Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 25, 2015

నిషిద్ధాక్షరి: కవర్గాక్షర నిషేధం...కాకాసురవృత్తాంతం...నచ్చిన ఛందస్సులో...

తేది: నవంబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన
కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతిమాలిక...


దుష్ట వాయస రూప దైత్యుండు మైథి
లిని వ్యధితఁ జేయ, రాముండు వ్రీతి దర్భఁ
జేత నంది బ్రహ్మాస్త్రముం బూత మంత్ర
సహితనున్ విడువ, నదియు సాల్వుఁ జంప
వెంటఁబడఁ బరువెత్తుచు భీతిఁ ద్రిభువ
నమ్ములను సంచరించుచు "నన్నుఁ బ్రోవు"
మంచుఁ బిలువ, నెవ్వండు నోమను, దరిఁ జనఁ
దెంపు సేయనుఁ బుయిలోడఁ, దెలిసి వాఁడు
మఱలి శ్రీరాము "శరణ మి"మ్మనుచు వేడ,
"దానిని మఱలింపను నసాధ్య"మ్మటంచు,
నతని దేహాంశ మిచ్చిన నదియు శాంతిఁ
బొందునన, నేత్రమును నిచ్చి, పోయినాఁడు,
తనదు తప్పును మన్నింపు మనుచు వేడి!!

(ఇది కాకాసురవృత్తాంతము)

శుభం భూయాత్


మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

సమస్య: రాముండిటు రమ్మటంచు రాధనుఁ బిలిచెన్

తేది: అక్టోబర్ 31, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము.



సోమనిభ వక్త్ర వల్లవ
భామలతో రాసకేళి వదలి వినీల
శ్యాముఁడు రాధాహృదయా
రాముం "డిటు ర" మ్మటంచు, రాధనుఁ బిలిచెన్!