Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 03, 2016

గిజిగాఁడు...


చం.
తగఁ జని తుమ్మకొమ్మలకొ తాళ కుజాలకొ యీఁత చెట్లకో
తగులఁగఁ జేసి గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!! 1


తే.గీ.
అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
గగనసీమను విహరించు గౌరగృహమొ?? 2


ఆ.వె.
సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
మో యదంచు జనులు మోహమంద!
నందమైన యట్టి యానంద నిలయమ్ము
కాదె చూడ నదియు కాంక్ష మీఱ? 3


తే.గీ.
అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
యాటపాటల వైఖరి యచ్చెరు విడు! 4

తే.గీ.
గూండ్లఁ జిన్ని పిట్టలు తమ గోల లెగయ;
భూనభోఽంతరాందోళికా భోగ సహిత
సూక్ష్మ గేహాంతర స్థిత శోభ వెలయ
నూఁగులాడుచుండును తూఁగుటూయలట్లు! 5


శా.
ఏదేనొక్క పృదాకు వేఁగఁ గని తా మెంతెంతయో నార్చుచున్
బో దాఁకన్ ఘనమైన రీతిగను శబ్దోచ్చారణమ్ముల్ దగన్
నాదౌద్ధత్యముఁ జూపి తత్తఱలఁ బెంచంగానె యా సర్పమున్
నాదారెద్దియటంచుఁ బర్వులిడు నా నైపుణ్యముం గాంచితే? 6

ఆ.వె.
శిరసు పైన స్వర్ణ శీర్షకమ్మున్నట్లు
పసుపు వన్నె మిగుల బంగరువయి,
చిబుక చూచుకములు చిక్కనౌ నలుపయి,
నీలి గోధుమ బరి నెఱక లొలయు! 7


తే.గీ.
బిడ్డలకుఁ దిండిఁ బెట్టెడి పెద్దఱికమె
యింతులకు బాధ్యతగఁ దగ నిడియు; గూఁడు
నేర్పుగాఁ గట్టు బాధ్యత నెలమి మగఁడు
కొనియు మెలఁగు చుండును భార్య మనము నెఱిఁగి! 8

ఆ.వె.
వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
నేసి కొంత, యదియె నెచ్చెలువకుఁ
జూపి, ముదము గొనఁగనే, పూర్తిగాఁ దాను
నేయు; లేదొ, పర కులాయ మల్లు! 9


కం.
గేహముఁ బూర్తిగ నేసియు
గేహినిఁ బిలువంగ మివులఁ గేరింతలతో
స్నేహము నెఱపుచుఁ దిరుగుచు
మోహపరవశ యయి చేరు మురిపెమునఁ జెలున్! 10


ఉ.
నేలకు నింగికిన్ సరిగ నేస్తము లల్లిన గూఁటి వన్నియల్;
మాలిమి తోడ వర్తిలెడి మంజుమనోహర నాట్యరీతి; రా
గాలసమైన పాట; కవులాదరమున్ వెలిఁబుచ్చుచుండఁ దాఁ
గాలముఁ బుచ్చుచుండు గిజిగాఁ డట హాయినిఁ జిల్కరించుచున్! 11
-:శుభం భూయాత్:-


10 కామెంట్‌లు:

 1. ఏదైనా కవిత్వీకరించ గల మధుర కవనం మీది
  మనసు మరో లోకంలో విహరింప జేసగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు వీరా గారూ. మీ అభిమానపూర్వకాభినందనలకు కడుంగడు కృతజ్ఞుడను.

   తొలగించండి
 2. గిజిగాడు కన్నా మీరే బాగా రచించారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు మురళి గారూ! మహాకవులతో నన్ను పోల్తురా. నేను అణువును. వారు మేరునగధీరులు. మీ అభిమానానికి ధన్యుడను.

   తొలగించండి
 3. గిజిగాడు కన్నా మీరే బాగా రచించారు

  రిప్లయితొలగించండి
 4. చిన్న వస్తువు తీసుకుని పూర్తి కవనం చేయడం మీ నేర్పరి తనం తెలుపుతుంది. చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 5. ఫోటోలు కూడా పద్యాలకు తగ్గట్టు ఎన్నుకుంటారు, చాలా బాగున్నాయి.

  రిప్లయితొలగించండి