Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మార్చి 18, 2018

శ్రీ కంది శంకరయ్య గారి సన్మానము



సుకవులు, గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి జాతీయ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత, సమస్యాపృచ్ఛక చక్రవర్తి, శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు,
మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
గౌరవ పురస్సరముగా సమర్పించుకొను

-:సాదర పద్య సుమార్చన:-

ఉ.
శ్రీయుత కంది వంశ వర! శ్రేష్ఠ గుణాన్విత! సత్ప్రకీర్తితా!
శ్రేయద! శిష్ట మండిత! విశేష మహోదయ! శంకరాఖ్య! ప
ద్యాయత శంకరాభరణ యాజ్ఞిక! సత్కవిజాత మార్గద
ర్శీ! యువ ధీ బలా! ప్రకట శిష్య సమర్చిత! పద్య పోషకా! 1

మ.
మహిమోపేతసుశబ్దయుక్తకవితామార్గప్రదౌత్సుక్యతన్,
సహసాశూక్తిఁ గవీంద్ర సంహతి మనశ్శబ్దార్థసంశీతిఁ బ్ర
త్యహముం దీర్చుచు, "శంకరాభరణ" విద్యాహృద్యపద్యాల్ ముహు
ర్ముహురావృత్తిగ వ్యాప్తిఁ జేతు; విదె కొమ్మో శంకరా సత్కృతుల్! 2


సీ.(మాలిక)
శైశవమ్ముననుండి సాహిత్య విద్యలో రాణించి యెదిగిన రత్న మీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి, తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక హితముఁ గల్గించు సౌహృదుఁడ వీవు;
కోప మింతయు లేక, కోమలమ్మగు వాక్కు, చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
శ్రీశుని, వరదుని, శ్రీ వేల్పుఁగొండ నృసింహు శతకము లర్చించి తీవు;
షిరిడీశు, నయ్యపన్ స్థిరమైన భక్తితోఁ గరముఁ గొల్చిన గేయకర్త వీవు;
దేశవిదేశ సుస్థిరతరాంతర్జాల పద్య ప్రచారక ప్రముఖుఁ డీవు;
సహనానఁ గవుల సత్సందేహములఁ దీర్చి, పద్యవిద్యనుఁ బెంచు వరదుఁ డీవు;
ప్రముఖావధాన సంభావ్య సత్సభలందు, వరపృచ్ఛకాళిలోఁ బ్రథముఁ డీవు;
సాహితీ సంస్థల సత్కృతు లనిశమ్ముఁ గొని, వెల్గుచున్న సద్గురుఁడ వీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు! బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు! కవుల కందఱ కాదర్శ కవివి నీవు!! 3

కం.
హృద్యములగు పద్యమ్ముల నాద్యంత సువేద్యముగ, నిరాటంకముగా,
శ్రీద్యుతి చెన్నలరారఁగ, సద్యః ప్రభలొలుక రచన సాఁగింతువయా! 4

తే.గీ.(మాలిక)
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి, పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన ధర్మ సద్గుణ శౌచ సత్యములు గలిగి,
యొజ్జబంతివై, కవులకే యొజ్జవైన నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక! 5

శుభం భూయాత్

 పత్ర రచన:                                                        పత్ర సమర్పణ:
మధురకవి                             శ్రీ రాజరాజ నరేంద్రాంధ్రభాషా నిలయం
గుండు మధుసూదన్                            హన్మకొండ, వరంగల్లు    
వరంగల్లు                        


సోమవారం, మార్చి 12, 2018

వరంగల్ అష్టావధానం (పోతన ఆడిటోరియంలో)

అవధాని శ్రీ ముత్యంపేఁట గౌరీశంకర శర్మ గారు

అవధాని శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

 
అవధానులు, సమన్వయకర్త, పృచ్ఛకులు అవధాన సభలో ఉన్నప్పటి ఛాయాచిత్రం

సమన్వయకర్త శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు అవధానసభను ప్రారంభించినప్పటి ఛాయాచిత్రం

అవధానులను సన్మాన పత్ర పఠనచే సన్మానించినప్పటి ఛాయాచిత్రం


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వరంగల్ (పట్టణ) జిల్లాలోని 
పోతన విజ్ఞాన పీఠము యొక్క 
31వ వార్షికోత్సవాల సందర్భంగా, 
దివి: 11-03-2018 ఆదివారం సాయంత్రం గం.06-00 లకు 
పోతన ఆడిటోరియంలో జరిగిన 
జంటకవుల అష్టావధానం 
విశేషాలు...

అవధానులు: 
శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు
మఱియు
శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

సంచాలకులు:
శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరబాబు గారు

అవధానుల దేవతాప్రార్థనాదికాలు పూర్తయిన తర్వాత జరిగిన అవధాన కార్యక్రమం:

1. నిషిద్ధాక్షరి:
శ్రీ కంది శంకరయ్య గారు...
వరంగల్ పట్టణానికే తలమానికమైనవాఁడు, సంస్కృతాంధ్ర పండితుఁడు, సభాసమ్రాట్టు, విశిష్ట అష్టావధాని,  స్వర్గీయ డా. ఇందారపు కిషన్ రావు గారి అవధాన వైభవాన్ని వర్ణించమనగా....

శ్రీ (య) మ (త) య (ను)వే (ద) షా | భూ (ష) తిన్
(మ) కామ | న (వ) ర (హ) ంజి (ల్ల) ంప (న) జే (య)సి క (వ) ల్గి (ప) ంచ (మ) య్యా

గమనిక:-  (...) = నిషేధితాక్షరం, (|) = నిషేధించకుండా వదలడం

రెండు పాదాల వఱకు నిషిద్ధం జరిగినది. దీనికి మరి రెండు పాదాలు చేర్చి...

కం.
శ్రీ మయ వేషా భూతిన్
కామన రంజింపఁ జేసి కల్గించయ్యా
ప్రేమన్ గవితల నిచ్చుచు
మా మనములు నిండ కిషను మాన్యా గోష్ఠిన్!

అని పూర్తి చేశారు.

2. సమస్యాపూరణం:
శ్రీ గుండు మధుసూదన్ గారు...

"శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్" అనే సమస్యను ఈయగా....

పూరణ:
ఉ.
పూత చరిత్రముం గలిగి, పూర్ణయశస్సునుఁ గాంచినట్టి వి
ద్యాతత సాధుమూర్తి; సుగుణాన్విత దివ్య దిగంత కీర్తి, వి
ఖ్యాతుఁడు రామచంద్రు ప్రియకాంత వియోగ విదగ్ధ వేళలో
శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్!

అని పూరించారు.

3. వర్ణన (సంస్కృతం):
శ్రీ గోగికార్ ప్రకాశ్ గారు కాకతీయ యుగ ప్రసిద్ధ గ్రంథ/కవి విశేషాలను వర్ణించుమని సంస్కృతంలో అడుగగా...

వసంతతిలకావృత్తం:
శ్రీకాకతీయ వర దివ్య విశేష దేశే
విద్యాధినాథ బహు గ్రంథ విశిష్ట సేవాం|
ప్రాతాపరుద్ర వర కావ్య ప్రశస్త శైలీం
వందామహే ప్రతిదినం చ మహత్త్వయోగాత్||

అని వర్ణించారు.

4. దత్తపది:
శ్రీ చేపూరి శ్రీరామారావు గారు...
చెప్పు - చీపురు - చేట - పేడ ....అనే పదాలనిచ్చి,
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు చేసిన సన్మానాన్ని
ఇష్టమైన వృత్తంలో వర్ణించమనగా....

చం.
"సిరులనుఁ గూర్చు కావ్యమును చెప్పుమ పెద్దన! గొప్పగా, శుచీ
పురులకు వందనం బిడుచు, బుద్ధికిఁ దోచిన యూహఁ జేయుచున్,
స్థిరతనుఁ గూర్చు శబ్దముల చేటవకుండఁగ, శాశ్వతమ్ము శ్రీ
కరముగ!" నంచు రాయలు సుఖంబుగఁ బేడలఁ జేసె సత్కృతిన్!

[పేడ = మంజూష, పెద్దపెట్టె] [పేడలన్=పెద్ద పెద్ద పెట్టెల నిండుగా గల రత్న రాశులతో]
అని వర్ణించారు.

5. తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకం:
శ్రీ వజ్ఝల రంగాచార్య గారు...

(౧) ఆ.వె.
వ్రేళ్ళు మడచి యొక్క వేలెత్తి చూపఁగా
వేంకటేశ విభుఁడె వేలుపనుచు,
కలియుగమ్మునందు కామందు గోవిందు
చరణ రజముఁ గొలుతు శిరమునందు!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
బద్ధ్వాఙ్గుళీం ప్రవక్ష్యామి - వేఙ్కటేశస్య వైభవమ్ |
కలౌ యుగేశ గోవిన్దమ్ - వ్రజామి చరణౌ తవ ||

అనీ.....

(౨) ఆ.వె.
ఱెప్పల వల వేసి రేయంత వెదకితి
చిక్కదౌర మీన మొక్కసారి!
అంతరంగ జలధి యందెక్కడో యుండె
మిణుకు మిణుకు మనెడి మీను రూపు!!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
పక్ష్మజాలం సమాచ్ఛాద్యా - రాత్రౌ సంశోధనం కృతమ్ |
తథాఽపి లభతే నైవ - మీన మేకం తు మానసే ||

అనీ చెప్పారు.

6. ఆశువు:
శ్రీ ఎన్.వీ.ఎన్. చారి గారు...
త్రేతాయుగంలో వానర భోజనంలాగా, ఈనాటి భోజన సమయాల్లో ఏర్పాటు చేసే "బఫే భోజనాన్ని" వర్ణించమనగా....

(౧) ఆ.వె.
ఒకఁడు సెల్లుఁ జూచు నుత్సాహ మొప్పఁగ;
నొకఁడు సొల్లు వాగు నోర్వలేక;
యొకఁడు తినుచు వాని నూరక చూచును;
బహుళ చేష్ట లివియె బఫెల యందు!

అని వర్ణించారు.

మఱల వారే...
అవధాన సభలో స్త్రీలు పురుషులుగానూ, పురుషులు స్త్రీలుగానూ మారఁగా నీ యవధాన సభ యెటులుండునో వర్ణించఁగలరు....అనగా...

(౨) కం.
వీరయినను, వారయినను
వే ఱేమియు లేక కైత పేర్మిన్ గ్రోలన్
చీరలు ఱవికలె యైనను
సార మదొక్కటియె కాదె సాహిత్యరుచిన్!

...అని చెప్పారు.

7. అంత్యాక్షరి:
శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి గారు...

(౧)
"అగసుత భావనాబల సమంచితమై, మృదు వాగ్విలాసమై,
నిగమపికాంగనారవవినిర్గత తాళలయావధానమై,
సుగమ ముదాత్త భావనల శోభనమై, రస మండితమ్ముగన్
సొగసుల ’పద్యమై’ త్రిపురసుందరి మాకుఁ బ్రసన్నమయ్యెడిన్"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "నకారం"తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
నానా కవి సమాకీర్ణాం - సభాం దృష్ట్వా చ నిత్యశః |
నౌమి సారస్వతాకారాం - కాకతీయపురే శుభే ||

అని చెప్పారు.

(౨)
"అవలీలన్ రసభావముల్ పలుక పద్యమ్మై, మహాకావ్యమై,
వివిధాలంకృత శిల్పశక్తి చయమై, విద్యా ప్రధానంబునై,
చవులూరించు ధ్వనిప్రచోదక మహాశాస్త్రమ్మునై, స్ఫూర్తియై,
కవితారూపిణివౌచు నిల్చితె! వరంగల్ పాలికా! కాళికా!"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "క కారం" తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
కార్యార్థదాయినీం వన్దే - కాళికాం పుర పాలికాం |
శత్రు సంహారిణీం నిత్యం - రససిద్ధి ప్రదాయినీమ్ ||

అని చెప్పారు.

8. అప్రస్తుత ప్రసంగం:
శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారు వివిధములైన అప్రస్తుత ప్రసంగములు చేయగా, అవధానులు చమత్కారంగా సమాధానాలిచ్చి సభను రంజింపజేశారు.

చివరకు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ నమిలికొండ బాలకిషన్ రావు గారు జంట అవధానులను సన్మానించడంతో ఈ నాటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

స్వస్తి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గురువారం, మార్చి 01, 2018

హోళీ పర్వదిన విశిష్టత - 2

సంబంధిత చిత్రం

తేటగీతులు:
ఫాల్గునపు మాసమున వచ్చు పౌర్ణమి తిథి
నాఁడు కాముని పున్నమి నామకమున
జరుపు రంగుల పండుగ సకల జనుల
కైకమత్యమ్ము నేర్పుచు ఘనతఁ గనును!

ఇట్టి పండుగ జరుపుట కెన్నొ కథలు
గలవు! వానిలో నొక్కటిఁ గనఁగ నిదియ!
మునుపు శివుఁడు, సతి యెడబాటును సహింప
లేక, హిమవన్నగమ్మున నేకతముగఁ
దపము సేయంగఁ దొడఁగెఁ జిత్తమును నిలిపి!

అదియ కని, హిమవంతుఁడే యా శివునకు
సేవ లొనరింపఁ గూఁతు నుంచినఁ గనుఁగొని,
యింద్రు నాజ్ఞచే మన్మథుం డేయు పూల
బాణములకు హరుండు సంజ్వరమునంది;

తీక్ష్ణముగఁ ద్రినేత్రమ్మునుం దెఱచి చూడ;
భగ్గుమని మండి కాముండు భస్మమాయె!
రతియె ప్రార్థింప, శాంతించి, ప్రాణమునిడి,
"యతనుఁడై వెలుఁగొందు" నం చనిపె నపుడు!

అట్టి కామ దహనము నేఁ డగుట కతన,
జనులు ప్రతివత్సర మ్మిట్టి సంఘటనము
మఱచిపోకుంటకై నేఁడు మన్మథ దహ
నమ్ము సేయుచునుండి రంతటను విధిగ!

కామ దహ నోత్తర దినాన ఘనముగాను
ప్రజలు వివిధ వర్ణమ్ములఁ బఱఁగఁ జల్లు
కొనుచు సంతసమ్మునఁ బండుగును జరుపుచు
సంప్రదాయమ్ము నిలుప నెసంగుచుండ్రి!

ఈ వసంత కాలమ్మున నెట్టి విషపు
జ్వరములును రాక యుంటకై వనమునఁ గల
సహజ వర్ణాల సేకరించంగఁబూని,
యట్టి యౌషధ గుణముచే హాయి నుండ్రు!

నిమ్మ, కుంకుమ, బిల్వ, దానిమ్మ, పసుపు,
కింశుకపుఁ బుష్ప సంచయాంకితులునయ్యు,
సహజ వర్ణాలఁ బ్రకృతిచే జగము మెఱయ
రంగులనుఁ జల్లుకొందురు రమణమీఱ!

ఇట్టి ప్రాకృతికపు రంగు లెన్నియేని
వాడుచో నెట్టి హానియుఁ బడయకుండ,
నౌషధ గుణమ్ముచేత జాడ్యములు తొలఁగి,
ప్రజలు నారోగ్యముగ నుందురయ నిరతము!

అధిక సముపార్జనాపేక్షనంది కొంద
ఱిట రసాయన మిళిత సంస్కృతినిఁ బూని,
వర్ణములఁ గృత్రిమ రసాయ నార్ణవమ్ముఁ
జేసి, ప్రజ రుజగ్రస్థులఁ జేయుచుంట,
మనకు దురదృష్టముగ మారెఁ గనఁగ నిపుడు!

స్వస్తి


హోళీ పర్వదిన విశిష్టత - 1

సంబంధిత చిత్రం


తేటగీతులు:
ప్రకృతి శోభనుఁ బెంచెడి వర్ణ మిళిత
కుసుమముల వికసనములు కొమ రెసంగ
ఫాల్గునమ్మున దరిఁజేరు పౌర్ణమికిని
వచ్చె వాసంతుఁ డిలకు సద్వర్ణయుతుఁడు!

అట్టి దినమునే హోళిగా నభినుతించి
ప్రజలు నలరంగ నొనరింత్రు! వర్ణములనుఁ
జల్లుకొంద్రు వెదకి వరుసలనుఁ గనియుఁ
బిన్నలునుఁ బెద్దలందఱు వేడ్కమీఱ!!

వైష్ణవము ప్రకారమ్ముగఁ బఱఁగ నిదియ
లచ్చిమగని "రిపు"వని హిరణ్యకశిపుఁ
డనుచు, హరినిఁ దలంచు ప్రహ్లాదు నెన్నొ
వెరవులుగఁ జంపఁగాఁ బూన, హరియె కాచె!!

ఎన్ని విధములఁ జంపఁ బూనినను, కొడుకు
చావకుంటకు విష్ణునే సాకుగఁగొని,
తనదు చెల్లి హోళికఁ దన దహన రహిత
వస్త్ర సహితగ రప్పించె వహ్నిదూఁక!

హోళికయె వచ్చి ప్రహ్లాదు నొడిని నుంచి,
యగ్నిమధ్యమ్మునందున నాస్థఁ గూరు
చుండ, విష్ణుండును మహాప్రచండవాయు
వీచికం బంప, వస్త్రమ్ము వెడలెఁ బైఁకి!

అట్టి వస్త్రమ్మె యెగసి ప్రహ్లాదు నొడలుఁ
గ్రమ్మ, నగ్నిలో హోళిక కాలిపోయెఁ!
బిదప నరసింహుఁడై హరి, ద్విషునిఁ జంపి,
బాల ప్రహ్లాదునిం గాఁచి, వరము లొసఁగె!

నాఁటి దినము రాక్షసబాధ నణఁచినట్టి
దినము కావున దాని ప్రతిష్ఠ నెఱిఁగి,
హోళి పండుగ జరుపుచునుండి కాష్ఠ
ములనుఁ బేర్చియు ధహియింత్రు మోదమునను!

దహన కాండకుఁ బిదప సంతసముతోడ
వర్ణములఁ జల్లుకొనుచును వరుస నెఱిఁగి,
హర్షవాక్కుల, క్రీడల నలసి సొలసి
పోవు దనుక నాడుచునుండ్రి భువిని జనులు!

రంగులనుఁ జల్లుకొనఁగఁ బేరందినట్టి
మఱొక కథయుఁ గలదు చూడ! మధురలోనఁ
గృష్ణు వర్ణమ్ము నీలమై కెఱలుచుండఁ
దల్లియౌ యశోదమ్మ తాఁ దలఁచె నిట్లు;

"తెలుపు రాధ, శ్రీకృష్ణుండు నలుపు; వారి
రంగులను భేదముండంగ రా" దటంచు,
సరిగ నీ దినమ్ముననె సంతసమునఁ దల్లి
కృష్ణునిన్ రాధను వసంతకేళి కనిపె!

తేలి రిద్దఱును వసంతకేళియందు,
వర్ణములనొక్క రొకరిపై పఱుప, నప్పు
డిద్దఱకు రూపభేదమ్ము డిందఁ, దల్లి
మురిసె నానందమున, వారు ముద్దులొలుక!

నాఁటి నుండియు రంగులంటంగ జనులు
వర్ణభేదాలు లేకుండ పఱఁగ నిట్లు
హోళి పండుగలో వర్ణ మొలుక, చిలుక,
రూప భేదాలు సమసె స్వరూపమందు!

ప్రజలు నందఱుం బర్వంపు భావనమునఁ
గులమతమ్ముల మఱచుటం గోరుకొనఁగ,
మానవులు సర్వులొక్కటే! మనెడు నపుడు
వేఱు వేఱంచుఁ దలఁతురు భిన్నమతులు!!

స్వస్తి