడ, నౌ
చిత్యముతోడ వ్రాసెను నృసింహపురాణ విశిష్టకావ్యమున్!
తే.గీ.
ఎఱ్ఱనార్యుఁ డెంతయు సౌమ్య హితవరుండొ,
యెఱ్ఱనార్యు కవిత సౌమ్య హితవరియయి,
విశ్వవిఖ్యాత మాధుర్య వీక్షితయయి,
హృద్యసుమనోహరమ్మయి ప్రీతినిడును!
తే.గీ.
ధన్య పుణ్యకథాప్రబంధంపు రీతి
మనుచు, పౌరాణికపు దివ్యమార్గమునను
నడచి, కావ్యంపు యశమంది, నవ్యమైన
భావనలనందఁజేయు సవ్యమ్ముగాను!
కం.
ఓ యెఱ్ఱన! నిను మదినిడి
ధీయుతులై మనిరి కావ్యధీమంతు లిలన్!
మాయురె! కవితావైభవ
మే యిల నిలిచెనుర! నీ కమిత వందనముల్!
స్వస్తి
శనివారం, మే 09, 2020
ప్రబంధ పరమేశ్వరుఁడు ఎఱ్ఱన
లేబుళ్లు:
పద్య రచన,
సంస్మరణములు,
సాహితీ మధువనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి