Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 17, 2016

బాలల నీతి పద్య కథలు: దురాశ దుఃఖమునకు చేటు!




ఒక్క గ్రామాన బీదయౌ నొక్క గేస్తు
బాతు గ్రుడ్లమ్మి జీవించువాఁడు గలఁడు!
వాఁడొక దినాన గ్రుడ్లు కరండమందుఁ
బెట్టుకొనుచును, నొకగ్రుడ్డు విడిచి చనియె! 1




దాని నా బాతు పొదుగంగ, దానినుండి
బాతుపిల్లయె వెలికిని వచ్చె నంత!
నదియు దినదినమ్మునుఁ బెద్ద యగుచుఁ
గడమ బాతుల కన్ననుఁ బోఁడిమిఁ గనె! 2




ఒక్కనాఁ డంత బాతు దా నొక్క గ్రుడ్డుఁ
బెట్టఁగా, నది మెఱయుచు వెలుఁగుచుండె!
నదియ బంగారు గ్రుడ్డౌట, నపు డతండు
సంతసమ్మునఁ గొని, యమ్మి, సరుకులఁ గొనె! 3




మఱు దినమ్మున నట్టులే మఱొక గ్రుడ్డు
పెట్ట సంతోషపడుచును సెట్టికి నిడి,
యాతఁ డిచ్చిన సొమ్ముతో నంత సరుకుఁ
గొనియు నాతండు మురిసెను కోర్కె దీఱ! 4




ఇట్టె బంగారు గ్రుడ్డునుఁ బెట్టుచుండ
నతఁ డనతి కాలముననె ధనాధికుఁ డయె!
దినదినమ్మును నాతఁడు దివ్యముగను
వెలిఁగి పోవుచు నుండెను విత్త మెదుగ! 5




కొంత కాలమ్ము నట్టులే సంతసమునఁ
గడచి పోవఁగ, నాతఁ డొక్కటను నిట్లు
"ప్రతిదినమ్మున కొక్కటే బాతు గ్రుడ్డు
పెట్టు దాఁక నాగుట కాల వృథయె కాదె? 6




ఇదియ యొక్కొక్క గ్రుడ్డును నిచ్చుదనుక
నాఁగు కన్నను, నొక తఱి నక్కజముగ,
దాని పొట్టనుఁ జీల్చుచోఁ, దనియఁ జేయు
నన్ని గ్రుడ్లును వెలువడు!" ననుచుఁ దలఁచె! 7




తలఁచి నంతనె యాతండు దానిఁ బట్టి,
కాళ్ళు త్రాళ్ళతోఁ గట్టియు ఘనము గాను,
వాడి యైనట్టి యొక కత్తిఁ బట్టి, దాని
పొట్టఁ జీల్పఁ, బసిఁడి గ్రుడ్లు పుట్టవాయె! 8




వసయు, మాంసమ్ముఁ, బ్రేవులు బయలు వెడలి,
పసిఁడి గ్రుడ్లేవి కన్నులఁ బడక యున్న,
నెత్తి నోరును లబలబ మొత్తికొనుచు,
నేడ్వఁ దొడఁగెను రాగమ్ము నింగి కెగయ! 9




"బాతు చచ్చెను! బంగారు బాతు గ్రుడ్లు
ప్రతిదిన మ్మెట్లు లభియించురా!" యటంచుఁ
దనదు తొందరపాటునకును వగచెను!
గన, దురాశ దుఃఖమునకుఁ గారణ మగు!! 10




స్వస్తి


గమనిక: మిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయడం మరువ వలద ని మనవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి