Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 21, 2016

బాలల నీతి పద్య కథలు: ఉపకారికి అపకారం చేయరాదు!




ఒక యడవిఁ, జెట్టు బొఱియలో, నొక్క తేలు
జీవనము గడపుచు నుండె స్థిరత! నటవి
ప్రక్కనే యున్న సరసిలో నొక్క కూర్మ
మచటి వృశ్చిక స్నేహియై మనుచు నుండు!! 1


కచ్ఛపము గర్విగా నెప్డు కాక, జాలి
గుండెఁ గలిగియు మెలఁగుచు నుండు నెపుడు!
తేలు గర్వియై, మూర్ఖత నేలుచుఁ, దన
చేష్టచేఁ బరులకుఁ గీడు సేయుచుండు!! 2


ఒక్క గ్రీష్మాన, నెండ పెంపెక్కఁ గాను,
తినుట కెద్దియు దొరుకక, వనము వదలి,
తేలు పోవఁ జూడఁగనుఁ, దాఁబేలుఁ గూడఁ
దనను వెంబడించెను, స్నేహధర్మమూని! 3


కొంత దూరము నడువఁగఁ, బొంతనున్న
చెఱువు దాఁటంగ వలసి వచ్చె నిరువురకు;
వృశ్చికమ్మది గని, దాఁటలేక దిగులు
చెందఁ, దాఁబేలు తనపై వసింపఁ జేసె! 4


అంత కాసారమునఁ దాను కొంత దవ్వు
చనఁగ పైనున్న వృశ్చికమునకు నొక్క
శంక పొడమి, "యందఱనుఁ బుచ్ఛమునఁ జీల్తుఁ;
గూర్మ కవచమ్ముఁ జీల్ప శక్తుఁడ నగుదునె?" 5


అనుచు యోచించి, వెంటనే యట్టి పనికిఁ
బూని, చేయుచు నుండంగఁ, బొడిచి నట్టు
లుగనుఁ దోఁచియుఁ గమఠమ్ము, లూమవిషము
నడిగె, "సఖ! నీవు చేయుచున్న పని యేమి?" 6


అనుచు నడుగఁగఁ, దేలును వినిచె నిటుల,
"యేమియును లేదు మిత్రమా! నా మనమున
’నీదు కవచమ్ముఁ జీల్పఁగ, నాదు పుచ్ఛ
మునకు సాధ్యమగునొ కాదొ’ యని తలఁచియు; 7


నీదు చిప్పపైఁ గొండితో మోదుచుంటి!
నంతియే" యనుచుఁ బృదాకు వంతఁ దెలుపఁ;
గూర్మ మది విని, ’యీ తేలు, కొండి తోడ
నాకు గాయముం జేయుచున్నది సహమ్మె?’ 8


అనుకొనుచు "నో కృతఘ్నుఁడా! నిను నరయఁగ,
నేనె కష్టించి యీఁదుచు నిపుడు సనఁగ,
నన్నుఁ గీడునఁ ద్రోసెదే? నిన్నుఁ గావ
మాని, చంపుటె యగును ధర్మమ్ము ధరను!" 9


అనుచుఁ గూర్మము, తేలు తోడను సరసిని
మునిఁగెఁ; దేలు, నీటను శ్వాసఁ గొనఁగ లేక,
మరణ మందెను! తాఁబేలు మన నెటొ సనె!!
మేలుఁ గొని, కీడు నిడఁగాను, మేలగు నొకొ? 10


స్వస్తి



గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.

2 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది. కొత్తకధ. నేను మునుపు వినలేదు. కధనం చిన్నపిల్లలకు కూడా అర్ధమయ్యేలా వ్రాశారు. బొమ్మ కూడా బాగుంది

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలండీ రమణ గారూ! నేనీ పద్య కథలను బాలల కోసమే ఉద్దేశించి రాస్తున్నాను. వారు ఈ కథల మూలమున భాషాభివృద్ధిని, రసానందమును, పద్య పఠన, రచనాభిలాషను సంపాదించి, మన పూర్వులు మన కిచ్చిన పద్యకావ్యములను, పద్య సంప్రదాయమును నిలబెట్టాలనే నా ఆకాంక్ష! "తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు"....

    రిప్లయితొలగించండి